ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paralympics : అవని.. బంగారు గని

ABN, Publish Date - Aug 31 , 2024 | 06:30 AM

పారాలింపిక్స్‌లో భారత్‌ రెండో రోజు నుంచే పతకాల వేట ఆరంభించింది. టార్గెట్‌-25 మెడల్స్‌ ధ్యేయంతో బరిలోకి దిగిన మన అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తూ ఒక్క రోజే నాలుగు పతకాలతో ఖుషీ చేశారు. మహిళల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ‘డబుల్‌’ ఆనందాన్ని పంచారు. షూటర్‌ అవనీ లేఖారా వరుసగా

అవనీ లేఖారా

రెండో పారాలింపిక్‌ గోల్డ్‌తో చరిత్ర

షూటర్లు మనీశ్‌కు రజతం, మోనాకు కాంస్యం

100 మీటర్ల రేసులో ప్రీతి కంచు మోత

భారత్‌ ఖాతాలో ఒకేరోజు 4 పతకాలు

పారాలింపిక్స్‌లో భారత్‌ రెండో రోజు నుంచే పతకాల వేట ఆరంభించింది. టార్గెట్‌-25 మెడల్స్‌ ధ్యేయంతో బరిలోకి దిగిన మన అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తూ ఒక్క రోజే నాలుగు పతకాలతో ఖుషీ చేశారు. మహిళల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ‘డబుల్‌’ ఆనందాన్ని పంచారు. షూటర్‌ అవనీ లేఖారా వరుసగా రెండో పారాలింపిక్‌ గోల్డ్‌ మెడల్‌తో అద్భుత: అనిపించగా, మరో షూటర్‌ మోనా అగర్వాల్‌ కాంస్యం అందుకుంది. ఎయిర్‌ పిస్టల్‌లో మనీశ్‌ నర్వాల్‌ రజతంతో మురిపించగా, దేశ పారాగేమ్స్‌ చరిత్రలో తొలిసారిగా మహిళల 100 మీటర్ల రేసులో ప్రీతి పాల్‌ కాంస్యం సాధించడం మరో విశేషం.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం) పారిస్‌: పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల బోణీ ఘనంగా జరిగింది. టోక్యో గేమ్స్‌లో 19 మెడల్స్‌తో మురిపించిన పారా అథ్లెట్లపై ఈసారి భారీ అంచనాలే నెలకొనగా.. దానికి తగ్గట్టుగానే అద్భుత ప్రదర్శన చూపుతున్నారు. గేమ్స్‌ ఆరంభమైన రెండో రోజు శుక్రవారం నాలుగు పతకాలతో మురిపించారు. దీంతో ప్రస్తుతం భారత్‌ ఖాతాలో ఓ స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలు చేరాయి.

డబుల్‌తో బోణీ: మహిళల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌1 ఫైనల్లో మొదట భారత్‌కు రెండు పతకాలు లభించాయి. ఇందులో 22 ఏళ్ల షూటర్‌ అవనీ లేఖారా 249.7 స్కోరుతో చాంపియన్‌గా నిలిచింది. ఆమెకిది రెండో పారాగేమ్స్‌ స్వర్ణం కావడం విశేషం. టోక్యో గేమ్స్‌లోనూ అవని విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో రెండు పారాలింపిక్స్‌ స్వర్ణాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఇక ఫైనల్‌ రౌండ్‌ ఉత్కంఠభరితంగానే సాగింది. తొలి రౌండ్‌ నుంచి కొరియా షూటర్‌ లీ యున్రీ ముందంజలో ఉండి గట్టి పోటీనిచ్చింది. అయితే అవని ఫైనల్‌ షాట్‌ను 10.5 పాయింట్లతో ముగించగా.. యున్రీ మాత్రం 6.8 పాయింట్లకే పరిమితమైంది. దీంతో 1.9 మార్జిన్‌తో అవని విజేతగా నిలువగా.. లీకి రజతం దక్కింది. ఈక్రమంలో .1 తేడాతో అవని తన బెస్ట్‌ పారాగేమ్స్‌ స్కోరును కూడా సాధించింది. ఇక ఇదే విభాగంలో మరో భారత షూటర్‌ మోనా అగర్వాల్‌ 228.7 స్కోరుతో కాంస్యం అందుకుంది. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో అవని రెండు, మోనా ఐదో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించారు.

