Haris Rauf: అభిమానితో పాకిస్తాన్ క్రికెటర్ గొడవ.. చివరకు ఏమైందంటే?
ABN, Publish Date - Jun 18 , 2024 | 10:13 PM
క్రికెటర్లు మైదానంలో సరైన ప్రదర్శన కనబర్చకపోతే.. అభిమానుల నుంచి వారికి తారాస్థాయిలో విమర్శలు ఎదురవుతాయి. ఒకవేళ తమకు ఏ ఆటగాడైనా తారసపడితే.. అప్పటికప్పుడే కొందరు ఫ్యాన్స్...
క్రికెటర్లు మైదానంలో సరైన ప్రదర్శన కనబర్చకపోతే.. అభిమానుల నుంచి వారికి తారాస్థాయిలో విమర్శలు ఎదురవుతాయి. ఒకవేళ తమకు ఏ ఆటగాడైనా తారసపడితే.. అప్పటికప్పుడే కొందరు ఫ్యాన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. చెత్త ప్రదర్శనతో పరువు తీశావంటూ మండిపడతారు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్‌కి (Haris Rauf) అలాంటి అనుభవమే ఎదురైంది. ఓ అభిమాని తనపై కామెంట్ చేయడంతో.. కోపం కట్టలు తెంచుకొని అతడ్ని కొట్టేందుకు దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) పాకిస్తాన్ జట్టు గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. పాక్ ఆటగాళ్లు సరిగ్గా ప్రదర్శించకపోవడంతో.. పాక్ అభిమానులు వారిపై విరుచుకుపడుతున్నారు. ఈ భయంతో కొందరు పాక్‌కి వెళ్లకుండా ఇంకా యూఎస్‌లోనే ఉన్నారు. అలాంటి వారిలో పేసర్ హారిస్ రవూఫ్ ఒకడు. తన భార్యతో కలిసి ఫ్లోరిడాలోని ఒక హోటల్‌లో ఉంటున్నాడు. అయితే.. హోటల్ ప్రాంగణంలో తన భార్యతో కలిసి సరదాగా గడుపుతుండగా, కొందరు ఫ్యాన్స్ అక్కడికొచ్చి సెల్ఫీల కోసం రిక్వెస్ట్ చేశారు. కానీ.. ఒక ఫ్యాన్ మాత్రం ఏదో కామెంట్ చేశాడు. బహుశా భారతీయుడు అయ్యుంటాడులే అని రవూఫ్ మొదట్లో పట్టించుకోలేదు. కానీ.. తాను పాకిస్తాన్‌కి చెందివాడినేనని ఆ అభిమాని చెప్పడంతో, రవూఫ్‌కి కోపం కట్టలు తెంచుకుంది.
ఆ అభిమాని చేసిన కామెంట్లకు సహనం కోల్పోయిన రవూఫ్.. అతడ్ని కొట్టేందుకు దూసుకొచ్చాడు. రవూఫ్‌ని అడ్డుకునేందుకు భార్య ఎంత ప్రయత్నించినా.. వినకుండా అభిమాని వైపు వెళ్లాడు. ఇంతలో అక్కడున్న వారు జోక్యం చేసుకొని.. రవూఫ్‌ని అడ్డుకున్నారు. అప్పటికీ ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఆగలేదు. చివరికి ఆ ఫ్యాన్‌ని అక్కడి నుంచి పంపేయడంతో.. రవూఫ్ కాస్త కూల్ అయ్యాడు. ఒకవేళ రవూఫ్‌ని ఆపకపోయి ఉండే.. బహుశా ఇద్దరూ దెబ్బలాడుకునేవారేమో! ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ఒక క్రికెటర్ అనే సంగతి మర్చిపోయి రవూఫ్ ఇలా ప్రవర్తించడం తగదని కామెంట్లు చేస్తున్నారు. దీంతో.. తాను అలా ప్రవర్తించడానికి గల కారణాలేంటో అతను ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వరకు తీసుకురాకూడదని తాను అనుకున్నానని, కానీ వీడియో బయటకు రావడంతో తాను స్పందించాల్సి వస్తోందని రవూఫ్ పేర్కొన్నాడు. క్రీడాకారులుగా ఉన్నందున తమకు ప్రజల నుంచి అన్ని రకాల ఫీడ్‌బ్యాక్స్ తీసుకోవాల్సి ఉంటుందని, కానీ హద్దులు దాటి కుటుంబం జోలికి వస్తే మాత్రం ఊరుకునేదే లేదని తేల్చి చెప్పాడు. ప్రొఫెషన్స్‌కు అతీతంగా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని గౌరవించాల్సి ఉంటుందని అతను పేర్కొన్నాడు. చూస్తుంటే.. ఆ అభిమాని రవూఫ్ కుటుంబాన్ని దుర్బాషలాడి ఉండొచ్చని అర్థమవుతోంది.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jun 18 , 2024 | 10:13 PM