రాజస్థాన్ జోష్
ABN, Publish Date - Apr 07 , 2024 | 03:43 AM
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొడుతూ ప్రత్యర్థి జట్లకు గుబులుపుట్టిస్తోంది. కెరీర్‌లో వందో లీగ్ మ్యాచ్ ఆడిన ఓపెనర్ జోష్ బట్లర్ (58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో...
నేటి మ్యాచ్‌లు
ముంబై X ఢిల్లీ, మ.3.30 నుంచి
లఖ్‌నవూ X గుజరాత్, రాత్రి 7.30 నుంచి
వరుసగా నాలుగో విజయంతో టాప్‌లోకి
జూ బెంగళూరు ఓటమి జూ విరాట్ సెంచరీ వృథా
బట్లర్ అజేయ శతకం
జోష్ బట్లర్ (58 బంతుల్లో 100 నాటౌట్)
విరాట్ కోహ్లీ (72 బంతుల్లో 113 నాటౌట్)
జైపూర్: ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొడుతూ ప్రత్యర్థి జట్లకు గుబులుపుట్టిస్తోంది. కెరీర్‌లో వందో లీగ్ మ్యాచ్ ఆడిన ఓపెనర్ జోష్ బట్లర్ (58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో ఎట్టకేలకు సత్తా చాటుకున్నాడు. ఫలితంగా రాజస్థాన్ 6 వికెట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై నెగ్గింది. 8 పాయింట్లతో శాంసన్ సేన టేబుల్ టాపర్‌గా ఉంది. రాజస్థాన్‌కిది వరుసగా నాలుగో గెలుపుకాగా.. ఆర్‌సీబీకి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగో ఓటమి. విరాట్ కోహ్లీ (72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 113 నాటౌట్) సైతం శతకం సాధించినా ఆర్‌సీబీకి ఫలితాన్నివ్వలేకపోయింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఆర్‌సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 183 పరుగులు చేసింది. డుప్లెసి (33 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) రాణించాడు. ఛేదనలో రాజస్థాన్ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 69) అర్ధసెంచరీ సాధించాడు. టోప్లేకు 2 వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా బట్లర్ నిలిచాడు.
బట్లర్, శాంసన్ అదుర్స్: ఛేదనలో నిదానంగా ఆరంభమైన రాజస్థాన్ ఇన్నింగ్స్ బట్లర్, శాంసన్‌ల బాదుడుకు జోరందుకుంది. అటు ఆర్‌సీబీ బౌలర్లు ఎప్పటిలాగే నిరాశపరిచారు. టోప్లే ఒక్కడే ఆకట్టుకోగలిగాడు. ఓపెనర్ జైస్వాల్ (0) ఈ సీజన్‌లో పేలవ ఫామ్‌ను మరోసారి కొనసాగించగా, తొలి ఐదు ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ స్కోరు 34/1 మాత్రమే. అయితే తన చివరి ఆరు ఇన్నింగ్స్‌లో 35 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన ఇంగ్లండ్ స్టార్ బట్లర్ ఎట్టకేలకు ఫామ్‌ను అందుకున్నాడు. ఆరో ఓవర్‌లో అతడు 4,4,6,4తో 20 రన్స్ రాబట్టడంతో పవర్‌ప్లేను జట్టు 54 పరుగులతో ముగించింది. తర్వాత మధ్య ఓవర్లలోనూ వేగాన్ని తగ్గించకుండా బట్లర్, శాంసన్ దీటుగా పరుగుల వరద పారించారు. ఈ ఇద్దరూ చకచకా బౌండరీలతో రన్‌రేట్ తగ్గకుండా చూశారు. 30 బంతుల్లోనే బట్లర్ ఫిఫ్టీ పూర్తి చేయగా, 11వ ఓవర్‌లో శాంసన్ 4,6,4తో 33 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. అయితే 15వ ఓవర్‌లో శాంసన్ వికెట్ తీసిన సిరాజ్ రెండో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యానికి తెర దించాడు. తర్వాతి రెండు ఓవర్లలో రియాన్ పరాగ్ (4)ను యష్ దయాల్, ధ్రువ్ జురెల్ (2)ను టోప్లే అవుట్ చేశారు. అప్పటికి జట్టు గెలుపునకు 18 బంతుల్లో 14 రన్స్ అవసరమవగా, హెట్‌మయెర్ (11 నాటౌట్)తో కలిసి బట్లర్ మ్యాచ్‌ను ముగించాడు. అయితే ఆఖరి ఓవర్‌లో గెలుపునకు ఒక్క పరుగు అవసరం కాగా, బట్లర్ 94 పరుగుల వద్ద ఉన్నాడు. దీంతో అతడు తొలి బంతినే సిక్సర్‌గా మలిచి సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం.
