తొలి రోజు.. తేలిపోయారు!
ABN, Publish Date - Dec 07 , 2024 | 06:14 AM
గులాబీ టెస్టును టీమిండియా పేలవంగా ఆరంభించింది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (6/48) స్వింగ్ బౌలింగ్ ధాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ కనీసం 200 పరుగులు కూడా చేయలేకపోయింది. కనీసం బౌలర్లయినా
భారత్ మొదటి ఇన్నింగ్స్ 180 ఆలౌట్
ఆకట్టుకున్న నితీశ్ స్టార్క్‌కు ఆరు వికెట్లు
ఆస్ట్రేలియా 86/1 పింక్‌బాల్ టెస్టు
అడిలైడ్: గులాబీ టెస్టును టీమిండియా పేలవంగా ఆరంభించింది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (6/48) స్వింగ్ బౌలింగ్ ధాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ కనీసం 200 పరుగులు కూడా చేయలేకపోయింది. కనీసం బౌలర్లయినా ప్రత్యర్థిని ఇబ్బందిపెడతారనుకుంటే.. వారూ తేలిపోయారు. ఫలితంగా మొదటి రోజు అన్ని విభాగాల్లోనూ ఆతిథ్య ఆస్ట్రేలియానే ఆధిపత్యం చూపింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే కుప్పకూలింది. చివర్లో నితీశ్ కుమార్ (42) మెరుపు బ్యాటింగ్ కారణంగా ఆ మాత్రం స్కోరైనా నమోదయ్యింది. భారత్ ఇన్నింగ్స్‌లో నితీశ్‌దే టాప్ స్కోర్ కావడం విశేషం. రాహుల్ (37), గిల్ (31) ఫర్వాలేదనిపించారు. పేసర్లు కమిన్స్, బోలాండ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ మెక్‌స్వీనే (38 బ్యాటింగ్), లబుషేన్ (20 బ్యాటింగ్) ఉన్నారు. ఏకైక వికెట్ బుమ్రాకు దక్కింది. శనివారం తొలి సెషన్‌లో వీలైనంత త్వరగా వికెట్లు తీయగలిగితేనే ఆసీ్‌సను ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంటుంది.
తొలి బంతికే వికెట్: టాస్ గెలిచిన భారత్ వెంటనే బ్యాటింగ్ ఎంచుకుంది. వాస్తవానికి పింక్ బాల్ టెస్టులో తొలి రెండు రోజులు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంటుంది. కానీ భారత బ్యాటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. అటు ఆసీస్ పేసర్లు మాత్రం కొత్త బంతితో చెలరేగారు. ముఖ్యంగా గులాబీ టెస్టంటే రెచ్చిపోయే స్టార్క్ ఈసారి కూడా బెదరగొట్టాడు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ అతడు సాగించిన విధ్వంసానికి భారత బ్యాటర్లు చకచకా పెవిలియన్ బాట పట్టారు. మ్యాచ్ తొలి బంతికే జైస్వాల్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన గిల్ అదే ఓవర్‌లో రెండు ఫోర్లతో జట్టు పరుగుల ఖాతాను తెరిచాడు. అటు మరో ఓపెనర్ రాహుల్ ఓపిగ్గా క్రీజులో నిలిచే ప్రయత్నం చేశాడు. అయితే అతను బోలాండ్ ఓవర్‌లో డకౌట్ అయినప్పటికీ నోబ్ వేయడంతో బతికిపోయాడు. అదే ఓవర్‌లో అతను ఖవాజాకు క్యాచ్ ఇచ్చినా పట్టలేకపోయాడు. తానెదుర్కొన్న 20వ బంతికి రాహుల్ తొలి పరుగు సాధించాడు. కమిన్స్ ఓవర్‌లో అతను రెండు వరుస ఫోర్లతో టచ్‌లోకి వచ్చాడు. గిల్ కూడా నిలకడను కనబర్చడంతో ఇద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కానీ టీవిరామానికి నాలుగు ఓవర్ల ముందు భారత్ తడబడింది. స్టార్క్ విజృంభించి వరుస ఓవర్లలో రాహుల్, విరాట్ కోహ్లీ (7) వికెట్లు తీయగా.. గిల్‌ను బోలాండ్ అవుట్ చేయడంతో జట్టు 69/1 నుంచి 81/4కి చేరింది. రెండో సెషన్‌లోనూ కథ మారలేదు. ఆరోనెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ (3)ను ఆరంభంలోనే బోలాండ్ ఎల్బీగా అవుట్ చేశాడు. పంత్ (21) కూడా ఎక్కువసేపు నిలవలేదు.
నితీశ్ మరోసారి..: తొలి టెస్టు మాదిరే ఆంధ్ర క్రికెటర్ నితీశ్ మరోసారి ఆకట్టుకున్నాడు. అటు అశ్విన్ (22) బంతికో పరుగు చొప్పున సాధిస్తూ అతడిపై ఒత్తిడి తగ్గించాడు. ఈ దశలో స్టార్క్ మళ్లీ దెబ్బతీస్తూ 39వ ఓవర్‌లో ఇన్‌స్వింగ్ యార్కర్లతో అశ్విన్, హర్షిత్ (0) వికెట్లు తీశాడు. అప్పటికే 8 వికెట్లు కోల్పోవడంతో బుమ్రా (0)ను అండగా చేసుకుని నితీశ్ ఎదురుదాడికి దిగాడు. స్టార్క్ ఓవర్‌లో సిక్సర్ బాదిన తను.. మరుసటి ఓవర్‌లో 6,4,6తో బోలాండ్‌కు షాకిచ్చాడు. ఈ ఓవర్‌లో స్లిప్ వైపు రివర్స్ స్కూప్‌లో సాధించిన సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. కాసేపటికే వరుస ఓవర్లలో ఈ జోడీ వెనుదిరిగారు.