అథ్లెటిక్స్‌లో ‘ప్రీతి’కరం: తొలిసారిగా పారా అథ్లెటిక్స్‌లో భారత్‌ పతకం సాధించింది. మహిళల 100 మీ. పరుగు టీ35 ఫైనల్‌లో ప్రీతి పాల్‌ 14.21 సెకన్ల టైమింగ్‌తో కాంస్యం సాధించింది. అలాగే ప్రీతికిది పర్సనల్‌ బెస్ట్‌ టైమ్‌. శుక్రవారం భారత్‌ సాధించిన మూడో పతకమిది. 23 ఏళ్ల ప్రీతి మేలో జరిగిన వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలోనూ కాంస్యంతో ఆకట్టుకుంది.

మనీశ్‌కు రజతం: షూటర్‌ మనీశ్‌ అగర్వాల్‌ రూపంలో భారత్‌కు నాలుగో పతకం అందింది. టోక్యో గేమ్స్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌ 50మీ. పిస్టల్‌లో స్వర్ణం అందుకున్న తను పారి్‌సలోనూ సత్తా చాటాడు. ఈసారి మనీశ్‌ 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌ 1లో 234.9 పాయింట్లతో రజతం సాధించాడు. తొలుత స్వర్ణం ఖాయమనుకున్నా చివర్లో లయ తప్పాడు. ఆఖరిదైన 24వ షాట్‌లో మనీశ్‌ 8.9, 9.9 స్కోరు చేయగా, ప్రత్యర్థి జోంగ్డు (కొరియా) 10.8, 8.7తో గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాడు. దీంతో మనీశ్‌ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు మిక్స్‌డ్‌ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌2లో శ్రీహర్ష 0.1 తేడాతో తొమ్మిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత కోల్పోయాడు.

ఆర్చరీ, రోయింగ్‌ల్లో..

పురుషుల ఆర్చరీ వ్యక్తిగత కాంపౌండ్‌ ఓపెన్‌లో రాకేశ్‌ కుమార్‌ ప్రీక్వార్టర్స్‌కు చేరాడు. ఎలిమినేషన్‌ రౌండ్‌లో తను సెనెగల్‌కు చెందిన అలియో డ్రేమ్‌ను 136-134 తేడాతో ఓడించాడు. మిక్స్‌డ్‌ పీఆర్‌3 డబుల్‌ స్కల్స్‌ హీట్‌1లో ఏపీకి చెందిన నారాయణ కొంగనపల్లె-అనిత జోడీ 8:06.84 టైమింగ్‌తో ఐదో స్థానంలో నిలిచారు. ఫైనల్లో చోటు కోసం నేడు రెపిచేజ్‌ 2లో తలపడనున్నారు.

వీరికి నిరాశే..

పురుషుల సైక్లింగ్‌ సీ2 3000 మీటర్ల వ్యక్తిగత విభాగంలో తెలుగు అథ్లెట్‌ షేక్‌ అర్షద్‌ అర్హత రౌండ్‌లోనే వెనుదిరిగాడు. 4 నిమిషాల 20.949 సెకన్ల టైమింగ్‌తో అర్షద్‌ ఆఖరైన తొమ్మిదో స్థానంలో నిలిచాడు. టాప్‌-4 మాత్రమే ఫైనల్‌కు వెళతారు. మహిళల డిస్క్‌సత్రో ఎఫ్‌55 ఫైనల్‌లో సాక్షి కసానా ఎనిమిది, కరమ్‌జ్యోతి తొమ్మిదో స్థానంలో నిలిచారు. అలాగే మహిళల టీటీ డబుల్స్‌ డబ్ల్యూడీ 10 క్వార్టర్స్‌లో సోనాల్‌బెన్‌-భవిన జోడీ కొరియా చేతిలో ఓడింది.

