రైజర్స్ కు ముకుతాడు
ABN, Publish Date - Apr 26 , 2024 | 03:51 AM
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. అవును.. సరిగ్గా నెల రోజుల క్రితం తొలి విజయం సాధించిన ఈ జట్టు ఆ తర్వాత వరుసగా ఆరు పరాజయాలతో అభిమానులను నిరాశ పరిచింది...
నేటి మ్యాచ్
కోల్‌కతా X పంజాబ్, రాత్రి 7.30 గం. , వేదిక: కోల్‌కతా
సత్తా చాటిన బౌలర్లు
పటీదార్, కోహ్లీ అర్ధసెంచరీలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. అవును.. సరిగ్గా నెల రోజుల క్రితం తొలి విజయం సాధించిన ఈ జట్టు ఆ తర్వాత వరుసగా ఆరు పరాజయాలతో అభిమానులను నిరాశ పరిచింది. ఇక లీగ్‌లో భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్న సన్‌రైజర్స్‌తో మ్యాచ్ అనగానే అందరూ ఆర్‌సీబీపై జాలి చూపిన వారే.. కానీ బలహీనంగా భావిస్తున్న వారి బౌలింగ్ విభాగమే ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లకు ముకుతాడు వేసింది. తద్వారా జట్టు రెండో విజయం అందుకుంది.
హైదరాబాద్: ఐపీఎల్‌లో పట్టపగ్గాల్లేకుండా దూసుకెళుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది. 277, 287, 266.. ఇలా భారీ స్కోర్లతో బెంబేలెత్తిస్తున్న సన్‌రైజర్స్‌ను వారి సొంత ఇలాకాలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడించింది. ఈ సీజన్‌లో ఓవర్‌కు 11 పరుగుల రన్‌రేట్‌తో ప్రత్యర్థి జట్లకు అత్యధిక పరుగులిచ్చుకుంటున్న ఆర్‌సీబీ బౌలర్లు చివరకు సత్తా చాటారు. ఫలితంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో 35 రన్స్‌తో డుప్లెసి సేన ఘనవిజయం సాధించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగులు చేసింది. రజత్ పటీదార్ (20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 50), కోహ్లీ (43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 51), గ్రీన్ (20 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్) రాణించారు. ఉనాద్కట్‌కు 3, నటరాజన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు చేసి ఓడింది. షాబాజ్ (40 నాటౌట్), అభిషేక్ (31), కమిన్స్ (31) మాత్రమే మెరుగ్గా ఆడారు. గ్రీన్, కర్ణ్, స్వప్నిల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా పటీదార్ నిలిచాడు.
ఆరంభం నుంచే తడబాటు: తాజా సీజన్‌లో రైజర్స్ దూకుడు ముందు 207 పరుగుల ఛేదన చిన్నదే అనిపించినా.. ఆర్‌సీబీ బౌలర్లు మాత్రం అదరగొట్టారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టారు. ప్రమాదకర హెడ్ (1)కు తొలి ఓవర్‌లోనే జాక్స్ షాకిచ్చాడు. మూ డో ఓవర్‌లో అభిషేక్ 4,6,6తో 20 రన్స్ సాధించడంతో ఇక జోరు ఆరంభమైందనిపించింది. కానీ తర్వాతి ఓవర్‌లోనే అతడి వికెట్‌ను యష్ తీయగా.. స్పిన్నర్ స్వప్నిల్ ఐదో ఓవర్‌లో డబుల్ షాకిస్తూ మార్‌క్రమ్ (7), క్లాసెన్ (7) వికెట్లను తీయడంతో ఎస్‌ఆర్‌హెచ్ 56/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. కాసేపటికే నితీశ్ (13), సమద్ (10) కూడా పెవిలియన్ చేరారు. ఈ దశలో కెప్టెన్ కమిన్స్ ధాటిని ప్రదర్శిస్తూ 11వ ఓవర్‌లో 6,6.. 12వ ఓవర్‌లో 4,6తో ఆశలు రేపాడు. కానీ అతడూ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. పేసర్ గ్రీన్ తన వరుస ఓవర్లలో కమిన్స్‌తో పాటు భువనేశ్వర్ (13) వికెట్లను తీయడంతో ఇక చేసేదేమీ లేకపోయింది. చివర్లో షాబాజ్ ఒంటరి పోరాటం ఏమాత్రం ఫలితాన్నివ్వలేదు.
