పారిస్ ఒలింపిక్స్ నేటినుంచే
ABN, Publish Date - Jul 26 , 2024 | 04:20 AM
ఉత్కంఠ.. ఉద్వేగంతో యావత్ ప్రపంచాన్ని గుప్పిట బంధించే విశ్వక్రీడా పండుగ ఒలింపిక్స్‌కు వేళైంది. ఫ్యాషన్ పుట్టిల్లు పారిస్.. విశ్వక్రీడలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. కరోనా ముప్పు వీడిన తర్వాత నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ కావడంతో....
రాత్రి 11 నుంచి జియో సినిమా, స్పోర్ట్స్ 18లో
206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు
భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు
వినూత్నంగా ప్రారంభ వేడుకలు
తమ దేశ జాతీయపతాకం సగర్వంగా ఎగరాలని ప్రతి ఒక్కరూ కోరుకునే అరుదైన సందర్భం.. గొప్పగొప్ప ఆటగాళ్లంతా తమ నైపుణ్యాలకు పదునుపెట్టే అసలైన సమరం.. జీవితంలో ఒక్కసారైనా పోటీపడాలని ప్రతి క్రీడాకారుడు కలలు కనే విశ్వక్రీడా సంరంభం.. యావత్ క్రీడాలోకాన్ని ఒక్కటి చేస్తూ, విశ్వవ్యాప్త అభిమానులను ఆనందసాగరంలో ముంచెత్తుతూ, ప్రపంచ మేటి అథ్లెట్ల సత్తాకు పరీక్షగా నిలుస్తూ, అద్భుత విన్యాసాలు, ప్రదర్శనలకు అరుదైన వేదిక.. నాలుగేళ్లకోసారి జరిగే ఆటల సంబరం.. ఒలింపిక్స్.. వచ్చేసింది. ఫ్రాన్స్ రాజధాని, ఫ్యాషన్ సిటీ పారిస్ ఆతిథ్యమిస్తున్న ఈ ఒలింపిక్స్ మొదలయ్యేది నేడే.
విశ్వక్రీడల చరిత్రలోనే తొలిసారిగా స్టేడియం లోపల కాకుండా బయట.. అదీ.. పారిస్‌లోని ప్రఖ్యాత సెన్ నదీ తీరంలో వినూత్నరీతిలో ప్రారంభ వేడుకలను నిర్వహిస్తున్నారు. 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు 32 క్రీడాంశాల్లో సత్తా చాటేందుకు సమాయత్తమయ్యారు.
భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పోటీలో ఉన్నారు. గత టోక్యో క్రీడల్లో స్వర్ణ పతకంతో యావత్ భారతావనిని మెప్పించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, హ్యాట్రిక్ పతక వేటలోనున్న తెలుగు షట్లర్ పీవీ సింధు, వరుసగా రెండోసారి పతకం అందుకోవాలని పట్టుదలగా ఉన్న బాక్సర్ లవ్లీనా, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, జంబో బృందంగా బరిలో ఉన్న షూటర్లు, పతకాన్ని పట్టేయాలనుకుంటున్న రెజ్లర్లు.. ఇలా అందరిపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి..
ఈ పదిహేడురోజుల పాటు జరిగే విశ్వక్రీడా పండగలో పతక విందు ఎవరిదో?
