వచ్చాడు.. పడగొట్టాడు
ABN, Publish Date - Oct 25 , 2024 | 02:10 AM
కివీ్‌సతో సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో మొదట అతడికి చోటే దక్కలేదు.. తొలి టెస్టు ఓటమి తర్వాత అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు..అంతేకాదు.. ఏకంగా కుల్దీప్ స్థానంలోనే బెర్త్ దక్కించుకున్నాడు వాషింగ్టన్ సుందర్....
7 వికెట్లతో దెబ్బతీసిన సుందర్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 259
రచిన్, కాన్వే అర్ధసెంచరీలు
భారత్ తొలి ఇన్నింగ్స్ 16/1
కివీ్‌సతో సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో మొదట అతడికి చోటే దక్కలేదు.. తొలి టెస్టు ఓటమి తర్వాత అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు..అంతేకాదు.. ఏకంగా కుల్దీప్ స్థానంలోనే బెర్త్ దక్కించుకున్నాడు వాషింగ్టన్ సుందర్. అయినా అతడి ఎంపికపై ఉదయం నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ యాజమాన్యం తనపై పెట్టుకున్న అంచనాలను వమ్ము చేయకుండా చెలరేగాడు. కీలక రచిన్ సహా చివరి ఏడుగురు బ్యాటర్లు అతడి స్పిన్ ఉచ్చుకు చిక్కడంతో తొలి రోజే వారి ఆటకు చెక్ పడింది.
పుణె: ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (7/59) తన ఎంపికకు న్యాయం చేశాడు. మూడున్నరేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పటికీ సుడులు తిరిగే బంతులతో పటిష్ఠంగా కనిపిస్తున్న న్యూజిలాండ్‌ను కట్టడి చేశాడు. తద్వారా అతడి దెబ్బకు మొదటి రోజు గురువారం కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ధసెంచరీలు సాధించారు. చివర్లో శాంట్నర్ (33) పోరాడే ప్రయత్నం చేశాడు. అశ్విన్ మిగతా 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్‌ను సైతం కివీస్ బౌలర్లు ఇబ్బందిపెట్టారు. ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో 16/1 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో యశస్వీ జైస్వాల్ (6 బ్యాటింగ్), గిల్ (10 బ్యాటింగ్) ఉన్నారు. ఆదిలోనే రోహిత్ డకౌటయ్యాడు. పేసర్ సౌథీ ఓవర్‌లో డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి ప్యాడ్‌ను తాకుతూ బెయిల్స్‌ను గిరాటేసింది. తొలి రోజు ఆటలో పేసర్‌కు దక్కిన ఏకైక వికెట్ ఇదే.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) అశ్విన్ 15; కాన్వే (సి) పంత్ (బి) అశ్విన్ 76; యంగ్ (సి) పంత్ (బి) అశ్విన్ 18; రవీంద్ర (బి) సుందర్ 65; మిచెల్ (ఎల్బీ) సుందర్ 18; బ్లండెల్ (బి) సుందర్ 3; ఫిలిప్స్ (సి) అశ్విన్ (బి) సుందర్ 9; శాంట్నర్ (బి) సుందర్ 33; సౌథీ (బి) సుందర్ 5; ఎజాజ్ (బి) సుందర్ 4; ఓరోక్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 79.1 ఓవర్లలో 259 ఆలౌట్; వికెట్ల పతనం: 1-32, 2-76, 3-138, 4-197, 5-201, 6-204, 7-236, 8-242, 9-252, 10-259; బౌలింగ్: బుమ్రా 8-2-32-0; ఆకాశ్ 6-0-41-0; అశ్విన్ 24-2-64-3; సుందర్ 23.1-4-59-7; జడేజా 18-0-53-0
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బ్యాటింగ్) 6; రోహిత్ (బి) సౌథీ 0; గిల్ (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు:0, మొత్తం:11 ఓవర్లలో16/1. వికెట్ పతనం:1-1. బౌలింగ్: సౌథీ 3-1-4-1; ఓరోక్ 3-2-5-0;ఎజాజ్ 3-1-5-0; శాంట్నర్ 2-0-2-0.
