పట్టాలెక్కిన చెన్నై
ABN, Publish Date - Apr 09 , 2024 | 01:26 AM
భారీ స్కోర్లతో బెంబేలెత్తిస్తూ.. తాజా సీజన్‌లో ఓటమనేదే లేకుండా దూసుకెళుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు ఝలక్. తమ సొంత ఇలాకాలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వారి జోరుకు బ్రేక్ వేసింది. అలాగే చెన్నై రెండు వరుస ఓటముల తర్వాత గెలుపు బాట పట్టింది...
కోల్‌కతాపై ఘనవిజయం
చెలరేగిన బౌలర్లు
రుతురాజ్ అర్ధసెంచరీ
చెన్నై: భారీ స్కోర్లతో బెంబేలెత్తిస్తూ.. తాజా సీజన్‌లో ఓటమనేదే లేకుండా దూసుకెళుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు ఝలక్. తమ సొంత ఇలాకాలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వారి జోరుకు బ్రేక్ వేసింది. అలాగే చెన్నై రెండు వరుస ఓటముల తర్వాత గెలుపు బాట పట్టింది. బౌలింగ్‌లో స్పిన్నర్ రవీంద్ర జడేజా (3/18), పేసర్లు తుషార్ దేశ్‌పాండే (3/33), ముస్తాఫిజుర్ (2/22) కేకేఆర్ బ్యాటర్లకు ముకుతాడు వేశారు. అటు బ్యాటింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ సాధించడంతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎ్‌సకే 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. చెపాక్‌లో చెన్నైకిది హ్యాట్రిక్ విజయం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. శ్రేయాస్ (34), నరైన్ (27), రఘువంశీ (24) మాత్రమే ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 141 పరుగులు చేసి గెలిచింది. శివమ్ దూబే (28), మిచెల్ (25) సహకరించారు. వైభవ్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా జడేజా నిలిచాడు.
సునాయాసంగా..: స్వల్ప ఛేదన.. పైగా మంచు ప్రభావం ఉండడంతో సీఎ్‌సకే ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ను ముగించింది. స్లో వికెట్‌పై రుతురాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో తుదికంటా నిలిచాడు. ఉన్న కాసేపు ఓపెనర్ రచిన్ రవీంద్ర (15) మూడు ఫోర్లతో జోరు చూపి పేసర్ వైభవ్‌కు చిక్కాడు. అయితే కెప్టెన్ రుతురాజ్ ఫామ్‌ను అందుకుంటూ వరుస ఫోర్లతో చెలరేగడంతో పవర్‌ప్లేలో జట్టు 52/1 స్కోరుతో నిలిచింది. అతడికి మిచెల్ అండగా నిలిచి నరైన్ ఓవర్‌లో 6,4తో అలరించాడు. అయితే స్పిన్నర్ వరుణ్ మాత్రం పరుగులను కట్టడి చేశాడు. దీంతో ఇద్దరూ ఎక్కువగా సింగిల్స్‌పై దృష్టి సారించారు. అటు 12వ ఓవర్‌లో రుతురాజ్ ఈ సీజన్‌లో తొలి అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే చక్కగా కుదురుకున్న వేళ మిచెల్ అనవసర షాట్‌కు వెళ్లి నరైన్ ఓవర్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 70 పరుగుల విలువైన భాగస్వామ్యం ముగిసింది. అనంతరం స్పిన్ స్పెషలిస్ట్ శివమ్ దూబే 16వ ఓవర్‌లో రెండు, 17వ ఓవర్‌లో మరో సిక్సర్ బాది అవుటైనా సమీకరణం 19 బంతుల్లో 3 పరుగులకు మార్చాడు. ఇక విజయ లాంఛనాన్ని పూర్తి చేసేందుకు అనూహ్యంగా ఎంఎస్ ధోనీ (1 నాటౌట్) క్రీజులోకి రావడంతో చెపాక్ ఊగిపోయింది. అయితే గైక్వాడ్ విన్నింగ్ షాట్ ఫోర్‌తో మరో 14 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.
