టీఓఏలో ఎన్నికల రగడ
ABN, Publish Date - Jul 03 , 2024 | 02:59 AM
రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధిలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ).. ఆ బాధ్యతను పక్కకి పెట్టి వర్గ పోరుతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది...
గందరగోళంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
కొన్ని క్రీడా సంఘాల ఓట్లు తొలగింపు
హైకోర్టుకు అసోసియేషన్ ప్రతినిధులు
అధ్యక్ష రేసులో జితేందర్ రెడ్డి, మహేష్ గౌడ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధిలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ).. ఆ బాధ్యతను పక్కకి పెట్టి వర్గ పోరుతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. గత పదేళ్లలో టీఓఏ ప్రభుత్వంతో చర్చలు జరిపి క్రీడా సంఘాలకు రావాల్సిన గ్రాంట్ల విడుదలలో కానీ, ప్రతిభావంతులైన క్రీడాకారులకు సర్కార్ నుంచి ప్రోత్సాహకాలు ఇప్పించడంలో పూర్తిగా విఫలమైంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్జ్) నుంచి టీఓఏకు, రాష్ట్రంలో పలు క్రీడా సంఘాలకు గుర్తింపు లేని కారణంగా స్పోర్ట్స్ కోటా కింద విద్యా ప్రవేశాల్లో క్రీడాకారులకు దక్కాల్సిన సీట్లు కూడా లభించక గత పదేళ్లలో వేల మంది క్రీడాకారులు నష్టపోయారు. ఇలా ఏ విధంగానూ క్రీడాకారులకు ఊతమివ్వలేకపోతున్న టీఓఏ.. ముఠా రాజకీయాల వివాదాలతో, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నుంచి వచ్చే నిధులను స్వాహా చేయడంలో మాత్రం ముందుంటున్నదన్న విమర్శలను మూట గట్టుకుంటోం ది. తాజాగా టీఓఏ బ్యాంకు ఖాతాలోని సుమారు రూ.8 లక్షలు వ్యక్తిగత అకౌంట్లలోకి తరలించడంపైన, సంఘం నిధులను దుర్వినియోగం చేసినట్టు కేసులు కూడా నమోదయ్యాయి. జాతీయ స్పోర్ట్స్ కోడ్‌ను రాష్ట్రంలో 2020 నుంచి అమలు చేస్తున్నా దానిని టీఓఏ పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తోందని పలువురు క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. అస్మదీయుల దగ్గరకు వచ్చేసరికి నిబంధనలన్నీ గాలికి వదిలేసి, తమను ప్రశ్నించేవారిపై మాత్రం సవాలక్ష రూల్స్ పెట్టి ప్రస్తుత టీఓఏ పెద్దలు వేధిస్తున్నారని ఇటీవల ఐదు క్రీడా సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.
ఎన్నికల నిర్వహణపై వివాదం..
ప్రస్తుత కార్యవర్గ పదవి కాలం ముగియడంతో ఈ ఏడాది మే 19న ఎన్నికల నోటిఫికేషన్‌ను గందరగోళంగా విడుదల చేసి, జూన్ 9వ తేదీన ఎలక్షన్ నిర్వహించాలని కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో తమకు వ్యతిరేకంగా ఉన్న పదికి పైగా క్రీడా సంఘాల ఓట్లను తొలగించారని సమాచారం. మరికొన్ని క్రీడా సంఘాల ప్రతినిధులపై ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారట. దీంతో వివాదం ముదిరి హైకోర్టుకు చేరింది. న్యాయస్థానం ఎన్నికల ప్రక్రియను నిలుపదల చేస్తూ స్టే ఇచ్చింది. అయితే, నోటిఫికేషన్ ఇచ్చాక జగదీశ్వర్ యాదవ్ వర్గం.. అధ్యక్ష పదవికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో నామినేషన్ వేయించింది. కాగా, జితేందర్ రెడ్డికి 70 ఏళ్లు నిండడంతో స్పోర్ట్స్ కోడ్‌కు విరుద్ధంగా ఆయనను ఎలా పోటీకి అనుమతిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు స్క్వాష్ సంఘం నుంచి టీఓఏ అధ్యక్ష బరిలోకి దిగుదామనుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్‌పై ప్రత్యర్థి వర్గం నామినేషన్ వేయనీయకుండా అనర్హత వేటు వేసింది. దీంతో టీఓఏలో వర్గ పోరు తారస్థాయికి చేరుకుంది. క్రీడా మంత్రిత్వ శాఖను సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తుండడంతో రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధి పథంలో నడిపించేందుకు టీఓఏను గాడిన పెట్టాలని పలు క్రీడా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
నిస్తేజంగా ఒలింపిక్ సంఘం
ఈ ఫిబ్రవరిలో టీఓఏ ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం ముగిసింది. 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రోద్బలంతో అధ్యక్షుడిగా నెగ్గిన ప్రభుత్వ ఐటీశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కనీసం బాధ్యతలు కూడా తీసుకోకుండానే నాలుగేళ్లు కాలయాపన చేయడంతో, తాత్కాలిక అధ్యక్షుడిగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలచారిని పెట్టి బండి నెట్టుకొచ్చారు. టీఓఏను పదవుల కోసమే వాడుకుంటున్నారు తప్ప, క్రీడా రంగం మేలు కోసం పని చేసే వ్యవస్థగా నడిపించడంలో ప్రస్తుత కార్యవర్గం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు చెలరేగుతున్నాయి. 70 ఏళ్లు నిండిన వారు, వరుసగా రెండు పర్యాయాలు కార్యవర్గ సభ్యులుగా పని చేసిన వారు పోటీ చేయకూడదనే స్పోర్ట్స్ కోడ్ నిబంధనలున్నా.. వాటిని భేఖాతరు చేస్తూ ఇష్టానుసారం టీఓఏను నడిపిస్తున్నారు.
Updated Date - Jul 03 , 2024 | 02:59 AM