వంద కోట్లకు పైగా అతడిని ఫాలో అవుతున్నారు!
ABN, Publish Date - Sep 29 , 2024 | 07:33 AM
పోర్చుగల్ ఫుట్‌బాల్ కెరటం రొనాల్డో క్రిస్టియానో. మైదానంలో నెట్‌లోకి అసమానమైన రీతిలో గోల్స్ కొట్టి, కోట్లాది హృదయాల్ని గెలుచుకున్న ఈ ఫుట్‌బాల్ వీరుడు.. ఇంటర్‌నెట్‌లోనూ ఓ ఆట ఆడేసుకుంటున్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ ‘యువర్ క్రిస్టియానా’ను ప్రారంభిం చిన రెండు నెలలలోపే ఆరు కోట్ల మంది ఫాలో అవుతున్నారు.
పోర్చుగల్ ఫుట్‌బాల్ కెరటం రొనాల్డో క్రిస్టియానో. మైదానంలో నెట్‌లోకి అసమానమైన రీతిలో గోల్స్ కొట్టి, కోట్లాది హృదయాల్ని గెలుచుకున్న ఈ ఫుట్‌బాల్ వీరుడు.. ఇంటర్‌నెట్‌లోనూ ఓ ఆట ఆడేసుకుంటున్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ ‘యువర్ క్రిస్టియానా’ను ప్రారంభిం చిన రెండు నెలలలోపే ఆరు కోట్ల మంది ఫాలో అవుతున్నారు. అంతేనా... ఇన్‌స్టా, ఎక్స్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లతో కలిపి 103 కోట్ల మంది ఫాలో అవుతున్నారంటే అతడికున్న క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతుంది. రొనాల్డోకు ఎందుకింత క్రేజ్...
ప్రపంచ జనాభా సుమారు ఎనిమిది బిలియన్లు (ఎనిమిది వందల కోట్లు). వారిలో రొనాల్డోను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నవారు బిలియన్‌కు పైగా (103 కోట్లు) ఉన్నారు. ఈ ఏడాది జూలై 8న ప్రారంభమైన ‘యువర్ క్రిస్టియానా’ ఛానెల్‌లో ఇంటర్వ్యూలతో తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం మొదలెట్టాడు. కేవలం 48 వీడియోలు అప్‌లోడ్ చేస్తే మిలియన్ల మంది చూశారు. ఇంత క్రేజ్ ఎందుకంటే అతను ఫుట్‌బాల్ మాంత్రికుడు. మైదానంలో రొనాల్డో చేసే విన్యాసాలు తెలుసు కానీ అతని వ్యక్తిగత విశేషాలు పెద్దగా తెలియవు. ఎట్టకేలకు కాస్త ఆలస్యంగానైనా తనే సొంతంగా ఛానెల్ ప్రారంభించటంతో అభిమానులు వెల్లువెత్తారు.
ఇదే ప్రత్యేకం...
రొనాల్డో భార్య పేరు జార్జినా. ‘జియో’ అని ముద్దుగా ఆమెను పిలుస్తాడు. తన ఛానెల్‌లో భార్యకే ఇంటర్‌వ్యూ ఇవ్వడం ప్రత్యేకం. రొనాల్డో వయసు 39 ఏళ్లు. పాతికేళ్లపాటు తన శరీరాన్ని, మైండ్‌ను ఫుట్‌బాల్ కోసమే ఉపయోగించానంటాడు. ‘ఉదయాన్నే నిద్ర లేచాక కోల్డ్ షవర్ స్నానం చేసి, పెద్ద గ్లాసులో మంచినీళ్లు తాగుతాడు. పిల్లల్ని హగ్ చేసు కుంటాడు. సూర్యోదయాన్ని ఎంజాయ్‌చేస్తాడు. ప్రకృతితో కనెక్ట్ అవుతాడు. పాజిటివ్ వైబ్స్‌తో ఉంటాడు’ అంటోంది జార్జినా. ‘నా పిల్లలకు నేనే రోల్ మోడల్. వాళ్లు నా సక్సెస్ చూశారు. పెద్దకొడుకు క్రిస్టియానోకి పధ్నాలుగేళ్లు. తను ఫుట్‌బాల్ ఆడతాడో, మరో జాబ్ చేస్తాడో తెలీదు. అతనిష్టం. వారికి మంచి విషయాలు బోధిస్తా. సలహాలు ఇస్తా. పొరపాట్లు అనేవి సహజం అని చెబుతుంటా’ అంటాడు రొనాల్డో.