బౌలర్ల హవా: 85, 88.. తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కేకేఆర్ పవర్‌ప్లే స్కోర్లివి. చెపాక్‌లో ఆ స్థాయి జోరు చూపలేకపోయినా.. తొలి ఐదు ఓవర్లలో 50 పరుగులతో ఫర్వాలేదనిపించింది. కానీ స్పిన్నర్ జడేజా బంతి చేపట్టాక అంతా తారుమారైంది. అటు ట్రాక్ కూడా ఒక్కసారిగా టర్న్ కావడంతో బ్యాటర్లకు షాట్లు ఆడేందుకే కష్టమైంది. పేసర్లు తుషార్, ముస్తాఫిజుర్ తమ వంతు సహకారం అందించడంతో కేకేఆర్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు ఇన్నింగ్స్ తొలి బంతికే జడేజా మెరుపు క్యాచ్‌తో ఓపెనర్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. పేసర్ తుషార్ ఈ వికెట్ తీసి ఒక్క పరుగే ఇచ్చాడు. కానీ అతడి రెండో ఓవర్‌లో ఓపెనర్ నరైన్ 4,4,6తో 19 రన్స్ రాబట్టాడు. ఐదో ఓవర్‌లో నరైన్, రఘువంశీ చెరో సిక్సర్ సహాయంతో పవర్‌ప్లేలో 56 పరుగులు చేయగలిగింది. ఇద్దరూ ధాటిగా ఆడుతున్నవేళ.. ఏడో ఓవర్‌లో స్పిన్నర్ జడేజా కేకేఆర్ లయను దెబ్బతీశాడు. రఘువంశీ, నరైన్ ఇద్దరినీ పెవిలియన్‌కు చేర్చడంతో రెండో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక బంతిని టచ్ చేసేందుకే కష్టపడిన వెంకటేశ్ అయ్యర్ (3)ను తన తర్వాతి ఓవర్‌లోనే జడ్డూ అవుట్ చేశాడు. మరోవైపు శ్రేయా్‌సతో పాటు బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన రమణ్‌దీప్ డిఫెన్సివ్ ఆటతీరుతో దాదాపు ఆరు ఓవర్లపాటు ఫోర్ కూడా నమోదు కాలేదు. 12వ ఓవర్‌లో సిక్సర్‌తో ఆకట్టుకున్న రమణ్‌దీప్ (13)ను తర్వాతి బంతికే తీక్షణ బౌల్డ్ చేశాడు. రింకూ సింగ్ (9) బరిలోకి దిగినా షాట్లు ఆడడంలో విఫలమయ్యాడు. డెత్ ఓవర్లలోనూ పరిస్థితి మారలేదు. సీఎస్‌కే పేసర్లు తమ పదునేంటో చూపించారు. 17వ ఓవర్‌లో రింకూను తుషార్ బౌల్డ్ చేశాడు. అలాగే హిట్టర్ రస్సెల్ సైతం 18వ ఓవర్‌లో ఐదు డాట్ బాల్స్ ఆడడం గమనార్హం. అలాగే అతడిచ్చిన క్యాచ్‌ను కీపర్ ధోనీ అందుకోలేకపోయినా.. తర్వాతి ఓవర్‌లోనే రస్సెల్‌ను తుషార్ వెనక్కిపంపాడు. చివరి ఓవర్‌లో ముస్తాఫిజుర్ తన కట్టర్ బంతులతో రెండు పరుగులే ఇచ్చి శ్రేయాస్, స్టార్క్ (0) వికెట్లు తీశాడు.
స్కోరుబోర్డు
కోల్‌కతా: సాల్ట్ (సి) జడేజా (బి) తుషార్ 0, నరైన్ (సి) తీక్షణ (బి) జడేజా 27, రఘువంశీ (ఎల్బీ) జడేజా 24, శ్రేయాస్ (సి) జడేజా (బి) ముస్తాఫిజుర్ 34, వెంకటేష్ (సి) మిచెల్ (బి) జడేజా 3, రమణ్‌దీప్ (బి) తీక్షణ 13, రింకూ సింగ్ (బి) తుషార్ 9, రస్సెల్ (సి) మిచెల్ (బి) తుషార్ 10, అనుకూల్ రాయ్ (నాటౌట్) 3, స్టార్క్ (సి) రచిన్ (బి) ముస్తాఫిజుర్ 0, వైభవ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 137/9; వికెట్లపతనం: 1-0, 2-56, 3-60, 4-64, 5-85, 6-112, 7-127, 8-135, 9-135; బౌలింగ్: తుషార్ దేశ్‌పాండే 4-0-33-3, ముస్తాఫిజుర్ 4-0-22-2, శార్దూల్ 3-0-27-0, తీక్షణ 4-0-28-1, జడేజా 4-0-18-3, రచిన్ 1-0-4-0.
చెన్నై: రచిన్ (సి) వరుణ్ (బి) వైభవ్ 15, రుతురాజ్ (నాటౌట్) 67, మిచెల్ (బి) నరైన్ 25, దూబే (బి) వైభవ్ 28, ధోనీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 17.4 ఓవర్లలో 141/3; వికెట్ల పతనం: 1-27, 2-97, 3-135; బౌలింగ్: స్టార్క్ 3-0-29-0, వైభవ్ అరోరా 4-0-28-2, అనుకూల్ రాయ్ 1.4-0-18-0, నరైన్ 4-0-30-1, వరుణ్ 4-0-26-0, రస్సెల్ 1-0-8-0.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
రాజస్థాన్ 4 4 0 0 8 1.120
కోల్‌కతా 4 3 1 0 6 1.528
లఖ్‌నవూ 4 3 1 0 6 0.775
చెన్నై 5 3 2 0 6 0.666
హైదరాబాద్ 4 2 2 0 4 0.409
పంజాబ్ 4 2 2 0 4 -0.220
గుజరాత్ 5 2 3 0 4 -0.797
ముంబై 4 1 3 0 2 -0.704
బెంగళూరు 5 1 4 0 2 -0.843
ఢిల్లీ 5 1 4 0 2 -1.370
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
Updated Date - Apr 09 , 2024 | 01:26 AM