India vs South Africa T20 : శతక తాండవం
ABN, Publish Date - Nov 16 , 2024 | 06:41 AM
నాలుగు టీ20ల సిరీ్‌సను భారత్ అదిరిపోయే రీతిలో ముగించింది. యువ బ్యాటర్లు తిలక్ వర్మ (47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 నాటౌట్), సంజూ శాంసన్ (56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 109 నాటౌట్) అజేయ శతకాలతో మోత మోగించారు.
తిలక్, శాంసన్ సెంచరీల మోత
3-1తో భారత్‌దే సిరీస్
నాలుగో టీ20లో 135 రన్స్‌తో
దక్షిణాఫ్రికా చిత్తు
అద్భుతం.. అపూర్వం. టీ20 మ్యాచ్‌లో ఒక సెంచరీయే అరుదనుకుంటే.. ఇక్కడ ఒకే ఇన్నింగ్స్‌లో రెండు నమోదయ్యాయి. ఓ వైపు తిలక్ వర్మ, మరో వైపు సంజూ శాంసన్ పూనకం వచ్చిన మాదిరి సఫారీ బౌలర్లపై విరుచుకుపడగా వాండరర్స్ మైదానంలో పరుగుల జడివానే కురిసింది. దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌లపై బౌండరీలు కొట్టడం ఇంత సులువా అన్నట్టుగా ఈ జోడీ చెలరేగింది. ఈ వీర బాదుడుతో తెలుగు తేజం తిలక్ వర్మ వరుసగా రెండో శతకం అందుకోగా.. శాంసన్ రెండు డకౌట్ల నుంచి తేరుకుని సిరీస్‌లో మరో సెంచరీతో దుమ్మురేపాడు. రెండో వికెట్‌కు 210 పరుగుల అజేయ భాగస్వామ్యంలో వీరు 19 సిక్సర్లు, 15 ఫోర్లు బాదడం విశేషం. అటు భారీ స్కోరును ఛేదించలేక దక్షిణాఫ్రికా సిరీస్‌ను సమర్పించుకుంది.
జొహాన్నె్‌సబర్గ్: నాలుగు టీ20ల సిరీ్‌సను భారత్ అదిరిపోయే రీతిలో ముగించింది. యువ బ్యాటర్లు తిలక్ వర్మ (47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 నాటౌట్), సంజూ శాంసన్ (56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 109 నాటౌట్) అజేయ శతకాలతో మోత మోగించారు. అటు బౌలర్లు ఎప్పటిలాగే రాణించడంతో శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో భారత్ 135 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే సిరీ్‌సను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు సాధించింది. అభిషేక్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 36) రాణించాడు. సిపామ్లకు ఏకైక వికెట్ దక్కింది. ఆ తర్వాత ఛేదనలో దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకు కుప్పకూలింది. స్టబ్స్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43), మిల్లర్ (27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36), జాన్సెన్ (12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 నాటౌట్) మాత్రమే ఆకట్టుకున్నారు. అర్ష్‌దీ్‌పనకు మూడు, వరుణ్.. అక్షర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా తిలక్ నిలిచాడు.
పోరాటమే లేకుండా..
కళ్లముందు భారీ లక్ష్య ఛేదన ఉండడంతో సఫారీలు ఆరంభం నుంచే తడబడ్డారు. పేసర్లకు పిచ్ అనుకూలించడంతో చక్కటి స్వింగ్‌తో అర్ష్‌దీప్ చెలరేగాడు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ హెన్‌డ్రిక్స్‌ను డకౌట్ చేయగా.. హార్దిక్ తర్వాతి ఓవర్‌లోనే రికెల్టన్ (1)పనిబట్టాడు. ఇక వరుస బంతుల్లో మార్‌క్రమ్ (8), క్లాసెన్ (0)లను అర్ష్‌దీప్ వెనక్కిపంపడంతో 10/4 స్కోరుతో సఫారీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయారు. ఆ తర్వాత స్టబ్స్, మిల్లర్ ఐదో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం అందించడం మినహా వీరి ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగిందేమీ లేదు. 12వ ఓవర్‌లో మిల్లర్ 6,4,6తో బ్యాట్ ఝుళిపించి వరుణ్ చేతికి చిక్కగా.. తర్వాతి ఓవర్‌లోనే స్టబ్స్‌ను బిష్ణోయ్ అవుట్ చేయడంతో ఇక చేసేదేమీ లేకపోయింది. టెయిలెండర్లలో జాన్సెన్ భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు.