పారిస్: ఉత్కంఠ.. ఉద్వేగంతో యావత్ ప్రపంచాన్ని గుప్పిట బంధించే విశ్వక్రీడా పండుగ ఒలింపిక్స్‌కు వేళైంది. ఫ్యాషన్ పుట్టిల్లు పారిస్.. విశ్వక్రీడలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. కరోనా ముప్పు వీడిన తర్వాత నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ కావడంతో.. చిరకాలం గుర్తుండి పోయే విధంగా గ్రాండ్‌గా ఆరంభ వేడుకలను నదిలో నిర్వహించాలని ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్ణయించింది. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక వేదికల్లో పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేయడంతో.. నగరం మొత్తం సందడి వాతావరణం నెలకొంది. అయితే, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జరుపుతున్న మెగా ఈవెంట్ కూడా ఇదేనని భావించాలి. బలమైన శక్తుల మధ్య యుద్ధ వాతావరణం, తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో భారీ భద్రత మధ్య ఈవెంట్లు జరగనున్నాయి. సుమారు 45 వేల మంది రక్షణ బలగాలను వినియోగించనున్నారు. ఒలింపిక్స్‌కు ఫ్రాన్స్ ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. తొలిసారిగా 1900 సంవత్సరంలో విశ్వక్రీడలను నిర్వహించిన ఈ దేశంలో రెండోసారిగా 1924లో జరిగాయి. అమెరికా (నాలుగుసార్లు), బ్రిటన్ (మూడుసార్లు) తర్వాత అత్యధికసార్లు ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్న దేశంగా ఫ్రాన్స్ రికార్డులకెక్కనుంది. ఓవరాల్‌గా 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు ఈ క్రీడల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
యూత్ కోసం..
28 రెగ్యులర్ క్రీడా విభాగాలతోపాటు ఈ ఒలింపిక్స్‌లో స్కేట్ బోర్డ్, క్లైంబింగ్, సర్ఫింగ్, బ్రేకింగ్/బ్రేక్‌డ్యాన్స్ చేర్చారు. యువతను ఆకర్షిం చాలన్న ఆలోచనతోనే ఈ క్రీడలకు చోటు కల్పించారు. టోక్యో క్రీడల్లో కరాటేను చేర్చినా.. ఎక్కువ వయసున్న క్రీడాకారులు భారీగా పాల్గొనడంతో యూత్‌ను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. గత క్రీడల్లో ఎంట్రీ దక్కించుకొన్న సర్ఫింగ్, క్లైంబింగ్ క్రీడలకు పారిస్‌లోనూ అవకాశం కల్పించారు. క్లైంబింగ్ క్రీడను సరికొత్త ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. తొలిసారి చోటు కల్పించిన బ్రేక్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.
రష్యా నుంచి 15 మందే..
డోపింగ్ స్కామ్‌తోపాటు ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా నిషేధాన్ని ఎదుర్కొంటున్న రష్యా నుంచి 15 మంది మాత్రమే ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. పైగా తటస్థ అథ్లెట్లుగా వీరు బరిలోకి దిగనున్నారు. మూడేళ్ల క్రితం టోక్యోలో జరిగిన క్రీడల్లో రష్యా ఒలింపిక్ కమిటీ కింద 30 క్రీడా విభాగాల్లో 335 మంది రష్యా అథ్లెట్లు బరిలోకి దిగారు. అయితే, ఈసారి ఆ సంఖ్య భారీగా తగ్గింది. రష్యన్లు స్వర్ణం సాధిస్తే.. పతక బహూకరణ సమయంలో ఆ దేశ జాతీయ గీతాన్ని వినిపించరు. 17 మంది బెలారస్ అథ్లెట్లకు కూడా ఇదే నిబంధనలు వర్తించనున్నాయి.
మళ్లీ నీరజ్‌పైనే ఆశలు
ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుంది అంటే.. కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. జావెలిన్ త్రోలో డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగుతున్న నీరజ్ చోప్రా మరోసారి గోల్డ్ కొల్లగొడతాడనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక, బ్యాడ్మింటన్‌లో సాత్విక్ సాయిరాజ్ జంట, షూటింగ్‌లో సిఫ్ట్ కౌర్ సమ్రా పతకాలు సాధిస్తారని భావిస్తున్నారు. బాక్సింగ్‌లో నిఖత్ జరీన్, రెజ్లింగ్‌లో అంతిమ్ పంగల్, వినేష్ ఫొగట్‌కు కూడా మెడల్స్ సాధించే సత్తాఉంది. టెన్నిస్ డబుల్స్‌లో రోహన్ బోపన్న-శ్రీరామ్ బాలాజీ జోడీపై భారీగా ఆశలు పెట్టుకొన్నారు. గత క్రీడల్లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టు మరింత మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే టోక్యో క్రీడల్లో సాధించిన ఏడు పతకాల కంటే.. ఈసారి ఎక్కువగా సాధిస్తారని అనుకొంటున్నారు.
