Boxing : టైసన్‌కు పంచ్
ABN, Publish Date - Nov 17 , 2024 | 06:03 AM
మైక్ టైసన్.. బాక్సింగ్ ప్రియులకే కాకుండా ప్రపంచవ్యాప్త క్రీడా ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. కెరీర్ ఉజ్వలంగా సాగిన దశలో అజేయుడిగా పేరుతెచ్చుకున్న ఈ మాజీ హెవీవెయిట్ చాంపియన్.. 58 ఏళ్ల వయస్సులో బరిలో నిలిచి కంగుతిన్నాడు.
జేక్ చేతిలో ఓటమి
విజేతకు రూ.338 కోట్లు
ఎర్లింగ్టన్ (అమెరికా): మైక్ టైసన్.. బాక్సింగ్ ప్రియులకే కాకుండా ప్రపంచవ్యాప్త క్రీడా ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. కెరీర్ ఉజ్వలంగా సాగిన దశలో అజేయుడిగా పేరుతెచ్చుకున్న ఈ మాజీ హెవీవెయిట్ చాంపియన్.. 58 ఏళ్ల వయస్సులో బరిలో నిలిచి కంగుతిన్నాడు. భారతకాలమాన ప్రకారం శనివారం ఉదయం అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్, యూట్యూబర్ జేక్ పాల్‌తో జరిగిన పోరులో ఓడిపోయాడు. ముగ్గురు జడ్జిలు 80-72, 79-73, 79-73 పాయింట్లతో ఏకగ్రీవంగా జేక్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో జేక్‌కు రూ.338 కోట్ల ప్రైజ్‌మనీ దక్కగా.. ఓడిన టైసన్‌కు రూ.169 కోట్లు అందాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఫైట్ జూలై 20నే జరగాల్సి ఉన్నా టైసన్ అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. ఈ బౌట్ మొత్తం 8 రౌండ్లపాటు జరిగింది. అయితే 2005లోనే ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి తప్పుకొన్న టైసన్‌లో మునుపటి ఉత్సాహం కనిపించలేదు. అటు 27 ఏళ్ల జేక్ మాత్రం రింగ్‌లో వేగంగా కదులుతూ టైసన్‌పై పంచ్‌ల వర్షం కురిపించాడు. వాస్తవానికి తొలి రెండు రౌండ్లలో మైక్ 10-9 స్కోర్లతో కాస్త ఆధిపత్యం చూపాడు. కానీ ఆ తర్వాత పూర్తిగా గతి తప్పాడు. పాదాల కదలికలోనూ చురుకుదనం లోపించగా.. అసలు అతడి పంచ్‌ల్లో ఎలాంటి పవర్ కనిపించకపోవడం గమనార్హం. మూడో రౌండ్ నుంచి జేక్ పంచ్‌లను కాచుకోవడం టైసన్‌కు కష్టంగా మారింది. దీంతో మిగిలిన ఆరు రౌండ్లను 10-9 స్కోర్లతో జేక్ గెలుచుకుం టూ వెళ్లాడు. ఐదో రౌండ్‌లో ముక్కుపై, 7-8వ రౌండ్లలో తలకు ఇరువైపులా ఇచ్చిన జేక్ పంచ్‌లకు టైసన్ బేలగా కనిపించాడు. అయితే బౌట్ ముగిసిన వెంటనే టైసన్ ముందు తలవంచి జేక్ తన గౌరవాన్ని ప్రకటించాడు. ఓవరాల్‌గా జేక్ 78 పంచ్‌లు విసరగా.. టైసన్ నుంచి కేవలం 18 మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం టైసన్ కెరీర్‌లో 50 విజయాలు 7 ఓటములున్నాయి. కాగా ఈ ఫైట్ చూసేందుకు విశ్వవ్యాప్తంగా అభిమానులు ఆసక్తి చూపారు. దీంతో ఒక్కసారిగా రద్దీ పెరగడంతో బౌట్ ప్రసారకర్త అయిన నెట్‌ఫ్లిక్స్ యాప్ బౌట్ ఆరంభానికి ముందు యూఎస్, భారత్‌లో కాసేపు షట్‌డౌన్ అయింది.
ఎవరీ జేక్ పాల్?
అమెరికాకు చెందిన జేక్ మొదట యూట్యూబర్‌గా సుపరిచితుడు. ప్రాంక్ వీడియోలతోపాటు తన హిప్ హాప్ మ్యూజిక్‌తో ఆదరణ పొందాడు. అలాగే డిస్నీ చానెల్ బిజార్డ్‌వర్క్ సిరీస్‌లోనూ నటించాడు. అనంతరం 2018 నుంచి బాక్సర్‌గా మారాడు. ఇప్పటి వరకు అతను 13 బౌట్లలో 12 నెగ్గాడు. ఇక బౌట్ ముగిశాక విజేతగా నిలిచిన జేక్ ప్రత్యర్థి టైసన్‌ను కొనియాడాడు. ‘అతనో దిగ్గజ బాక్సర్. రింగ్‌లో తనతో ఫైట్ చేసినందుకు గర్వంగా ఉంది. అతడిని గాయపరచాలని చూశాను. కానీ తను కూడా నన్ను దెబ్బతీస్తాడేమోనని భయపడ్డా’ అని జేక్ చెప్పాడు. మరోవైపు ఇదే తన చివరి బౌట్ అనే ఊహాగానాలను టైసన్ తోసిపుచ్చాడు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని, ఇప్పుడే ఏమీ చెప్పలేనని తేల్చాడు. బహుశా జేసన్ సోదరుడు లోగన్‌తో ఫైట్ చేస్తానేమోనని చెప్పగా.. తాను టైసన్‌ను చంపేస్తానంటూ లోగన్ పాల్ సరదాగా అన్నాడు.
Updated Date - Nov 17 , 2024 | 06:03 AM