తెలుగోడి సత్తా
ABN, Publish Date - Apr 10 , 2024 | 01:30 AM
ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆఖరి బంతికి ఊపిరిపీల్చుకుంది. రైజర్స్ తరఫున తొలిసారి ఓ తెలుగు క్రికెటర్ అదరగొట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ నితీశ్ కుమార్ రెడ్డి (37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64) అర్ధసెంచరీతో...
నేటి మ్యాచ్
రాజస్థాన్ X గుజరాత్, వేదిక: జైపూర్-రా.7.30 గం.
అదరగొట్టిన నితీశ్ కుమార్
సన్‌రైజర్స్ ఉత్కంఠ విజయం
పోరాడిన పంజాబ్
ముల్లాపూర్ (చండీగఢ్): ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆఖరి బంతికి ఊపిరిపీల్చుకుంది. రైజర్స్ తరఫున తొలిసారి ఓ తెలుగు క్రికెటర్ అదరగొట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ నితీశ్ కుమార్ రెడ్డి (37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64) అర్ధసెంచరీతో సత్తా చూపగా, బౌలర్లు సైతం మెరుగ్గా రాణించారు. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను 2 పరుగులతో ఓడించింది. అయితే పంజాబ్‌కు ఆరు బంతుల్లో 29 పరుగులు కావాల్సిన వేళ శశాంక్ సింగ్ (25 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 46 నాటౌట్), అషుతోష్ శర్మ (15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 నాటౌట్) సిక్సర్లతో రైజర్స్‌కు వణుకు పుట్టించారు. కానీ జట్టు 26 పరుగులకే పరిమితం కావడంతో చేసేదేమీలేకపోయింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. సమద్ (25), హెడ్ (21) ఫర్వాలేదనిపించారు. అర్ష్‌దీ్‌పనకు 4.. హర్షల్, కర్రాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసి ఓడింది. భువనేశ్వర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నితీశ్ నిలిచాడు.
చివర్లో జోరు చూపినా..: ఈ పిచ్‌పై ఓ మాదిరి ఛేదనే అయినా పంజాబ్ బ్యాటర్ల ఆటతీరు భిన్నంగా సాగింది. ఆఖర్లో శశాంక్, అషుతోశ్ బ్యాట్లు ఝుళిపించినా నిరాశే మిగిలింది. పేసర్లు భువనేశ్వర్, కమిన్స్ పదునైన బంతులతో ఇబ్బందిపెట్టడమే కాకుండా తొలి నాలుగు ఓవర్లలోనే ఓపెనర్ బెయిర్‌స్టో (0), ప్రభ్‌సిమ్రన్ (4), కెప్టెన్ ధవన్ (14)లను పెవిలియన్‌కు చేర్చారు. దీంతో పవర్‌ప్లేలో జట్టు కేవలం 27 పరుగులతో నిలిచింది. ఏ జట్టుకైనా ఈ సీజన్‌లో ఇదే అత్యల్పం. ఇక నితీశ్ తొలి ఓవర్‌లోనే సికిందర్ రజా(28) రెండు ఫోర్లు, కర్రాన్ (29) ఓ ఫోర్‌తో 13 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కూడా కర్రాన్ భారీ సిక్సర్లతో జోరు చూపాడు. కానీ పదో ఓవర్‌లోనే అతడి దూకుడును నటరాజన్ ముగించాడు. కమిన్స్ సూపర్ క్యాచ్‌తో నాలుగో వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే రజాను ఉనాద్కట్ అవుట్ చేయడంతో 91/5 స్కోరుతో పంజాబ్ ఓటమి ఖాయమనిపించింది. అటు జితేశ్ (19) వేగంగా ఆడే యత్నంలో నితీశ్‌కు దొరికాడు. నితీశ్‌కు ఇది టీ20 కెరీర్‌లో తొలి వికెట్. ఈ దశలో 17వ ఓవర్‌లో శశాంక్ 3 ఫోర్లు, తర్వాతి ఓవర్‌లో అషుతోశ్ 2 ఫోర్లతో జోరు చూపారు. ఇక ఆఖరి ఓవర్‌లో 29 రన్స్ అవసరపడగా.. అషుతోశ్ 2 సిక్సర్లు బాది ఉత్కంఠ పెంచాడు. అయితే ఆఖరి బంతికి 9 రన్స్ కావాల్సిన వేళ శశాంక్ సిక్సర్ కొట్టినా ఫలితం లేకపోయింది.