సెమీ్‌సలో సుహాస్‌, నితేశ్‌

పారా బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌ 4లో సుహాస్‌, ఎస్‌ఎల్‌ 3లో నితేశ్‌ కుమార్‌ సెమీఫైనల్స్‌లో ప్రవేశించారు. సుహాస్‌ 26-24, 21-14 తేడాతో క్యుంగ్‌ వాన్‌ (కొరియా)పై, నితేశ్‌ 21-5, 21-11తేడాతో యాంగ్‌ (చైనా)పై గెలిచారు. అలాగే మహిళల సింగిల్స్‌ ఎస్‌యూ 5 గ్రూప్‌ ఎలో తులసీమతి 21-12, 21-8 తేడాతో మోంటీరో (పోర్చుగల్‌)పై గెలిచి సెమీస్‌ చేరింది. మరోవైపు సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3లో మానసి జోషి వరుసగా రెండో ఓటమి పాలవగా...మనోజ్‌ సర్కార్‌ కూడా పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌ 3 లో రెండో ఓటమితో నిష్క్రమించాడు.

పోలియోను లెక్క చేయక..

పారా ఒలింపిక్స్‌లోనూ షూటర్లే భారత్‌కు పతక బోణీ చేశారు. మహిళల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ కేటగిరీలో అవనీ లేఖారా బంగారు పతకంతో మెరిస్తే ఇదే విభాగంలో 37 ఏళ్ల మోనా అగర్వాల్‌ కాంస్యంతో సత్తా చాటింది. అవని మాదిరే మోనా కూడా రాజస్థాన్‌ షూటరే. సికార్‌కు చెందిన మోనా తొమ్మిది నెలల వయస్సులో పోలియో బారిన పడింది. ఫలితంగా చక్రాల కుర్చీకే పరిమితమైన ఆమెను బాల్యంలో అంతా హేళన చేసేవారు. పైగా..తల్లిదండ్రులకు మోనా మూడో ఆడబిడ్డ. దాంతో బంధువులు, పెద్దలనుంచి అవహేళనలు మరింతగా ఉండేవి. కానీ మోనా అవేమీ పట్టించుకోలేదు. పైగా ఆమెలో పట్టుదల మెండు. అమ్మమ్మ గీతా దేవి..మోనాకు అండగా నిలిచింది. క్రీడల్లో రాణించాలని మోనా చిన్నతనం నుంచి కలలు కంటూ ఉండేది. సికార్‌లో హార్డ్‌వేర్‌ షాపు నిర్వహిస్తుండే తండ్రి..మోనాను క్రీడలవైపు ప్రోత్సహించాడు. పారా అథ్లెటిక్స్‌లో షాట్‌పుట్‌, డిస్కస్‌ త్రో, జావెలిన్‌ త్రోలో రాష్ట్రస్థాయి పోటీలలో ఆమె పాల్గొంది. 2017లో పారా బాస్కెట్‌బాల్‌ ఆటగాడు రవీంద్ర చౌధరితో మోనాకు వివాహమైంది. అనంతరం ఉదయ్‌పూర్‌కు మారిన అగర్వాల్‌ పారా వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రవేశించింది. 60 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయి టైటిల్‌ కూడా దక్కించుకుంది. ఇక..ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక 2021లో భర్త ప్రోత్సాహంతో మోనా పారా షూటింగ్‌లోకి అడుగుపెట్టింది. జైపూర్‌లోని ఏకలవ్య షూటింగ్‌ అకాడమీలో యోగేష్‌ షెకావత్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందింది. అదే ఏడాది జూలైలో క్రొయేషియాలో జరిగిన పారా వరల్డ్‌ కప్‌ షూటింగ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. గత ఏప్రిల్‌లో కొరియా ఆతిథ్యమిచ్చిన ప్రపంచ కప్‌లో మోనా స్వర్ణ పతకంతో భళా అనిపించింది. ఢిల్లీలో జరిగిన వరల్డ్‌ కప్‌లో పారిస్‌ క్రీడల బెర్త్‌ అందుకుంది.

