దేవుడా.. ఇంకెన్ని చేయాలి!
ABN, Publish Date - Dec 18 , 2024 | 05:06 AM
ముంబై బ్యాటర్ పృథ్వీ షాకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన పృథ్వీకి తాజాగా విజయ్ హజారే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ముంబై జట్టులో చోటు దక్కలేదు...
న్యూఢిల్లీ: ముంబై బ్యాటర్ పృథ్వీ షాకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన పృథ్వీకి తాజాగా విజయ్ హజారే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ముంబై జట్టులో చోటు దక్కలేదు. ఫిట్‌నెస్ సమస్యలు, క్రమశిక్షణ రాహిత్యం కారణంగా రంజీ సీజన్ మధ్యలోనే జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ.. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీతో మళ్లీ జట్టులోకొచ్చాడు. అయితే, ఆ టోర్నీలో అంతగా సత్తా చాటకపోయినా, జట్టుకు మెరుపు ఆరంభాలు అందించాడు. ఈ క్రమంలోనే హజారే టోర్నీకి ఎంపికవుతానని పృథ్వీ భావించాడు. కానీ, సెలెక్టర్లు ఉద్వాసన పలకడంతో తీవ్ర భావోద్వేగానికి గురైన పృథ్వీ.. తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘దేవుడా..చెప్పు. ఇంకా ఎన్ని చేయాలి? 65 ఇన్నింగ్స్‌లు.. 3399 పరుగులు.. 126 స్ట్రయిక్ రేట్.. 55.7 సగటు.. నమోదు చేసినా, ఇవేవీ నా ఎంపికకు సరిపోవడం లేదు.
అయినా నీ (దేవుడి)పై నమ్మకం సడలదు. కచ్చితంగా పునరాగమనం చేస్తా. ఓం సాయిరాం..’ అని పృథ్వీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. 25 ఏళ్ల షా టీమిండియా తరఫున అరంగేట్ర టెస్టులోనే శతకం బాదడంతో ఎంతో ప్రతిభావంతుడనే ప్రశంసలు అందుకొన్నాడు. కానీ, అదే జోరును కొనసాగించలేక జట్టులో చోటు కోల్పోయాడు.
Updated Date - Dec 18 , 2024 | 05:06 AM