ఈ క్రీడలు ఎందుకు ప్రత్యేకమంటే..
ఏ ఆతిథ్య దేశమైనా ఒలింపిక్స్ నిర్వహణలో తమదైన ప్రత్యేకత చాటుకుంటుంది. అలాగే పారిస్ నిర్వాహకులు కూడా పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ, వృథాకు చోటులేకుండా ఈసారి విశ్వక్రీడలను భావితరాలకు మార్గదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇలా పలు అంశాల్లో పారిస్ ఒలింపిక్స్ ప్రత్యేకత సంతరించుకోనున్నాయి. అవేంటంటే..
వృథాకు లేదు అవకాశం
విశ్వక్రీడల నిర్వహణ ఏ దేశానికైనా ప్రతిష్ఠాత్మకం. గర్వకారణం. అదే సమయంలో ఆర్థికంగా కూడా భారమే. రూ. వందల కోట్లు వెచ్చించి నిర్మించిన స్టేడియాలు, గేమ్స్ విలేజ్..క్రీడలు ముగిశాక ఎక్కువ శాతం నిరుపయోగమవుతాయి. కానీ పారిస్ క్రీడల నిర్వాహకులు అందుకు ఆస్కారం లేకుండా..ఈసారి ఒలింపిక్స్ కోసం ఏర్పాటు చేసిన ప్రతి నిర్మాణంలోని వస్తువులను పునర్ వినియోగించేలా చర్యలు చేపట్టారు. భవనాలను లీజుకు ఇవ్వడం, ఇతర నిర్మాణ సామాగ్రి అమ్మకం, రీసైక్లింగ్ చేయడం ద్వారా వృథాకు తావులేకుండా చూస్తున్నారు.
పర్యావరణ హితం
ఈసారి పోటీల సందర్భంగా 20 లక్షల క్రీడా పరికరాలను వినియోగిస్తున్నారు. వీటిలో 15 లక్షల పరికరాలను ఆయా క్రీడా సంఘాలు అద్దెకు తీసుకోవడం గమనార్హం. క్రీడల్లో ఉపయోగించే కంప్యూటర్లు, ప్రింటర్లను సైతం రెంటుకు తీసుకొచ్చారు. అలాగే ఫర్నిచర్‌కు సంబంధించిన వస్తువులను కూడా ముందు అనుకున్నట్టు ఎనిమిది లక్షలకు కాకుండా ఆరు లక్షలకే పరిమితం చేశారు. ఎలక్ట్రిక్, హైబ్రిడ్, హైడ్రోజన్ గ్యాస్‌తో నడిచే వాహనాలనే ఉపయోగిస్తున్నారు. అంతేకాదు. గత కొన్ని ఒలింపిక్స్‌లో కంటే 40 శాతం తక్కువగా వాహనాలను వినియోగిస్తున్నారు. బయో ఫ్యూయల్, హైడ్రోజన్, బ్యాటరీలతో నడిచే జనరేటర్లనే వాడుతున్నారు. మొత్తంగా..ఈసారి ఒలింపిక్స్ అత్యంత పర్యావరణ హితంగా నిర్వహిస్తున్నారు.
పొదుపు మంత్రం
ఇప్పటికే ఉన్న, తాత్కాలికంగా నిర్మించిన వేదికల్లోనే 329 క్రీడాంశాలను నిర్వహిస్తున్నారు. మొత్తం 35 క్రీడా వేదికల్లో రెండింటినే కొత్తగా నిర్మించారు. ఈ రెండింటిలో ఒకటి..అక్వాటిక్ స్టేడియాన్ని కర్బన్ ఉద్గారాలకు తావులేకుండా చెక్కతో నిర్మించారు. ఈ స్టేడియాన్ని నగరంలో క్రీడా సదుపాయం అందుబాటులోలేని ప్రాంతంలో ఏర్పాటు చేశారు. స్టేడియంలో సీట్లలో రీసైక్లింగ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించారు. అలాగే రెండోది పోర్ట్ డి లా చాపెల్ స్టేడియం.