గురి తప్పని గన్‌

స్టార్‌ షూటర్‌ అవనీ లేఖారా అంచనాలను అందుకుంది. టోక్యోలో సాధించిన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. 11 ఏళ్ల వయస్సులో కారు ప్రమాదానికిగురై..నడుము కింది భాగం వరకు చచ్చుపడిపోయిన స్థితి నుంచి వరుసగా రెండు పారా విశ్వక్రీడల్లో పసిడి పతకాలు కొల్లగొట్టే స్థాయికి చేరడం ఆమె అంతులేని ఆత్మవిశ్వాసానికి, ప్రతిభకు నిదర్శనం. లేఖారా అంతర్జాతీయ పారా షూటర్‌గా రూపుదిద్దుకోవడం వెనుక నవీ ముంబైలోని లక్ష్య షూటింగ్‌ క్లబ్‌ వ్యవస్థాపకురాలు సుమ షిరూర్‌ కృషి ఎంతో ఉంది. ఒలింపిక్స్‌ ఫైనలిస్ట్‌, వరల్డ్‌ రికార్డు హోల్డర్‌ సుమ వద్ద 2018 నుంచి లేఖారా శిక్షణ పొందుతోంది. సంవత్సరంలో నాలుగుసార్లు క్లబ్‌కు వచ్చి సుమ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తర్ఫీదు పొందుతోంది.. అలా టోక్యోలో మహిళల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌లో స్వర్ణం, 50 మీ. ఎయిర్‌ రైఫిల్‌ కాంస్య పతకాలను అవని దక్కించుకుంది. తద్వారా ఒకే పారాలింపిక్స్‌లో రెండు మెడల్స్‌ చేజిక్కించుకున్న భారత మహిళా పారా అథ్లెట్‌గా చరిత్ర పుటలకెక్కింది. టోక్యో క్రీడల తర్వాత పారా షూటింగ్‌ వరల్డ్‌ కప్‌లోనూ అవని పసిడి పతకం సొంతం చేసుకుంది. ఇక..జూనియర్‌, సీనియర్‌ స్థాయిల్లో ప్రపంచ రికార్డులు సృష్టించడం ద్వారా పారా షూటింగ్‌ భవిష్య అంతర్జాతీయ స్టార్‌గా మన్ననలు అందుకొంది. తన ప్రతిభకు వన్నెలద్దుతూ పద్మశ్రీ, ఖేల్‌రత్న, యంగ్‌ ఇండియన్‌ షూటర్‌, పారా అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు లేఖారాను వరించాయి. అవని విజయాలను గుర్తించిన రాజస్థాన్‌ ప్రభుత్వం ఆమెను అటవీ శాఖలో అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌గా నియమించింది. అలాగే ‘బేటీ బచావ్‌, బేటీ పడావో’కు లేఖారా బ్రాండ్‌ అంబాసిడర్‌ కావడం విశేషం.

పారాలింపిక్స్‌లో స్వర్ణంతో మురిపించిన అవనీ లేఖారా, రజతం సాధించిన మనీశ్‌, కాంస్య పతకాలు నెగ్గిన మోనా అగర్వాల్‌, ప్రీతిల అంకితభావం, ప్రతిభను చూసి దేశం గర్వపడుతోంది. - ప్రధాని నరేంద్ర మోదీ

Updated Date - Aug 31 , 2024 | 06:30 AM

Advertising
Advertising