T20 WC India vs England : లెక్క సరిచేస్తారా!
ABN, Publish Date - Jun 27 , 2024 | 05:29 AM
ఆలస్యంగా జోరందుకొన్న భారత్.. నాకౌట్ తడబాటుకు చెక్ చెప్పాలన్న కసితో ఉంది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. చివరిసారి ఈ రెండు జట్లు 2022 పొట్టికప్
జోరుమీదున్న రోహిత్ సేన
కీలకంగా బుమ్రా, కుల్దీప్
రెండో సెమీ్‌సలో ఇంగ్లండ్‌తో భారత్ ఢీ నేడు
రాత్రి 8 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో
జార్జ్‌టౌన్ (గయానా): ఆలస్యంగా జోరందుకొన్న భారత్.. నాకౌట్ తడబాటుకు చెక్ చెప్పాలన్న కసితో ఉంది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. చివరిసారి ఈ రెండు జట్లు 2022 పొట్టికప్ సెమీ్‌సలో తలపడగా.. రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఆ ఓటమికి ఈసారి ఎలాగైనా బదులు తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మనోళ్ల సంప్రదాయ ఆటతీరు అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ఆటతీరు మార్చుకొన్న భారత్.. టీ20లకు అవసరమైన దూకుడును అలవర్చుకొంది. పేపర్‌పై చూస్తే భారత జట్టు ఎంతో బలంగా కనిపిస్తోంది. అజేయంగా సెమీ్‌సకు చేరినా.. టాపార్డర్‌లో కోహ్లీ ఫామ్ జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. కానీ, రోహిత్ ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆస్ట్రేలియాపై చెలరేగిన తీరు.. అతడి ఆటపై నెలకొన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది. మిడిలార్డర్‌లో శివమ్ దూబే కూడా ఆశించిన స్థాయిలో ఆడలేక పోవడం విమర్శలకు దారితీస్తున్నా.. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడానికి మేనేజ్‌మెంట్ ఇష్టపడడం లేదు. స్పిన్ బాధ్యతలను జడేజా, అక్షర్, కుల్దీప్ చేపట్టనున్నారు. ఇక, పేసర్ బుమ్రా నిలకడగా రాణిస్తుండడం భారత్‌కు సానుకూలం. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా మెరుగ్గా రాణిస్తున్న నేపథ్యంలో.. జట్టు మరోసారి అతడి నుంచి అదే తరహా ప్రదర్శనను ఆశిస్తోంది.
ప్రమాదకరంగా బట్లర్..: కిందామీదా పడుతూ సెమీస్ చేరిన ఇంగ్లండ్.. ప్రమాదకరంగా కనిపిస్తోంది. అమెరికా మ్యాచ్‌తో కెప్టెన్ బట్లర్ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం. ఓపెనర్ ఫిల్‌సాల్ట్, బెయిర్‌స్టో, బ్రూక్ కూడా ధనాధన్ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు. మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, లివింగ్‌స్టోన్ స్పిన్ భారాన్ని మోస్తున్నారు. పేసర్లలో ఆర్చర్‌కు జోడీగా జోర్డాన్, మార్క్ ఉడ్‌లలో ఎవరికి తుదిజట్టులో చోటు కల్పించాలనే డైలమాలో బట్లర్ ఉన్నాడు. మొత్తంగా ఈ సమవుజ్జీల సమరం ఆసక్తిగా సాగే అవకాశం ఉంది.
పిచ్/వాతావరణం
వికెట్ స్పిన్నర్లకు అనుకూలం కావడంతో.. ఓ మాదిరి స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. బౌన్స్ తక్కువగా ఉండడంతోపాటు బంతి వేగంగా టర్న్ తీసుకొనే చాన్సులున్నాయి. కాగా, భారత్‌కు ఈ వికెట్‌పై ఆడిన అనుభవం కలసిరానుంది. వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వరల్డ్‌క్‌పలో ఈ వికెట్‌పై ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు మూడు గెలిచింది.
రిజర్వు డే లేదు..
భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఈ మ్యాచ్‌కు రిజర్వు డే లేదని ఎంతో ముందుగానే నిర్ణయించారు. రిజర్వ్‌డే ఉంటే ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు గెలిచిన జట్టు.. మరికొన్ని గంటల్లోనే సిద్ధం కావాల్సి వస్తుంది. కానీ, 250 నిమిషాల అదనపు సమయం మాత్రం కేటాయించారు. సెమీ్‌సలో విజేతను తేల్చాలంటే కనీసం 10 ఓవర్ల మ్యాచ్ జరగాలి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే సూపర్-8 టాపర్ భారత్.. ఫైనల్‌కు చేరుకొంటుంది.
Updated Date - Jun 27 , 2024 | 05:29 AM