ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరువూ దక్కలేదు

ABN, Publish Date - Nov 04 , 2024 | 02:05 AM

స్వదేశంలో తమను కొట్టేవారే లేరన్నట్టుగా జైత్రయాత్ర సాగించిన టీమిండియాను న్యూజిలాండ్‌ చావుదెబ్బ తీసింది. శ్రీలంకపై రెండు టెస్టుల సిరీ్‌సను కోల్పోయి ఇక్కడి వచ్చిన ఈ జట్టు.. ఒక్క టెస్టులో గెలిస్తే గొప్పే అనుకున్నారు. కానీ...

స్వదేశంలో తొలిసారి 0-3తో భారత్‌ సిరీస్‌ ఓటమి

పంత్‌ పోరాటం వృధా

6 వికెట్లతో ఎజాజ్‌ విజృంభణ

క్లీన్‌స్వీప్‌తో న్యూజిలాండ్‌ చరిత్ర

అసలేం జరుగుతోంది?.. స్వల్ప ఛేదన కోసం ఆదివారం బరిలోకి దిగిన టీమిండియా పరిస్థితి చూశాక ప్రతీ అభిమాని ఆవేదన ఇదే. టన్నుల కొద్దీ పరుగులు.. అబ్బురపరిచే రికార్డులు ఖాతాలో ఉన్న స్టార్‌ బ్యాటర్లు అసలు బ్యాటింగే తెలీదన్నట్టు చకచకా పెవిలియన్‌కు చేరారు. కానీ న్యూజిలాండ్‌ జట్టు మొత్తానికీ, రిషభ్‌ పంత్‌ ఒక్కడు మాత్రం సవాల్‌ విసిరాడు. స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో తన సీనియర్లకు చూపిస్తూ.. భారత్‌ను విజయం వైపు నడిపించాడు. కానీ తను వివాదాస్పద రీతిలో నిష్క్రమించాక ఇక చేసేదేమీ లేకపోయింది. చివరకు ఏదైతే జరుగకూడదనుకున్నామో అదే జరిగింది. నేటి తరం క్రికెట్‌ ప్రేమికులు ఎన్నడూ చూడని విధంగా సొంత గడ్డపై భారత్‌ తొలిసారి మూడు టెస్టుల సిరీ్‌సను ప్రత్యర్థికి కోల్పోవాల్సి వచ్చింది. కివీస్‌ విజయంలో లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ (11 వికెట్లు) అత్యంత కీలకంగా నిలిచాడు.


ముంబై: స్వదేశంలో తమను కొట్టేవారే లేరన్నట్టుగా జైత్రయాత్ర సాగించిన టీమిండియాను న్యూజిలాండ్‌ చావుదెబ్బ తీసింది. శ్రీలంకపై రెండు టెస్టుల సిరీ్‌సను కోల్పోయి ఇక్కడి వచ్చిన ఈ జట్టు.. ఒక్క టెస్టులో గెలిస్తే గొప్పే అనుకున్నారు. కానీ అనూహ్య ఆటతీరుతో ఏకంగా సిరీ్‌సనే 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసేసింది. చివరిదైన మూడో టెస్టులోనూ స్పిన్‌ను ఆడలేక బ్యాటర్లు చేతులెత్తేయడంతో రోహిత్‌ సేన 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. ఫలితంగా రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో పర్యాటక కివీస్‌ 25 పరుగుల తేడాతో గెలిచింది. వాస్తవానికి భారత జట్టు టెస్టు సిరీ్‌సలో వైట్‌వాష్‌ కావడం కూడా 24 ఏళ్లలో ఇదే తొలిసారి. 2000లో దక్షిణాఫ్రికా ఇక్కడ 2-0తో నెగ్గింది. స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ (6/57), ఫిలిప్స్‌ (3/42) ఇబ్బందిపెట్టడంతో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 29.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. జట్టులో పంత్‌ (64) మాత్రమే రాణించాడు. ఏడుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అంతకుముందు కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు సాధించింది. జడేజాకు ఐదు, అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 235, భారత్‌ 263 పరుగులు చేశాయి. ఇక మూడు టెస్టుల్లో ఎక్కువ పరుగులు (244) సాధించిన విల్‌ యంగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా నిలిచాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు ఎజాజ్‌ పటేల్‌కు దక్కింది.


