కుర్రాళ్లు.. అదే జోరు
ABN, Publish Date - Jul 11 , 2024 | 02:39 AM
సమష్టిగా రాణించిన భారత యువ జట్టు.. జింబాబ్వే టూర్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49) బ్యాట్‌తో అదరగొట్టగా.. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ వాషింగ్టన్ సుందర్...
వరుసగా రెండో విజయం
రాణించిన గిల్, రుతురాజ్
తిప్పేసిన సుందర్
మూడో టీ20లో జింబాబ్వే చిత్తు
హరారే: సమష్టిగా రాణించిన భారత యువ జట్టు.. జింబాబ్వే టూర్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49) బ్యాట్‌తో అదరగొట్టగా.. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ వాషింగ్టన్ సుందర్ (4-0-15-3) బంతితో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. ఫలితంగా బుధవారం జరిగిన మూడో టీ20లో భారత్ 23 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. 5 టీ20ల సిరీ్‌సలో 2-1తో ఆధిక్యం సాధించింది. ఇరుజట్ల మధ్య నాలుగో మ్యాచ్ శనివారం జరగనుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 182/4 స్కోరు చేసింది. సికందర్ రజా, ముజరబాని చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (36), కెప్టెన్ గిల్ జట్టుకు శుభారంభాన్నిచ్చారు. టీ20 వరల్డ్‌క్‌పలో బెంచ్‌కే పరిమితమైన జైస్వాల్.. ఇక్కడ ఆరంభం నుంచే దూకుడైన బ్యాటింగ్ చేయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి టీమిండియా 55/0తో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే, జైస్వాల్‌ను రజా క్యాచవుట్ చేయడంతో.. తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన అభిషేక్ శర్మ (10) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. కానీ, ఆ తర్వాత వచ్చిన రుతురాజ్.. జింబాబ్వే బౌలర్ల పనిబట్టాడు.
గిల్‌తో కలసి మూడో వికెట్‌కు 44 బంతుల్లో 72 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. అర్ధ శతకం సాధించిన గిల్‌తోపాటు గైక్వాడ్‌ను ముజరబాని పెవిలియన్ చేర్చాడు. అయితే, సంజూ శాంసన్ (12 నాటౌట్), రింకూ సింగ్ (1 నాటౌట్) జట్టు స్కోరును 180 మార్క్ దాటించారు. ఛేదనలో జింబాబ్వే ఓవర్లన్నీ ఆడి 159/6 స్కోరుకే పరిమితమైంది. అవేశ్ ఖాన్ (2/39), సుందర్ దెబ్బకు 7 ఓవర్లలో 39/5తో పీకల్లోతు కష్టాల్లోపడ్డ జింబాబ్వేను డియాన్ మేయర్స్ (65 నాటౌట్) ఆదుకొనే ప్రయత్నం చేశాడు. క్లైవ్ మడండి (37)తో ఆరో వికెట్‌కు 77 రన్స్ జోడించిన మేయర్స్.. మసకద్జా (18 నాటౌట్) జతగా 43 పరుగుల భాగస్వామ్యంతో చివర్లో పోరాడాడు. ప్రపంచకప్ జట్టు సభ్యులు జైస్వాల్, శాంసన్, దూబే జట్టులోకి రావడంతో.. జితేష్, పరాగ్, సుదర్శన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.
స్కోరుబోర్డు
భారత్: జైస్వాల్ (సి) బ్రయన్ (బి) రజా 36, గిల్ (సి) రజా (బి) ముజరబాని 66, అభిషేక్ (సి) మరుమణి (బి) రజా 10, రుతురాజ్ (సి) మధెవెరె (బి) ముజరబాని 49, శాంసన్ (నాటౌట్) 12, రింకూ సింగ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 182/4; వికెట్ల పతనం: 1-67, 2-81, 3-153, 4-177; బౌలింగ్: బెన్నెట్ 1-0-15-0, ఎన్‌గరవ 4-0-39-0, చతార 3-0-30-0, ముజరబాని 4-0-25-2, రజా 4-0-24-2, మసకద్జా 3-0-25-0, మధెవెరె 1-0-19-0.
జింబాబ్వే: మధెవెరె (సి) అభిషేక్ (బి) అవేశ్ 1, మరుమణి (సి) దూబే (బి) ఖలీల్ 13, బెన్నెట్ (సి) బిష్ణోయ్ (బి) అవేశ్ 4, మేయర్స్ (నాటౌట్) 65, రజా (సి) రింకూ (బి) సుందర్ 15, క్యాంప్‌బెల్ (సి/సబ్) పరాగ్ (బి) సుందర్ 1, క్లైవ్ మడండి (సి) రింకూ (బి) సుందర్ 37, మసకద్జా (నాటౌట్) 18, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 159/6; వికెట్ల పతనం: 1-9, 2-19, 3-19, 4-37, 5-39, 6-116; బౌలింగ్: ఖలీల్ 4-0-15-1, అవేశ్ 4-0-39-2, బిష్ణోయ్ 4-0-37-0, సుందర్ 4-0-15-3, అభిషేక్ 2-0-23-0, దూబే 2-0-27-0.
Updated Date - Jul 11 , 2024 | 02:39 AM