మూలాలు మరిస్తే ఎలా..!
ABN, Publish Date - Nov 05 , 2024 | 03:55 AM
న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీ్‌సలో ఘోర పరాభవం నేపథ్యంలో స్టార్ క్రికెటర్లు దేశవాళీల్లో..ముఖ్యంగా రంజీట్రోఫీ ఆడడం తప్పనిసరి చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. భారత జట్టులోని పలువురు సీనియర్ ఆటగాళ్లు...
మరి ఇప్పుడో..
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీ్‌సలో ఘోర పరాభవం నేపథ్యంలో స్టార్ క్రికెటర్లు దేశవాళీల్లో..ముఖ్యంగా రంజీట్రోఫీ ఆడడం తప్పనిసరి చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. భారత జట్టులోని పలువురు సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ పోటీల గురించే మరిచిపోయారనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో భారత ఆటగాళ్లకు మించినోళ్లు లేరని కొన్ని ఏళ్ల క్రితం మనోళ్లకు గొప్ప ఘనత ఉండేది. ఇప్పుడు..విదేశాల విషయం పక్కనబెడితే స్వదేశంలో టర్నింగ్ వికెట్లపై పరుగులు చేసేందుకు మన స్టార్ బ్యాటర్లు ఆపసోపాలు పడుతున్నారు. చాలా ఏళ్లుగా సీనియర్లు దేశవాళీ పోటీల్లో ఆడకపోవడానికి కిక్కిరిసిన అంతర్జాతీయ షెడ్యూల్ కూడా కారణం. అయినా..తీరిక చేసుకొని కనీసం ఒకటి రెండు మ్యాచ్‌ల్లోనైనా ఆడివుంటే న్యూజిలాండ్ స్పిన్నర్లను సమర్థంగా తిప్పికొట్టే వారేమో ! తీరికలేకుండా అంతర్జాతీయ షెడ్యూల్ ఉన్నా..గతంలో స్టార్ క్రికెటర్లు దేశవాళీ పోటీల్లో ఆడడానికి ప్రాధాన్యమిచ్చేవారు. సుదీర్ఘ దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకున్న భారత జట్టు 2007 జనవరి తొలివారంలో స్వదేశం తిరిగి వచ్చింది. ఇక..వన్డే ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా.. అదే జనవరి చివరి వారంలో వెస్టిండీ్‌సతో ద్వైపాకిక్ష వన్డే సిరీ్‌సలో భారత్ తలపడింది. జనవరి 21, 24, 27, 31 తేదీల్లో నాగ్‌పూర్, చెన్నై, కటక్, వదోదరలో ఆ మ్యాచ్‌లు ఆడింది.
అప్పటి భారత జట్టులోని నలుగురు స్టార్లు సచిన్, జహీర్, అజిత్ అగార్కర్, గంగూలీ వదోదర నుంచి నేరుగా ముంబై చేరుకున్నారు. ఎందుకో తెలుసా? ఫిబ్రవరి రెండు నుంచి ఆరు వరకు జరిగే ప్రతిష్ఠాత్మక రంజీట్రోఫీ ఫైనల్లో తలపడే ముంబై-బెంగాల్ జట్ల తరపున ఆడేందుకు. ఆ మ్యాచ్‌లో టెండూల్కర్ శతకం సాధిస్తే, సౌరవ్ 90 పరుగులు చేశాడు. జహీర్ తగినన్ని వికెట్లు పడగొట్టాడు. రంజీట్రోఫీ తుదిపోరు ముగిసిన 48 గంటల్లో సచిన్, దాదా, జహీర్ శ్రీలంకతో జరిగే వన్డే సిరీ్‌సలోనూ ఆడాల్సి ఉంది. అయినా రంజీట్రోఫీ బరిలో దిగడం దేశవాళీ టోర్నీకి వారు ఎంత ప్రాధాన్యమిచ్చారో అర్థమవుతుంది.