పంత్‌ ఒక్కడే..: మూడో రోజు ఆదివారం కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 14 బంతుల్లోనే ముగిసింది. ఎజాజ్‌ (8)ను జడేజా అవుట్‌ చేయడంతో భారత్‌ 147 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగింది. బంతి విపరీతంగా టర్న్‌ అవుతున్నప్పటికీ, లక్ష్యం మరీ భారీగా లేకపోవడం.. కావాల్సినంత సమయం ఉండడంతో భారత్‌కు విజయం కష్టం కాబోదనిపించింది. కానీ స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ మరోమారు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన తను ఈసారి కూడా వరుసగా వికెట్లు తీస్తూ ఓటమిని కళ్లముందుంచాడు. క్రీజులో ఉన్నంతసేపు ఆదుర్దాగా కనిపించిన కెప్టెన్‌ రోహిత్‌ (11) అనవసరంగా పుల్‌ షాట్‌ ఆడి చేజేతులా పేసర్‌ హెన్రీకి చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే ఎజాజ్‌ బంతిని సరిగ్గా అంచనా వేయలేక గిల్‌ (1) బౌల్డ్‌ అయ్యాడు. అటు విరాట్‌ కోహ్లీ పేలవ ఫామ్‌ కొనసాగిస్తూ (1) ఎజాజ్‌ ఓవర్‌లోనే వెనుదిరిగాడు. పంత్‌ మాత్రం సిక్సర్‌తో ఖాతా తెరిచి ఫ్యాన్స్‌ను జోష్‌లో నింపాడు. కానీ మరో ఎండ్‌లో వికెట్ల పతనం మాత్రం ఆగలేదు. జైస్వాల్‌ (5)ను ఫిలిప్స్‌, ఓ ఫుల్‌టాస్‌ బంతితో సర్ఫరాజ్‌ (1)ను ఎజాజ్‌ బోల్తా కొట్టించారు. ఈ స్థితిలో జట్టు కేవలం 41 బంతుల్లోనే 5 వికెట్లు కోల్పోయి దయనీయంగా కనిపించింది. అప్పటికి స్కోరు 29 పరుగులు మాత్రమే కాగా కనీసం వంద రన్స్‌ అయినా చేయగలుగుతుందా? అనిపించింది. అయితే పంత్‌ మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా బ్యాటింగ్‌ సాగించాడు. జడేజా (6)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఫిలిప్స్‌ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లతో చెలరేగగా, అతడి ప్రతీ పరుగుకు కూడా వాంఖడే ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అయితే 12వ ఓవర్‌లో ఎజాజ్‌ వేసిన బంతికి తను ఎల్బీ కావాల్సి ఉన్నా కివీస్‌ రివ్యూకు వెళ్లకపోవడంతో బతికిపోయాడు. అప్పటికి అతడి స్కోరు 21 మాత్రమే. ఇక ఆరో వికెట్‌కు 42 పరుగులు జత చేరాక జడేజా వెనుదిరిగాడు. ఎజాజ్‌ ఈ వికెట్‌ తీసి కివీ్‌సకు రిలీ్‌ఫనిచ్చాడు. పంత్‌ మాత్రం ఎజాజ్‌ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లతో అర్ధసెంచరీ పూర్తి చేసి తొలి సెషన్‌ను ముగించాడు.


ఆశలు ఆవిరి: లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ చేతిలో 4 వికెట్లు ఉండగా, మరో 55 పరుగులు చేస్తే చాలు. పంత్‌ సాధికారికంగా ఆడుతుండగా, అతడికి జతగా సుందర్‌ ఉండడంతో విజయంపై ఆశలు రేగాయి. అలాగే అశ్విన్‌ కూడా బరిలోకి దిగాల్సి ఉంది. కానీ భారత్‌ అంచనాలపై ఎజాజ్‌ నీళ్లు చల్లాడు. రెండో సెషన్‌ రెండో ఓవర్‌లోనే గట్టి దెబ్బ తీశాడు. రెండు వరుస ఫోర్లు బాదిన పంత్‌ను నాలుగో బంతికి పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో వాంఖడే ఒక్కసారిగా మూగబోయింది. దీనికితోడు ఫిలిప్స్‌ ఒకే ఓవర్‌లో అశ్విన్‌ (8), ఆకాశ్‌ (0)లను అవుట్‌ చేయడం.. తర్వాతి ఓవర్‌లోనే సుందర్‌ (12)ను ఎజాజ్‌ బౌల్డ్‌ చేయడంతో భారత్‌ పరాభవం పూర్తయ్యింది.


స్కోరుబోర్డు

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 235;

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 263;

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 174;

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (ఎల్బీ) ఫిలిప్స్‌ 5; రోహిత్‌ (సి) ఫిలిప్స్‌ (బి) హెన్రీ 11; గిల్‌ (బి) ఎజాజ్‌ 1; విరాట్‌ (సి) మిచెల్‌ (బి) ఎజాజ్‌ 1; పంత్‌ (సి) బ్లండెల్‌ (బి) ఎజాజ్‌ 64; సర్ఫరాజ్‌ (సి) రచిన్‌ (బి) ఎజాజ్‌ 1; జడేజా (సి) యంగ్‌ (బి) ఎజాజ్‌ 6; సుందర్‌ (బి) ఎజాజ్‌ 12; అశ్విన్‌ (సి) బ్లండెల్‌ (బి) ఫిలిప్స్‌ 8; ఆకాశ్‌ (బి) ఫిలిప్స్‌ 0; సిరాజ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 29.1 ఓవర్లలో 121 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-13, 2-16, 3-18, 4-28, 5-29, 6-71, 7-106, 8-121, 9-121, 10-121. బౌలింగ్‌: హెన్రీ 3-0-10-1; ఎజాజ్‌ 14.1-1-57-6; ఫిలిప్స్‌ 12-0-42-3.