లింగ సమానత్వం
పారిస్ గేమ్స్‌లో మొత్తం 10,500 మంది అథ్లెట్లు తలపడుతుండగా వీరిలో సగం మంది మహిళలు కావడం విశేషం. టోక్యో క్రీడల్లో మహిళా అథ్లెట్ల శాతం 47.8 కావడం గమనార్హం. 1972 మ్యూనిచ్ క్రీడల వరకు ఒలింపిక్స్‌లో అతివల ప్రాతినిధ్యం 20 శాతం కంటే తక్కువగానే ఉండేది. సాధారణంగా పురుషుల మారథాన్‌తో ఒలింపిక్స్‌కు తెరపడుతుంది. అయితే ఈసారి మహిళల మారథాన్‌తో ముగియనుండడం మరో విశేషం.
1
భారత బృందం నుంచి స్వర్ణ పతక విజేతగా మళ్లీ బరిలోకి దిగుతున్న ఏకైక అథ్లెట్ నీరజ్ చోప్రా
ఈసారి ఒలింపిక్స్‌కు భారత రెజ్లింగ్ జట్టులో పురుషుడు ఒక్కడే ఉన్నాడు. అతనే అమన్ సెహ్రావత్.
2
ఈ క్రీడల్లో ఒకటి కంటే ఎక్కువ ఈవెంట్లలో పోటీపడుతున్న భారత ప్లేయర్లు. అథ్లెట్ పారుల్ చౌదరి 5వేల మీటర్ల రేసుతో పాటు 3వేల మీటర్ల స్టీపుల్ చేజ్‌కు అర్హత సాధించగా.. షూటర్ మనూ భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లకు ఎంపికైంది.
5
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకాలు సాధించిన ఐదుగురు (నీరజ్ చోప్రా, పీవీ సింధు, మీరాబాయి, లవ్లీనా, హాకీ జట్టు) పారిస్ క్రీడల బరిలోనూ ఉన్నారు.
14
పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత జట్టులోని ధినిధి దేషింగు వయసు ఇది. పిన్న వయసులో విశ్వక్రీడల బరిలోకి దిగుతున్న రెండో భారత ప్లేయర్‌గా రికార్డు. గతంలో స్విమ్మర్ ఆర్తి సాహా 11 ఏళ్ల వయసప్పుడు 1952 ఒలింపిక్స్‌లో తలపడింది.
35
పోటీలు జరిగే వేదికలు
ఇప్పటిదాకా ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాలు. ఇందులో పది స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, పదహారు కాంస్యాలున్నాయి.
43
పారిస్‌లో పోటీపడుతున్న టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న వయసు ఇది. భారత బృందంలో అత్యధిక వయసు ఆటగాడు ఇతనే. టీటీ ప్లేయర్ శరత్ కమల్ (42 ఏళ్లు) రెండోస్థానంలో ఉన్నాడు.
45 వేలు
ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న వాలంటీర్లు
72
పారిస్ క్రీడలతో తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత అథ్లెట్లు. వీరిలో బాక్సర్ నిఖత్, అథ్లెట్లు జ్యోతి యర్రాజి, జ్యోతికశ్రీ, శ్రీజ, షూటర్ ఇషా సింగ్‌లాంటి తెలుగు ప్లేయర్లున్నారు.
117
భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో పోటీపడుతున్న మొత్తం అథ్లెట్లు. ఈ బృందంలో అత్యధికంగా 29 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ నుంచి, 21 మంది షూటింగ్ విభాగం బరిలో ఉన్నారు.
329
పోటీలు జరిగే పతక విభాగాలు
6 లక్షలు
క్రీడాగ్రామంలో ప్రతిరోజు అథ్లెట్లకు వడ్డించే భోజనాల సంఖ్య
రూ. 40 వేల కోట్లు
పారిస్ క్రీడల నిర్వహణ కోసం ఫ్రాన్స్ వెచ్చిస్తున్న ఖర్చు
45 వేలు
ఒలింపిక్స్ కోసం ఏర్పాటుచేసిన భద్రతా సిబ్బంది
Updated Date - Jul 26 , 2024 | 04:20 AM