దుమ్మురేపిన తిలక్-శాంసన్
సిరీ్‌సలో తొలిసారి టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీనికి తగ్గట్టుగానే ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను వాయువేగంతో ఆరంభించారు. ఆ తర్వాత తిలక్ వర్మ తానేం తక్కువ కాదన్నట్టు గత మ్యాచ్ ఫామ్‌ను ఈసారీ ప్రదర్శించాడు. దీంతో భారత్ స్కోరు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లింది. ఆరంభంలో ఓపెనర్లు ప్రతీ బౌలర్‌ను వేటాడుతూ పరుగుల వరద పారించారు. తొలి ఓవర్‌లోనే అభిషేక్ క్యాచ్‌ను స్లిప్‌లో రీజా వదిలేశాడు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ అభిషేక్ ఐదో ఓవర్‌లో 6,6,4,6తో చెలరేగి 23 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లో సిపామ్లకు చిక్కడంతో తొలి వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పవర్‌ప్లేలో దక్షిణాఫ్రికాపై టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు. వన్‌డౌన్‌లో తిలక్ రాకతో సఫారీ బౌలర్ల కష్టాలు రెట్టింపయ్యాయి. తొమ్మిదో ఓవర్‌లో అతను రెండు సిక్సర్లు బాదడంతో స్కోరు వంద పరుగులు దాటింది. అటు శాంసన్ సహజశైలిలో చెలరేగి పదో ఓవర్‌లో రెండు సిక్సర్లతో 28 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. తిలక్ సైతం ఇదే ఓవర్‌లో రెండు ఫోర్లు సాధించడంతో 21 పరుగులు వచ్చాయి. పేసర్ సిపామ్లను లక్ష్యంగా చేసుకుని శాంసన్ రెండు, తిలక్ మరో సిక్సర్‌తో 20 పరుగులు రావడంతో 12వ ఓవర్‌లోనే జట్టు స్కోరు 160 దాటింది. ఇక మార్‌క్రమ్ ఓవర్‌లో అయితే తిలక్ వరుసగా 4,6,6,4తో 22 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ జోడీ ధాటికి ఆతిథ్య బౌలర్లకు ఎలా బంతులు వేయాలో కూడా అర్థం కాలేదు. ఇక, శాంసన్ 51 బంతుల్లో సిరీ్‌సలో రెండో శతకం సాధించాడు. తన 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తిలక్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర జాన్సెన్ వదిలేశాడు. దీంతో 40 బంతుల్లోనే తిలక్ కూడా వరుసగా రెండో సెంచరీని పూర్తి చేశాడు. 19వ ఓవర్‌లో తిలక్ 4,6,4తో దక్షిణాఫ్రికాలో అత్యధిక టీ20 స్కోరు (258)ను భారత్ దాటేసింది. ఆఖరి ఓవర్‌లో తిలక్ 4, శాంసన్ 6తో జట్టు 280+ స్కోరుతో అత్యంత పటిష్ఠ స్థితిలో నిలిచింది.
టీ20ల్లో వేగంగా (33 ఇన్నింగ్స్) మూడు శతకాలు సాధించిన రెండో బ్యాటర్‌గా శాంసన్. ఫిల్ సాల్ట్ (32 ఇన్నింగ్స్) ముందున్నాడు.
ఒకే క్యాలెండర్ ఏడాదిలో మూడు టీ20 శతకాలు బాదిన ఏకైక బ్యాటర్‌గా శాంసన్.
రెండు శాశ్వత సభ్య దేశాల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో రెండు సెంచరీలు నమోదవడం ఇదే తొలిసారి.
భారత్ తరఫున టీ20ల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక
భాగస్వామ్యం (210) నమోదు చేసిన తిలక్- శాంసన్
టీ20ల్లో రెండో అత్యధిక స్కోరు సాధించిన భారత్. ఈ ఏడాది అక్టోబరు 12న బంగ్లాదేశ్‌పై భారత్ అత్యధికంగా 297 పరుగుల స్కోరు చేసింది.
తమ టీ20ల్లో తొలి పది ఓవర్లలో రెండో అత్యధిక స్కోరు (129/1) సాధించిన
భారత్. బంగ్లాదేశ్‌పై ఎక్కువ పరుగులు (152/1) చేసింది.
భారత్ తరఫున రెండు వరుస టీ20 సెంచరీలు కొట్టిన రెండో బ్యాటర్‌గా తిలక్.
స్కోరుబోర్డు
భారత్: శాంసన్ (నాటౌట్) 109, అభిషేక్ (సి) క్లాసెన్ (బి) సిపామ్ల 36, తిలక్ (నాటౌట్) 120, ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 20 ఓవర్లలో 283/1; వికెట్ పతనం: 1-73; బౌలింగ్: జాన్సెన్ 4-0-42-0; కొట్జీ 3-0-43-0; సిపామ్ల 4-0-58-1; సిమెలానె 3-0-47-0; కేశవ్ మహరాజ్ 3-0-42-0; మార్‌క్రమ్ 2-0-30-0; స్టబ్స్ 1-0-21-0.
దక్షిణాఫ్రికా: రికెల్టన్ (సి) శాంసన్ (బి) హార్దిక్ 1, హెండ్రిక్స్ (బి) అర్ష్‌దీప్ 0, మార్‌క్రమ్ (సి) బిష్ణోయ్ (బి) అర్ష్‌దీప్ 8, స్టబ్స్ (ఎల్బీ) బిష్ణోయ్ 43, క్లాసెన్ (ఎల్బీ) అర్ష్‌దీప్ 0, మిల్లర్ (సి) తిలక్ (బి) వరుణ్ 36, జెన్సన్ (నాటౌట్) 29, సిమెలానె (సి) బిష్ణోయ్ (బి) వరుణ్ 2, కొట్జీ (సి) శాంసన్ (బి) అక్షర్ 12, కేశవ్ (సి) తిలక్ (బి) అక్షర్ 6, సిపామ్ల (సి) అక్షర్ (బి) రమణ్‌దీప్ 3, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 18.2 ఓవర్లలో 148 ఆలౌట్; వికెట్ల పతనం: 1-1, 2-1, 3-10, 4-10, 5-96, 6-96, 7-105, 8-131, 9-141, 10-148; బౌలింగ్: అర్ష్‌దీప్ 3-0-20-3, హార్దిక్ 3-1-8-1, రమణ్‌దీప్ 3.2-0-42-1, వరుణ్ 4-0-42-2, రవి బిష్ణోయ్ 3-0-28-1, అక్షర్ 2-0-6-2.
Updated Date - Nov 16 , 2024 | 06:41 AM