చాంపియన్లతో సందడే సందడి..!
ABN, Publish Date - Jul 05 , 2024 | 06:17 AM
టీ20 వరల్డ్ చాంపియన్ టీమిండియా గురువారం ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుంది. బార్బడోస్ నుంచి ఉదయమే ఢిల్లీ చేరుకొన్న రోహిత్ సేన.. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన ‘చాంపియన్స్’ జెర్సీ ధరించి ప్రధాని నివాసానికి వెళ్లారు...
ప్రధానిని కలిసిన టీమిండియా జూ అనుభవాలను గుర్తుచేసుకొన్న ప్లేయర్లు
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ చాంపియన్ టీమిండియా గురువారం ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుంది. బార్బడోస్ నుంచి ఉదయమే ఢిల్లీ చేరుకొన్న రోహిత్ సేన.. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన ‘చాంపియన్స్’ జెర్సీ ధరించి ప్రధాని నివాసానికి వెళ్లారు. ఆయనతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన భారత జట్టుకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఒకదశలో ఉత్కంఠకు లోనైనా.. అద్భుత పోరాటంతో విజేతలుగా నిలిచారని ప్రశంసించారు. సుమారు రెండు గంటలపాటు క్రికెటర్లతో గడిపిన మోదీ.. రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్, కోహ్లీ, రిషభ్ పంత్ ఇలా ప్రతి ఒక్క భారత ఆటగాడితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జోక్‌లకు క్రికెటర్లు పగలబడి నవ్వారు. ప్రధాని పంచ్ డైలాగ్‌లకు విరాట్ చేతులతో ముఖాన్ని దాచుకొని నవ్వుతూనే ఉన్నాడు. ‘మన చాంపియన్లతో అద్భుతమైన సమావేశం. ఉదయం ఏడు గంటలకు వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌కు ఆతిథ్యం. టోర్నీ ఆసాంతం వారికి ఎదురైన అనుభవాల గురించి మాట్లాడుకోవడం గొప్ప జ్ఞాపకం’ అని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. జట్టు సభ్యులతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. గ్రూప్ ఫొటోలో ప్రధానికి ఇరువైపులా రోహిత్, ద్రవిడ్ నిలబడి ఉన్నారు. మిగతా ప్లేయర్లు కూడా మోదీ వ్యక్తిగతంగా తీయించుకొన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భార్య సంజనతో ప్రధానికి కలసిన ఫొటోను బుమ్రా షేర్ చేశారు. ఈ సందర్భంగా బుమ్రా కొడుకు అంగద్‌ను మోదీ ఎత్తుకొన్నారు.
తనను ఆత్మీయంగా ప్రధాని హత్తుకొన్న ఫొటోను కుల్దీప్ పోస్టు చేశాడు. ఇక, తల్లిదండ్రులతో కలసి మోదీతో దిగిన ఫొటోను అర్ష్‌దీప్ సింగ్ ఎక్స్‌లో పెట్టాడు. ‘ప్రధాని మోదీని కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మీ గృహానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు’ అని కోహ్లీ నెట్‌లో పోస్టు చేశాడు. ఆటగాళ్లతో మోదీ మాట్లాడుతున్న వీడియోను ప్రధాన మంత్రి కార్యాలయం షేర్ చేసింది.
మట్టి రుచి ఎలా ఉంది..
టోర్నీలో అద్భుత ప్రయాణం గురించిన అనుభవాలను పంచుకోవాలని మోదీ కోరారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ అనుభూతి ఎలా ఉందో చెప్పాలన్నారు. మ్యాచ్ నెగ్గిన తర్వాత రోహిత్.. బార్బడోస్ పిచ్ మట్టిని రుచి చూశాడు. ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ ‘మట్టి రుచి ఎలా ఉంది?’ అని రోహిత్‌ను మోదీ అడిగారు. టోర్నీ ఆసాంతం పెద్దగా పరుగులు సాధించని కోహ్లీని ఫైనల్ గురించి ఎలా ఆలోచించావని ప్రశ్నించారు. ఇక, జట్టు క్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో రావడం ఎలా అనిపిందని అక్షర్ పటేల్‌ను అడిగారు.
బహుమతిగా ‘నమో’ జెర్సీ
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా ప్రత్యేకంగా తయారు చేయించిన ‘నమో నెం:1’ జెర్సీని ప్రధానికి బహూకరించారు. రెండు వరల్డ్‌క్‌పలు సాధించాం అన్నట్టుగా రెండు స్టార్లు కూడా ముద్రించారు.
ట్రోఫీని పట్టుకోని మోదీ
ట్రోఫీతో కలసి భారత జట్టు దిగిన గ్రూప్ ఫొటోలో వరల్డ్‌కప్ ట్రోఫీని ప్రధాని పట్టుకోక పోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. తనకు ఇరువైలా ఉన్న రోహిత్, ద్రవిడ్ ట్రోఫీని పట్టుకొంటే.. మోదీ వారి చేతులను పట్టుకొన్నారు. నాదేమీ లేదు.. మీవల్లే ఈ గౌరవం, ఆనందం అని చాటి చెప్పడానికే మోదీ ఇలా చేసి ఉంటారని నెటిజన్లు అంటున్నారు.
Updated Date - Jul 05 , 2024 | 06:17 AM