కాన్వే-రచిన్ నిలకడ: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలో మెరుగ్గానే ఆడింది. భారత పిచ్‌లపై ఇబ్బందిపడని ఓపెనర్ కాన్వేతో పాటు రచిన్ రవీంద్ర మరోసారి అర్ధసెంచరీతో కీలకంగా నిలిచారు. ఈ ఇద్దరూ క్రీజులో ఉన్నంతసేపు జట్టు పటిష్ఠంగానే కనిపించింది. కానీ స్పిన్నర్లు అశ్విన్, సుందర్ కివీస్ వికెట్లను పంచేసుకున్నారు. తొలి మూడు వికెట్లతో అశ్విన్ కివీస్ పతనానికి ద్వారాలు తీయగా.. ఇక సుందర్ సుడులు తిరిగే బంతులకు మిగతా బ్యాటర్లంతా పెవిలియన్ బాట పట్టారు. కాన్వే తొలివికెట్‌కు లాథమ్ (15)తో కలిసి 32, రెండోవికెట్‌కు యంగ్ (18)తో కలిసి 44 రన్స్ జోడించాడు.
సుందర్ దెబ్బతో.. : రెండో సెషన్‌లో కాన్వే-రచిన్ భారత బౌలర్లపై ఆధిపత్యం చూపారు. మూడో వికెట్‌కు 62 పరుగులు జత చేరాక కాన్వేను అశ్విన్ అవుట్‌చేశాడు. అయితే రచిన్ మాత్రం మిచెల్ (18)తో కలిసి ఎదురుదాడికి దిగాడు. అప్పటికే 13 ఓవర్లు వేసినా వికెట్ తీయలేని సుందర్.. ఓ అద్భుత రిప్పర్ బాల్‌తో రచిన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆఫ్‌సైడ్‌లో వేసిన బంతి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుంటూ అతడి వికెట్లను పడగొట్టిన తీరు వహ్వా అనిపించింది. అంతే.. అక్కడి నుంచి అంతా సుందర్‌దే హవా. క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాటర్‌ను అతనే వెనక్కిపంపాడు. మరోవైపు శాంట్నర్ ఒంటరి పోరాటం చేస్తూ ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. సుందర్ 7 వికెట్లలో ఐదుగురు బౌల్డ్ కావడం విశేషం.
విరాట్‌ను కాదని..
కివీస్ తొలి ఇన్నింగ్స్ 25వ ఓవర్ (జడేజా బౌలింగ్)లో ఓపెనర్ కాన్వే ఎల్బీపై భారత్ అప్పీల్ చేసినా అంపైర్ స్పందించలేదు. దీంతో కెప్టెన్ రోహిత్ డీఆర్‌ఎ్‌సకు వెళ్దామనుకున్నాడు. అయితే అదే సమయంలో అక్కడి వచ్చిన విరాట్ రిప్లేకి వెళ్లవద్దంటూ చెప్పబోయేంతలోనే రోహిత్ డీఆర్‌ఎ్‌సకు సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో కోహ్లీ సైలెంట్ అయిపోయాడు. తీరా రీప్లేలో బంతి లెగ్ స్టంప్‌ను మిస్ అవుతూ నాటౌట్‌గా తేలింది.
1
ఓ ఇన్నింగ్స్‌లో ఎక్కువ మంది (5)ని బౌల్డ్ చేసిన ఐదో భారత బౌలర్‌గా సుందర్. గతంలో జాసూభాయ్ పటేల్, బాపు నాదకర్ణి, కుంబ్లే, జడేజా ఈ ఘనత సాధించారు
1
టెస్టు కెరీర్‌లో 5+ వికెట్లు తీయడం
సుందర్‌కిదే మొదటిసారి.
3
కివీ్‌సతో జరిగిన టెస్టుల్లో ఉత్తమ గణాంకాలు (7/59) నమోదు చేసిన మూడో బౌలర్‌గా అశ్విన్‌తో సమంగా నిలిచిన సుందర్. వెంకట్రాఘవన్ (8/72), ప్రసన్న (8/76) ముందున్నారు.
6
భారత్‌లో జరిగిన టెస్టుల్లో తొలి రోజు ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు 10 వికెట్లు తీయడం ఇది ఆరోసారి.
Updated Date - Oct 25 , 2024 | 02:11 AM