పటీదార్, విరాట్ హాఫ్ సెంచరీలు: రైజర్స్ బ్యాటర్ల విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకునో ఏమో.. టాస్ గెలవగానే ఆర్‌సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. వీరి ఇన్నింగ్స్‌లో రజత్ పటీదార్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. విరాట్ ఆటలో వేగం లేకపోవడం భారీ స్కోరుపై ప్రభావం పడింది. చివర్లో గ్రీన్ బ్యాట్ ఝుళిపించడంతో వరుసగా మూడో మ్యాచ్‌లో స్కోరు 200 దాటింది. పేసర్ ఉనాద్కట్ తన వందో ఐపీఎల్ మ్యాచ్‌లో విశేషంగా రాణించి కీలక వికెట్లు తీశాడు. ఓపెనర్లు విరాట్, డుప్లెసి తొలి వికెట్‌కు 48 పరుగులు అందించడంతో జట్టుకు శుభారంభమే దక్కింది. రెండో ఓవర్‌లోనే డుప్లెసి మూడు ఫోర్లతో రాణించగా, ఆ తర్వాత విరాట్ రెండు ఫోర్లు, డుప్లెసి సిక్సర్‌తో 19 పరుగులు జత చేరాయి. కానీ నాలుగో ఓవర్‌లోనే డుప్లెసి వికెట్ నటరాజన్ తీయడంతో ఆర్‌సీబీకి తొలి షాక్ తగిలింది. ఆ తర్వాత రెండు ఓవర్లలో పరుగులు తగ్గడంతో పవర్‌ప్లేలో జట్టు 61/1 పరుగులు చేసింది. ఆ వెంటనే విల్ జాక్స్ (6) నిరాశపరిచినా.. కోహ్లీకి జత కలిసిన పటీదార్.. రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కానీ మరో ఎండ్‌లో కోహ్లీ నుంచి ఆ స్థాయి ప్రదర్శన కనిపించలేదు. రజత్ మాత్రం ఓవర్‌కో బౌండరీ ఉండేలా చూడగా, స్పిన్నర్ మార్కండే ఓవర్ (11వ)లో అయితే వరుసగా 4 సిక్సర్లతో 27 పరుగులు రాబట్టాడు. దీంతో స్కోరు వంద దాటింది. అటు 19 బంతుల్లోనే వరుసగా తన రెండో ఫిఫ్టీని కూడా పూర్తి చేశాడు. అయితే పటీదార్ దూకుడుకు ఉనాద్కట్ 13వ ఓవర్‌లో తెర దించాడు. ఫుల్ టాస్ బంతిని ఆడిన పటీదార్ డీప్ స్క్వేర్‌లో సమద్‌కు క్యాచ్ ఇవ్వడంతో మూడో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు 37 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ మధ్య ఓవర్లలో పూర్తిగా నెమ్మదించాడు. ఆరో ఓవర్‌లో సిక్సర్ బాదాక.. 15వ ఓవర్‌లో అతను అవుటయ్యే వరకు కూడా మరో బౌండరీ సాధించలేకపోయాడు. ఉనాద్కట్ అతడి వికెట్ తీయగా.. తన తర్వాతి ఓవర్‌లోనే లొమ్రోర్ (7)ను సైతం పెవిలియన్‌కు చేర్చాడు. గ్రీన్ మాత్రం ధాటిని కనబరుస్తూ 19వ ఓవర్‌లో మూడు ఫోర్లతో 15 రన్స్ అందించాడు. కానీ భీకర ఫామ్‌లో ఉన్న దినేశ్ కార్తీక్ (11) అదే ఓవర్‌లో వెనుదిరిగాడు. చివరి ఓవర్‌లో స్వప్నిల్ (12) 6,4తో 12 పరుగులు వచ్చాయి.
స్కోరుబోర్డు
బెంగళూరు: కోహ్లీ (సి) సమద్ (బి) ఉనాద్కట్ 51, డుప్లెసి (సి) మార్‌క్రమ్ (బి) నటరాజన్ 25, జాక్స్ (బి) మార్కండే 6, పటీదార్ (సి) సమద్ (బి) ఉనాద్కట్ 50, గ్రీన్ (నాటౌట్) 37, లోమ్రోర్ (సి) కమిన్స్ (బి) ఉనాద్కట్ 7, కార్తీక్ (సి) సమద్ (బి) కమిన్స్ 11, స్వప్నిల్ (సి) అభిషేక్ (బి) నటరాజన్ 12, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 206/7; వికెట్ల పతనం: 1-48, 2-65, 3-130, 4-140, 5-161, 6-193, 7-206; బౌలింగ్: అభిషేక్ 1-0-10-0, భువనేశ్వర్ 1-0-14-0, కమిన్స్ 4-0-55-1, నటరాజన్ 4-0-39-2, షాబాజ్ 3-0-14-0, మార్కండే 3-0-42-1, ఉనాద్కట్ 4-0-30-3.
సన్‌రైజర్స్: అభిషేక్ (సి) కార్తీక్ (బి) యశ్ దయాల్ 31, హెడ్ (సి) కర్ణ్ శర్మ (బి) జాక్స్ 1, మార్‌క్రమ్ (ఎల్బీ) స్వప్నిల్ 7, నితీశ్ కుమార్ (బి) కర్ణ్ శర్మ 13, క్లాసెన్ (సి) గ్రీన్ (బి) స్వప్నిల్ 7, షాబాజ్ (నాటౌట్) 40, సమద్ (సి అండ్ బి) కర్ణ్ శర్మ 10, కమిన్స్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 31, భువనేశ్వర్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 13, ఉనాద్కట్ (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 171/8; వికెట్ల పతనం: 1-3, 2-37, 3-41, 4-56, 5-69, 6-85, 7-124, 8-141; బౌలింగ్: జాక్స్ 2-0-23-1, సిరాజ్ 4-0-20-0, యశ్ దయాల్ 3-0-18-1, స్వప్నిల్ 3-0-40-2, కర్ణ్ శర్మ 4-0-29-2, ఫెర్గూసన్ 2-0-28-0, గ్రీన్ 2-0-12-2.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
రాజస్థాన్ 8 7 1 0 14 0.698
కోల్‌కతా 7 5 2 0 10 1.206
హైదరాబాద్ 8 5 3 0 10 0.577
లఖ్‌నవూ 8 5 3 0 10 0.148
చెన్నై 8 4 4 0 8 0.415
ఢిల్లీ 9 4 5 0 8 -0.386
గుజరాత్ 9 4 5 0 8 -0.974
ముంబై 8 3 5 0 6 -0.227
పంజాబ్ 8 2 6 0 4 -0.292
బెంగళూరు 9 2 7 0 4 -0.721
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
1
ఐపీఎల్ ఓ సీజన్‌లో 100+ సిక్సర్లు బాదడం సన్‌రైజర్స్‌కిదే తొలిసారి. గతం (2022)లో 97 సిక్సర్లు అత్యధికం.
Updated Date - Apr 26 , 2024 | 03:51 AM