IND vs NZ: ఆ భయం టీమిండియాను వెంటాడుతోంది.. అందుకే జట్టులో మార్పులు
ABN, Publish Date - Oct 24 , 2024 | 11:42 AM
వాషింగ్టన్ సుందర్ ను జట్టులో తీసుకోవడంపై గవాస్కర్ స్పందిస్తూ.. మొన్నటి మ్యాచ్ లో పరాజయం భారత్ ను కంగారు పెడుతున్నట్టు అర్థమవుతోందని వ్యాఖ్యానించాడు.
పూణె: న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో భాగంగా భారత్ రెండో మ్యాచ్ నేడు మొదలైంది. పూణె వేదికగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మొదలైన మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బౌలింగ్ ను ఎంచుకోవాల్సి వచ్చింది. ప్లేయింగ్ లెవెన్ లో టీమిండియా ఈ మ్యాచ్ కోసం భారీ మార్పులు చేసింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టుకు దూరమైన శుభ్ మన్ గిల్ గాయం నుంచి కోలుకోగా పేసర్ ఆకాశ్ దీప్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులో భాగమయ్యారు. మరోవైపు బెంగళూరులో ఘోర పరాజయం తర్వాత కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ లెవన్ లో తమ స్థానాలను కోల్పోయారు.
ఆ కంగారు తెలుస్తోంది..
జట్టులో మార్పులపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. వాషింగ్టన్ సుందర్ ను జట్టులో తీసుకోవడంపై గవాస్కర్ స్పందిస్తూ.. మొన్నటి మ్యాచ్ లో పరాజయం భారత్ ను కంగారు పెడుతున్నట్టు అర్థమవుతోందని వ్యాఖ్యానించాడు. ’’క్రికెటర్లు గాయాలతో బాధపడితే తప్ప జట్టులో మూడు మార్పులు చేయడం నేను ఎక్కడా చూడలేదు. వాషింగ్టన్ సుందర్‌ని అదనంగా చేర్చుకోవడం చూస్తుండే టీమిండియా తమ బ్యాటింగ్ ఆర్డర్ పై ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది. నేనైతే కుల్ దీప్ యాదవ్ కే కట్టుబడి ఉండేవాడిని ఎందుకంటే న్యూజిలాండ్ ఆటగాళ్లలో ఎక్కువ శాతం ఎడమచేతి వాటం ఉన్నవారే ఉన్నారు. కుల్ దీప్ వారిని సమర్థంగా ఎదుర్కొని బౌలింగ్ చేయగలిగేవాడు‘‘ అని గవాస్కర్ తెలిపాడు.
దాని అర్థం వారు భయపడుతున్నారని కాదు..
న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ టీమిండియా ఆకస్మిక నిర్ణయం తనను షాక్ కు గురిచేసిందన్నాడు. భారత్ ఈ మార్పులు చేయడానికి గల కారణం వారు భయపడుతున్నారని కాదు. కానీ ఈ మార్పులు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. మ్యాచ్ కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆటగాళ్లకు మద్దతుగా మాట్లాడిన టీమ్ ఆ వెంటనే జట్టును ప్రకటించే సమయంలో మార్పులు చేయడంతో వారి వైఖరి కాస్త భిన్నంగా అనిపించింది. సుందర్ దేశవాలి క్రికెట్ లో భారీ పరుగులు అందించాడు. మరి అశ్విన్ బౌలింగ్ టీమిండియాను మెప్పించలేకపోయిందా? ఎందుకంటే రెండో ఆఫ్ స్పిన్నర్ ని తీసుకురావాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్ మరింత డెప్త్ గా ఉండాలని ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు‘‘ అని సైమన్ డౌల్ వెల్లడించాడు.
ఒత్తిడిలో భారత్
Updated Date - Oct 24 , 2024 | 11:42 AM