చదువుకోలేదు కానీ...
ఈ ఫుట్‌బాల్ మాంత్రికుడు ఫిబ్రవరి 5, 1985లో పోర్చుగల్ దేశంలోని ఫంచల్ దీవిలో పుట్టాడు. తల్లి పేరు జోసే డినిస్. ధనికుల ఇళ్లలో పని మనిషి. తండ్రి ఫుట్‌బాల్ క్లబ్‌లో వసతులు చూసే సగటు కూలీ. వీరి నాలుగో సంతానం రొనాల్డో. డబ్బుల కోసం ఊర్లో వీధులు ఊడ్చాడు. చదివింది ఆరో తరగతే. చదువుకంటే పుట్‌బాల్ ఒంటబట్టింది. స్కూల్‌లో ఒకసారి టీచర్ మీదకు కుర్చీ విసిరేసి ‘బ్యాడ్‌బాయ్’ ట్యాగ్ తగిలించుకున్నాడు. అదే సమయంలోనే గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడ్డాడు. కోలుకున్నాక ఇక ఫుట్‌బాల్‌కే పరిమితం అయ్యాడు. లోకల్ క్లబ్స్‌లో ఆడి పోర్చుగీసు ఆటగాడిగా పేరు తెచ్చుకుని, ఆ తర్వాత ప్రపంచానికే ఫుట్‌బాల్ రాజు అయ్యాడు.
మొన్నీ మధ్య తన జూనియర్‌ను తను పెరిగిన ప్రదేశానికి తీసుకెళ్లి చూపించాడు రొనాల్డో. ‘ఇంత చిన్న గదిలో.. చిన్న బెడ్ మీద బతికావా?’ అని జూనియర్ ప్రశ్నించాడట. ‘మాకు మీలా మంచి శిక్షణ, పౌష్టికమైన ఆహారం లేదు. పేదరికం వల్ల హార్డ్‌వర్క్ చేశా. నేనేమీ ఆకాశంలోంచి ఊడిపడలేదు. ఉన్న రిసోర్సును ఉపయోగించుకుని ఎదిగా. నువ్వు కూడా కష్టపడాల్సిందే ’అంటూ చెప్పాడట రొనాల్డో. ఇకపోతే అతని తల్లి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ఇలా అంది.. ‘ఒకవేళ రొనాల్డో ఫుట్‌బాల్ ఆటగాడు కాకపోయి ఉంటే, ఇటుకలు పేరుస్తూ ఇంటిని కట్టే తాపీ మేస్ర్తీ అయ్యేవాడు’!
ఆటలో మాత్రమే స్మార్ట్...
రొనాల్డో తన జీవితంలోని కన్నీళ్లు, కష్టాలు పిల్లలకు రాకూడదంటాడు. ‘చదివింది తక్కువే. నా మైండ్‌సెట్ డిఫరెంట్. ఫుట్‌బాల్‌లో మాత్రమే స్మార్ట్. మిగతా విషయాల్లో కాదు. ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది. అది తెలుసుకుంటేనే విజయం’ అంటాడు. ఇకపోతే రొనాల్డో పెద్దకొడుకు ఓ బార్‌లో పనిచేసే అమ్మాయికి పుట్టాడని మీడియా కథనాలు. అందుకే పెద్ద కొడుకుని రహస్యంగా పెంచాడంటారు. ఆ తర్వాత సరోగసీ పద్ధతిలో ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. ప్రస్తుతం అతడితో ఉన్న స్పానిష్ మహిళ జార్జినాకు ట్విన్స్ ఉన్నారు.
‘చాలామంది అభిమానులు ఫుట్‌బాల్ స్టార్ కావడంతో రొనాల్డోను డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అంటారు. ఇది నిజం కాదు. నేను స్పానిష్ మోడల్‌ను. ఇన్‌స్టాలో ఒక్క పోస్టుకు ఎనిమిది వేల డాలర్లు తీసు కుంటా. ఇంటర్వ్యూలకు లక్ష డాలర్లు ఛార్జ్ చేస్తా. నా సొంత డబ్బు రెండు లక్షలడాలర్లతో నా భర్తకు కారు కొనిచ్చా’ అంటోంది జార్జినా. ఏదేమైనా ప్రస్తుతం రొనాల్డో సోషల్ మీడియాలో సెన్షేషన్ అయ్యాడు. రోజురోజుకు అతడిని ఫాలో అవుతున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతూనే ఉంది. దటీజ్ రొనాల్డో!
Updated Date - Sep 29 , 2024 | 07:33 AM