నితీశ్ అండతో..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ను పంజాబ్ పేసర్లు ఆరంభంలోనే కట్టడి చేశారు. పేసర్లు అర్ష్‌దీప్, హర్షల్ ధాటికి వికెట్లు కోల్పోతున్న దశలో.. నాలుగో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ మాత్రం అదరగొట్టాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడి తొలి 18 బంతుల్లో 14 పరుగులే చేసినా.. చివరి 19 బంతుల్లో 50 పరుగులతో చెలరేగి జట్టు సవాల్ విసిరే స్కోరుకు దోహదపడ్డాడు. మొదట ట్రావిస్ హెడ్, మార్‌క్రమ్ (0), అభిషేక్ (16) 39 పరుగుల వద్దే పెవిలియన్‌కు చేరడంతో రైజర్స్‌కు షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే హెడ్ క్యాచ్ అవుటైనా పంజాబ్ రివ్యూ కోరలేదు. కానీ నాలుగో ఓవర్‌లో హెడ్, మార్‌క్రమ్ (0) వికెట్లను పేసర్ అర్ష్‌దీప్ పడగొట్టాడు. తర్వాతి ఓవర్‌లోనే అభిషేక్‌ను కర్రాన్ అవుట్ చేయడంతో పవర్‌ప్లేలో జట్టు 40/3 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో 140 పరుగులు కూడా కష్టమే అనిపించింది. అటు ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన రాహుల్ త్రిపాఠి (11) కూడా నిరాశపరిచాడు. 11వ ఓవర్‌లో నితీశ్ 4,6తో బ్యాట్‌కు పనిజెప్పాడు. రబాడ, కర్రాన్ ఓవర్లలోనూ తను ఒక్కో సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు. అయితే 14వ ఓవర్‌లో ప్రమాదకర క్లాసెన్ (9)ను హర్షల్ అవుట్ చేయడంతో పంజాబ్ సంబరాలు చేసుకుంది. కానీ నితీశ్ వారికి ఝలక్ ఇస్తూ గేరు మార్చాడు. 15వ ఓవర్‌లో వరుసగా 4,6,4,6తో 22 పరుగులు రాబట్టడమే కాకుండా తన టీ20 కెరీర్‌లోనే తొలి అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అటు అబ్దుల్ సమద్ కూడా వేగం కనబర్చడంతో పంజాబ్ బౌలర్లు లయ తప్పారు. కానీ అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అర్ష్‌దీప్ విడదీశాడు. 16వ ఓవర్‌లో ఇద్దరినీ అవుట్ చేయడంతో ఆరో వికెట్‌కు 20 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 19వ ఓవర్‌లో షాబాజ్ (14 నాటౌట్) 4,6తో 15 రన్స్ రాగా.. ఆఖరి ఓవర్‌లోనూ 11 పరుగులు రాబట్టడంతో స్కోరు 180 దాటగలిగింది.