బ్యాటింగ్‌లోనూ జోరు: సహజంగానైతే డే/నైట్ టెస్టు మూడో సెషన్‌లో పేసర్లు పండగ చేసుకుంటారు. కానీ ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనూ ఆసీస్ బ్యాటర్లను భారత బౌలర్లు ఇబ్బందిపెట్టలేకపోయారు. ఈ సెషన్ మొత్తంలో తీసింది ఒక్క వికెటే కావడం గమనార్హం. బుమ్రా ఖవాజా (13)ను అవుట్ చేశాడు. కెరీర్‌లో రెండో టెస్టు ఆడుతున్న ఓపెనర్ మెక్‌స్వీనే పట్టుదలగా క్రీజులో నిలిచాడు. అటు లబుషేన్ తన సహజశైలితో భారత బౌలర్లను విసిగించాడు. పిచ్ స్పిన్‌కు సహకరించకపోవడంతో అశ్విన్ కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు.
మొరాయించిన ఫ్లడ్‌లైట్లు
ఈ మ్యాచ్‌లో ఫ్లడ్‌లైట్ల కారణంగా ఒకే ఓవర్లో రెండుసార్లు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఆసీస్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో మూడో బంతికి, ఐదో బంతికి ముందు ఇలా లైట్లు ఆఫ్ కావడంతో పేసర్ హర్షిత్ రాణా అసహనంగా కనిపించాడు. అయితే అటు ప్రేక్షకులు మాత్రం సరదాగా తమ మొబైల్ ఫోన్లలో టార్చిలైట్స్‌ను ఆన్ చేయడం కనిపించింది.
టెస్టుల్లో తొలి బంతికే అవుటైన ఏడో భారత బ్యాటర్‌గా జైస్వాల్. 1974లో గవాస్కర్ తొలిసారి ఇలా డకౌటయ్యాడు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీ) స్టార్క్ 0; రాహుల్ (సి) మెక్‌స్వీనే (బి) స్టార్క్ 37; గిల్ (ఎల్బీ) బోలాండ్ 31; విరాట్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 7; పంత్ (సి) లబుషేన్ (బి) కమిన్స్ 21; రోహిత్ (ఎల్బీ) బోలాండ్ 3; నితీశ్ (సి) హెడ్ (బి) స్టార్క్ 42; అశ్విన్ (ఎల్బీ) స్టార్క్ 22; హర్షిత్ (బి) స్టార్క్ 0; బుమ్రా (సి) ఖవాజా (బి) కమిన్స్ 0; సిరాజ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 44.1 ఓవర్లలో 180 ఆలౌట్; వికెట్ల పతనం: 1-0, 2-69, 3-77, 4-81, 5-87, 6-109, 7-141, 8-141, 9-176, 10-180; బౌలింగ్: స్టార్క్ 14.1-2-48-6; కమిన్స్ 12-4-41-2; బోలాండ్ 13-0-54-2; లియోన్ 1-0-6-0; మార్ష్ 4-0-26-0.
ఆస్ర్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖవాజా (సి) రోహిత్ (బి) బుమ్రా 13; మెక్‌స్వీనే (బ్యాటింగ్) 38; లబుషేన్ (బ్యాటింగ్) 20; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 33 ఓవర్లలో 86/1; వికెట్ పతనం: 1-24; బౌలింగ్: బుమ్రా 11-4-13-1; సిరాజ్ 10-3-29-0; రాణా 8-2-18-0; నితీశ్ 3-1-12-0; అశ్విన్ 1-1-0-0.
నల్ల బ్యాడ్జీలతో బరిలోకి..
గులాబీ టెస్టులో ఆసీస్ ఆటగాళ్లు తమ భుజాలకు నల్ల బ్యాడ్జీలను ధరించి బరిలోకి దిగారు. ఈనెల ఒకటిన మృతి చెందిన మాజీ ఆటగాడు ఇయాన్ రెడ్‌పాత్‌కు సంతాపాన్ని తెలియజేయడంతో పాటు క్రికెటర్ ఫిల్ హ్యూజ్ మరణించి పదేళ్లయిన సందర్భంగా అతడికి ఈ విధంగా నివాళులర్పించారు.
టెస్టుల్లో మొదటి బంతికే ఎక్కువసార్లు (3) వికెట్ తీసిన బౌలర్‌గా పెడ్రో కొలిన్స్‌తో సమంగా నిలిచిన స్టార్క్.
కెరీర్‌లో ఉత్తమ గణాంకాలు (6/48) నమోదు చేసిన స్టార్క్‌కు భారత్‌పై 5+ వికెట్లు తీయడం ఇదే తొలిసారి. అలాగే గులాబీ టెస్టుల్లో అత్యధికంగా నాలుగుసార్లు ఈ ఫీట్ సాధించిన బౌలర్‌గా నిలిచాడు.
ఈ క్యాలెండర్ ఏడాదిలో 50 టెస్టు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బుమ్రా.
Updated Date - Dec 07 , 2024 | 06:14 AM