న్యూజిలాండ్‌తో టెస్ట్‌ల్లో ఘోరంగా ఓడిన టీమిండియా లోని పలువురు స్టార్ ఆటగాళ్లకు ఈసారి దులీప్ ట్రోఫీ నుంచి మినహాయింపు ఇవ్వడం గమనార్హం. దీనికి కొందరు ‘పని భార నిర్వహణ’ అని చెబుతున్నా.. టీ20 ప్రపంచ కప్ ముగిశాక, తర్వాత శ్రీలంకలో జరిగిన వన్డే సిరీ్‌సకు మధ్య వారికి తగిన విరామమే లభించింది. దాంతో ‘పనిభారం’ పేరిట దులీప్ ట్రోఫీకి మినహాయింపు ఇవ్వడంపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పేస్ దళ సారథిగా బుమ్రాకు ‘పని భారం’తో దులీప్ ట్రోఫీకి తీసుకోకపోవడం సమంజసమే. కానీ కోహ్లీ, రోహిత్, అశ్విన్, జడేజాలకు టోర్నీ నుంచి మినహాయింపు ఇవ్వడంలో ఔచిత్యమేమిటి? 2000 సంవత్సరం ఏప్రిల్..తీవ్రమైన ఎండలో తమిళనాడుతో రంజీ సెమీ్‌సలో సచిన్ అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. మరో మూడ్రోజుల తర్వాత హైదరాబాద్‌తో రంజీట్రోఫీ ఫైనల్లోనూ టెండూల్కర్ పాల్గొని అర్ధ శతకం, శతకం చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. మార్చి చివరి వారం వరకు జరిగిన వన్డేలలో ఆడి..ఆపై రెండు వారాల వ్యవధిలో సచిన్ రంజీట్రోఫీ సెమీస్, ఫైనల్ బరిలో దిగడాన్ని నేటి స్టార్ క్రికెటర్లు ఎందుకు ఆదర్శంగా తీసుకోరు? విరాట్ చివరిసారి 2013లో, రోహిత్ 2015లో రంజీట్రోఫీ బరిలో దిగారని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు కూడా ఒకటే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడడం గమనార్హం. 24 ఏళ్ల తన కెరీర్‌లో తీరికలేని అంతర్జాతీయ షెడ్యూల్ ఉన్నా..200 టెస్ట్‌లు సహా 316 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడడం ఒక్క సచిన్‌కే చెల్లింది.
మరోవైపు కోహ్లీ కేవలం 32 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ఆడాడు. కానీ రోహిత్ కాస్త మెరుగ్గా 61 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. అయితే ఇప్పటి మాదిరి..సచిన్, లక్ష్మణ్, ద్రావిడ్, గంగూలీ కెరీర్ ఉచ్ఛ దశలో ఉన్న సమయంలో రెండు నెలల ఐపీఎల్, టీ20 మ్యాచ్‌లు ఉండేవి కావు. పనిభారం నిర్వహణ ముఖ్యమే. కానీ అత్యుత్తమ బ్యాటర్లు ఫామ్ కోల్పోయిన తరుణంలోనైనా దేశవాళీ పోటీల్లో ఆడాలనేది సర్వత్రా వినవస్తున్న అభిప్రాయం. ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా తరపున స్టార్ క్రికెటర్లు తప్పనిసరిగా ఆడేలా నిబంధన తీసుకురావాలనే సూచన వినవస్తోంది. ఆ సమయంలో టెస్ట్ మ్యాచ్‌ల షెడ్యూల్ లేకుండా బీసీసీఐ చూడాలి. ఏదేమైనా ఓ పెద్ద సిరీ్‌సకు ముందు స్టార్ ఆటగాళ్లు ఒకట్రెండు దేశవాళీ పోటీలు ఆడడం తప్పనిసరి చేయాలి. దేశ క్రికెట్ సీజన్ అక్టోబరు నుంచి మార్చి వరకు ఉంటుంది. ఆ సమయంలో స్వదేశంలో టెస్ట్ సిరీ్‌సకు ముందు రంజీట్రోఫీ ఒకటి రెండు రౌండ్లు ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి. తద్వారా స్టార్ ఆటగాళ్లు ఆ పోటీలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
Updated Date - Nov 05 , 2024 | 03:55 AM