విశాఖ కెరటం
నితీశ్ రెడ్డి స్వస్థలం విశాఖపట్నం. నితీశ్ 2020లో కేరళపై రంజీల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే ఆంధ్ర రంజీ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటివరకు 17 రంజీ మ్యాచుల్లో 566 పరుగులు, 52 వికెట్లు తీశాడు. నిరుడు ఐపీఎల్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేసిన 20 ఏళ్ల నితీశ్‌కు రెండే మ్యాచ్‌ల్లో చాన్స్ దక్కింది. ఈ రెండింట్లోనూ బౌలింగ్ తప్ప, బ్యాటింగ్ చేసే చాన్స్ దక్కలేదు. ఇక ఈ ఐపీఎల్‌లో గతవారం హైదరాబాద్ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చి 8 బంతు ల్లో 14 (నాటౌట్) పరుగులు సాధించాడు. ఇక, పంజాబ్‌తో మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటూ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. నితీశ్ బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ ఆంధ్ర జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. బ్యాటర్‌గా కెరీర్ మొదలు పెట్టిన నితీశ్ అనంతరం పేస్ బౌలింగ్‌లోనూ ప్రావీణ్యం సంపాదించాడు. హార్దిక్ పాండ్యా, బెన్ స్టోక్స్‌ను అభిమానించే నితీశ్, ఐపీఎల్‌లో సత్తా చాటితే భవిష్యత్‌లో టీమిండియా తలుపు తట్టే అవకాశాలున్నాయి.
స్కోరుబోర్డు
హైదరాబాద్: హెడ్ (సి) ధవన్ (బి) అర్ష్‌దీప్ 21, అభిషేక్ (సి) శశాంక్ (బి) కర్రాన్ 16, మార్‌క్రమ్ (సి) జితేశ్ (బి) అర్ష్‌దీప్ 0, నితీశ్ కుమార్ రెడ్డి (సి) రబాడ (బి) అర్ష్‌దీప్ 64, త్రిపాఠి (సి) జితేశ్ (బి) హర్షల్ 11, క్లాసెన్ (సి) కర్రాన్ (బి) హర్షల్ 9, సమద్ (సి) హర్షల్ (బి) అర్ష్‌దీప్ 25, షాబాజ్ (నాటౌట్) 14, కమిన్స్ (బి) రబాడ 3, భువనేశ్వర్ (సి) బెయిర్‌స్టో (బి) కర్రాన్ 6, ఉనాద్కట్ (నాటౌట్) 6, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 182/9; వికెట్ల పతనం: 1-27, 2-27, 3-39, 4-64, 5-100, 6-150, 7-151, 8-155, 9-176; బౌలింగ్: రబాడ 4-0-32-1, అర్ష్‌దీప్ సింగ్ 4-0-29-4, కర్రాన్ 4-0-41-2, హర్షల్ పటేల్ 4-0-30-2, హర్‌ప్రీత్ బ్రార్ 4-0-48-0.
పంజాబ్: ధవన్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) భువనేశ్వర్ 14, బెయిర్‌స్టో (బి) కమిన్స్ 0, ప్రభ్‌సిమ్రన్ (సి) నితీశ్ (బి) భువనేశ్వర్ 4, కర్రాన్ (సి) కమిన్స్ (బి) నటరాజన్ 29, సికందర్ (సి) క్లాసెన్ (బి) ఉనాద్కట్ 28, శశాంక్ (నాటౌట్) 46, జితేశ్ (సి) అభిషేక్ (బి) నితీశ్ 19, అశుతోష్ (నాటౌట్) 33, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 180/6; వికెట్ల పతనం: 1-2, 2-11, 3-20, 4-58, 5-91, 6-114; బౌలింగ్: భువనేశ్వర్ 4-1-32-2, కమిన్స్ 4-0-22-1, నటరాజన్ 4-0-33-1, నితీశ్ కుమార్ రెడ్డి 3-0-33-1, ఉనాద్కట్ 4-0-49-1, షాబాజ్ 1-0-10-0.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
రాజస్థాన్ 4 4 0 0 8 1.120
కోల్‌కతా 4 3 1 0 6 1.528
లఖ్‌నవూ 4 3 1 0 6 0.775
చెన్నై 5 3 2 0 6 0.666
హైదరాబాద్ 5 3 2 0 6 0.344
పంజాబ్ 5 2 3 0 4 -0.196
గుజరాత్ 5 2 3 0 4 -0.797
ముంబై 4 1 3 0 2 -0.704
బెంగళూరు 5 1 4 0 2 -0.843
ఢిల్లీ 5 1 4 0 2 -1.370
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
Updated Date - Apr 10 , 2024 | 01:30 AM