ఆత్మపరిశీలన చేసుకోవాలి

స్వదేశంలో 0-3తో ఓడడం ఏమాత్రం జీర్ణించుకోలేనిది. ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. సన్నాహకాల్లో లోపమా? షాట్‌ల ఎంపికలో పొరబాట్లా? లేదా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడమా? అయితే పంత్‌ మాత్రం.. పిచ్‌ నుంచి సవాళ్లు ఎదురవుతున్నా చక్కని ఫుట్‌వర్క్‌తో అద్భుతంగా పోరాడాడు.

సచిన్‌ టెండూల్కర్‌

స్పిన్‌ను ఆడే విషయంలో మనోళ్లు ఎంతో మెరుగుపడాలి. షార్ట్‌ ఫార్మాట్‌లో కొన్ని ప్రయోగాలు చేయడం మంచిదే. కానీ, టెస్ట్‌ క్రికెట్‌లో మాత్రం అనవసరం.

వీరేంద్ర సెహ్వాగ్‌

జూ మెలికలు తిరిగే వికెట్లే మనకు శత్రువులుగా మారాయి. - హర్భజన్‌ సింగ్‌

జూ స్పిన్‌ను ఎదుర్కోవడంలో చాలా జట్ల తరహాలోనే భారత్‌ కూడా ఇబ్బంది పడుతోంది.

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ వాన్‌


1

తమ టెస్టు చరిత్రలో భారత జట్టు స్వదేశంలో మూడు టెస్టుల సిరీ్‌సలో వైట్‌వాష్‌ కావడం ఇదే తొలిసారి.

సుదీర్ఘ ఫార్మాట్‌లో కివీస్‌ వరుసగా మూడు టెస్టుల్లో గెలవడం ఇదే తొలిసారి. అలాగే భారత్‌ను ఇక్కడ మూడు టెస్టుల సిరీ్‌సలో వైట్‌వాష్‌ చేసిన తొలి టీమ్‌గానూ నిలిచింది.

టెస్టు చరిత్రలో నాలుగు ఇన్నింగ్స్‌లోనూ లెఫ్టామ్‌ స్పిన్నర్లు (జడేజా, ఎజాజ్‌) 5+ వికెట్లు తీయడం ఇదే తొలిసారి.

భారత్‌లో ఒకే వేదికపై ఎక్కువ వికెట్లు (25) తీసిన పర్యాటక బౌలర్‌గా ఎజాజ్‌. ఇయాన్‌ బోథమ్‌ (22)ను అధిగమించాడు.

2

టెస్టుల్లో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం కివీ్‌సకిది రెండోసారి. గతంలో ఇంగ్లండ్‌పై 137 పరుగులకు కాపాడుకుంది.

200ల్లోపే టార్గెట్‌ను ఛేదించకపోవడం భారత్‌కిది రెండోసారి. 1997లో విండీ్‌సపై 120 పరుగులను పూర్తి చేయలేకపోయింది.

3

స్వదేశంలో వైట్‌వాష్‌తో సిరీ్‌సలను కోల్పోయిన మూడో భారత కెప్టెన్‌గా రోహిత్‌. గతంలో గుండప్ప విశ్వనాథ్‌ (1980), సచిన్‌ టెండూల్కర్‌ (2000) ఉన్నారు.

రెండు ఇన్నింగ్స్‌లోనూ 100+ స్ట్రయిక్‌ రేట్‌తో అర్ధసెంచరీలు చేసిన మూడో భారత బ్యాటర్‌గా పంత్‌. గతంలో సెహ్వాగ్‌, జైస్వాల్‌ ఈ ఫీట్‌ సాధించారు.

కివీస్‌ తరఫున రెండు ఇన్నింగ్స్‌లోనూ 5+ వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఎజాజ్‌. గతంలో వెటోరి, శాంట్నర్‌ ఉన్నారు.


ఇదో అద్భుత విజయం

మూడు టెస్టుల్లోనూ అద్భుతంగా ఆడాం. బెంగళూరులో పేసర్లు, ఆ తర్వాత స్పిన్నర్లు భారత్‌ను కట్టడి చేయగలిగారు. ఎజాజ్‌ ముంబైలో బౌలింగ్‌ చేయడాన్ని ఆస్వాదించాడు. భారత్‌ ముందు మంచి టార్గెట్‌ను ఉంచామనే భావించాం. మిగతా పని మా బౌలర్లు కానిచ్చారు. మూడు వారాల క్రితం కలగా భావించిన విజయాన్ని ఇప్పుడు సాధించాం.

కివీస్‌ కెప్టెన్‌ లాథమ్‌

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న అనంతరం

భార్య, కుమార్తెతో కివీస్‌ స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌

Updated Date - Nov 04 , 2024 | 02:06 AM