కోహ్లీ ఒక్కడై: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ విరాట్ కోహ్లీ అంతా తానై తుది కంటా నిలిచాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ డుప్లెసితో కలిసి తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. అలాగే ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు తొలిసారి వికెట్ కోల్పోకుండా పవర్‌ప్లేను ముగించగలిగింది. అయితే మధ్య ఓవర్లలో అంత వేగం కనిపించలేదు. తొలి ఓవర్‌లోనే వికెట్ తీసే అలవాటున్న పేసర్ బౌల్ట్ ఈసారి తేలిపోయాడు. ఫామ్‌లో లేని డుప్లెసి ఆరంభంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా, విరాట్ వేగం కనబర్చడంతో పవర్‌ప్లేలో జట్టు 53 పరుగులు సాధించింది. ఆ తర్వాత స్పిన్నర్లు అశ్విన్, చాహల్ పరుగులను కట్టడి చేశారు. కానీ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో డుప్లెసి రెండు సిక్సర్లతో 15 రన్స్ అందించాడు. అటు చాహల్, రియాన్ ఓవర్లలో ఒక్కో సిక్సర్‌తో విరాట్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. స్కోరు నెమ్మదించడంతో వేగంగా ఆడే యత్నంలో డుప్లెసి 14వ ఓవర్‌లో చాహల్‌కు దొరికిపోయాడు. దీంతో తొలి వికెట్‌కు 125 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. హిట్టింగ్ కోసం మ్యాక్స్‌వెల్ (1), సౌరవ్ చౌహాన్ (9)లను ముందే పంపినా ఫలితం లేకపోయింది. ఈ సమయంలో ఆర్‌సీబీకి కావాల్సిన జోష్‌ను 16వ ఓవర్‌లో కోహ్లీ మూడు ఫోర్లతో అందించాడు. అటు 19వ ఓవర్‌లో బర్గర్ నాలుగు పరుగులే ఇవ్వగా.. విరాట్ ఓ సింగిల్‌తో 67 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. చివరి ఓవర్‌లో కోహ్లీ మూడు ఫోర్లు బాది 14 రన్స్ రాబట్టడంతో జట్టు స్కోరు 180 దాటింది.
స్కోరుబోర్డు
బెంగళూరు: కోహ్లీ (నాటౌట్) 113, డుప్లెసి (సి) బట్లర్ (బి) చాహల్ 44, మ్యాక్స్‌వెల్ (బి) బర్గర్ 1, సౌరవ్ చౌహాన్ (సి) జైస్వాల్ (బి) చాహల్ 9, గ్రీన్ (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 183/3; వికెట్ల పతనం: 1-125, 2-128, 3-155; బౌలింగ్: బౌల్ట్ 3-0-30-0, బర్గర్ 4-0-33-1, అశ్విన్ 4-0-28-0, అవేశ్ 4-0-46-0, చాహల్ 4-0-34-2, రియాన్ 1-0-10-0.
రాజస్థాన్: జైస్వాల్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) టోప్లే 0, జోష్ బట్లర్ (నాటౌట్) 100, సంజూ శాంసన్ (సి) యశ్ (బి) సిరాజ్ 69, రియాన్ పరాగ్ (సి) కోహ్లీ (బి) యష్ 4, జురెల్ (సి) కార్తీక్ (బి) టోప్లే 2, హెట్‌మయెర్ (నాటౌట్) 11, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 19.1 ఓవర్లలో 189/4; వికెట్ల పతనం: 1-0, 2-148, 3-155, 4-164; బౌలింగ్: టోప్లే 4-0-27-2, యశ్ దయాల్ 4-0-37-1, సిరాజ్ 4-0-35-1, దాగర్ 2-0-34-0, గ్రీన్ 3.1-0-27-0, హిమాన్షు 2-0-29-0.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
రాజస్థాన్ 4 4 0 0 8 1.120
కోల్‌కతా 3 3 0 0 6 2.518
చెన్నై 4 2 2 0 4 0.517
లఖ్‌నవూ 3 2 1 0 4 0.483
హైదరాబాద్ 4 2 2 0 4 0.409
పంజాబ్ 4 2 2 0 4 -0.220
గుజరాత్ 4 2 2 0 4 -0.580
బెంగళూరు 5 1 4 0 2 -0.843
ఢిల్లీ 4 1 3 0 2 -1.347
ముంబై 3 0 3 0 0 -1.423
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
2
ఐపీఎల్‌లో ఎక్కువ సెంచరీలు (6) చేసిన రెండో బ్యాటర్‌గా గేల్‌తో సమంగా నిలిచిన బట్లర్. విరాట్ (8) అగ్రస్థానంలో ఉన్నాడు.
1
ఐపీఎల్‌లో ఏ వికెట్‌కైనా ఎక్కువ సార్లు (10) 100+ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా విరాట్-డుప్లెసి.
1
ఐపీఎల్‌లో అత్యధిక (8) శతకాలు బాదిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ. ఐపీఎల్‌లో నెమ్మదైన (67 బంతుల్లో) శతకం సాధించిన బ్యాటర్‌గా మనీశ్ పాండేతో సమంగా నిలిచిన కోహ్లీ.
Updated Date - Apr 07 , 2024 | 03:43 AM