మ్యాచ్‌ను తిప్పేశారు
ABN, Publish Date - Nov 03 , 2024 | 01:43 AM
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీ్‌సలో మొదటిసారి భారత జట్టు ఆధిపత్యం కనబరచింది. తొలి రోజు చివర్లో బ్యాటర్లు తడబాటుకు గురైనా.. శనివారం మాత్రం సూపర్ బ్యాటింగ్, బౌలింగ్‌తో టెస్టును మనవైపు తిప్పేశారు. ముందుగా భారత్‌కు...
భారత్ తొలి ఇన్నింగ్స్ 263
ఆదుకున్న గిల్, పంత్
కివీస్ రెండో ఇన్నింగ్స్ 171/9
జడేజాకు నాలుగు, అశ్విన్‌కు మూడు వికెట్లు
రెండు రోజుల్లోనే ఎన్ని మలుపులో.. శుక్రవారం ఆట ముగిసేసరికి భారత్‌కు మరో ఓటమి తప్పదా? అనిపించింది. కానీ మర్నాడే అన్ని విభాగాల్లో రాణించి ఏకంగా గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తోంది. పిచ్ ఎలాంటిదైనా డోంట్ కేర్ అనే తరహాలో రెచ్చిపోయిన రిషభ్ పంత్ జట్టు స్కోరును రాకెట్ వేగంతో పెంచగా.. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ క్లాసిక్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వీరి దెబ్బకు టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడం విశేషం. ఆ తర్వాత స్పిన్నర్ జడేజా మరోసారి ప్రతాపం చూపగా, అశ్విన్ సహకరించడంతో కివీస్ విలవిల్లాడింది. కేవలం 143 రన్స్ ఆధిక్యంలో ఉన్న ప్రత్యర్థి చేతిలో మరో వికెట్ మాత్రమే ఉంది. దీంతో మూడో టెస్టు కూడా మూడు రోజుల్లోనే ముగియడం ఖాయమనిపిస్తోంది.
ముంబై: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీ్‌సలో మొదటిసారి భారత జట్టు ఆధిపత్యం కనబరచింది. తొలి రోజు చివర్లో బ్యాటర్లు తడబాటుకు గురైనా.. శనివారం మాత్రం సూపర్ బ్యాటింగ్, బౌలింగ్‌తో టెస్టును మనవైపు తిప్పేశారు. ముందుగా భారత్‌కు 28 పరుగుల స్వల్ప ఆధిక్యమైనా దక్కిందంటే శుభ్‌మన్ గిల్ (90), రిషభ్ పంత్ (59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 60)ల ఆటతీరే కారణం. వీరి కీలక ఆటతీరుతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 59.4 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. చివర్లో వాషింగ్టన్ సుందర్ (36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 నాటౌట్) ఆకట్టుకున్నాడు. స్పిన్నర్ ఎజాజ్‌కు 5 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కివీ్‌సను స్పిన్నర్లు జడేజా (4/52), అశ్విన్ (3/63) దెబ్బతీశారు. దీంతో రెండోరోజు ఆట ముగిసేసరికి పర్యాటక జట్టు 43.3 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులే చేయగలిగింది. విల్ యంగ్ (51) అర్ధసెంచరీ చేశాడు. క్రీజులో ఎజాజ్ (7) ఉన్నాడు. ప్రస్తుతం కివీస్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. బంతి చక్కగా టర్న్ అవుతున్నందున కివీస్‌ను తొలి సెషన్‌లో వీలైనంత త్వరగా ఆలౌట్ చేయాలి. లక్ష్యం 200లోపే ఉండడం భారత్‌కు శ్రేయస్కరం. ఓవరాల్‌గా శనివారం 15 వికెట్లు నేలకూలాయి.
అటు దూకుడు.. ఇటు నిలకడ: ఓవర్‌నైట్ స్కోరు 86/4తో పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టు.. భారమంతా గిల్, పంత్‌పై వేస్తూ రెండో రోజును ఆరంభించింది. మరో రెండు వికెట్లు కోల్పోతే మ్యాచ్ పూర్తిగా ప్రత్యర్థి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉండేది. అయితే సీనియర్లకు బ్యాటింగ్ కష్టమైన టర్నింగ్ పిచ్‌పై గిల్, పంత్ జోడీ చెలరేగింది. ముఖ్యంగా పంత్ చావోరేవో అన్నట్టుగా బ్యాట్ ఝళిపించాడు. భారీషాట్లతో కివీస్ బౌలర్లను డిఫెన్స్‌లో పడేశాడు. రోహిత్, విరాట్ సైతం దూకుడుగా ఆడేందుకు ఇబ్బందిపడినా పంత్ మాత్రం సహజశైలిలో ఎదురుదాడికి దిగాడు. తొలి రెండు బంతులను బౌండరీలకు తరలించి తన ఉద్దేశాన్ని చాటాడు. బంతి టర్న్ కావడంతో పాటు ఒక్కోసారి అనూహ్యంగా బౌన్స్ అవుతున్నా తగ్గేదేలే.. అనే రీతిలో 8 ఫోర్లతో పాటు రెండు సిక్సర్లు బాదాడు. దీంతో పంత్ 36 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో గిల్ సాధికారిక ఆటతీరు కూడా పంత్ వేగంగా ఆడేందుకు తోడ్పడింది. ఐదు వికెట్లతో దెబ్బతీసిన ఎజాజ్‌ను సైతం అతను వదల్లేదు. లంచ్‌కు కాస్త ముందు ఐదో వికెట్‌కు గిల్‌తో కలిసి 96 పరుగులు జోడించాక స్పిన్నర్ సోధి ఓవర్‌లో పంత్ వెనుదిరిగాడు. రెండో సెషన్‌లో భారత్ వేగంగా వికెట్లను కోల్పోయింది. వరుస ఓవర్లలో జడేజా (14), సర్ఫరాజ్ (0) పెవిలియన్‌కు చేరగా.. సెంచరీకి చేరువలో గిల్ ఎనిమిదో వికెట్‌గా అవుటయ్యాడు. ఈ స్థితిలో సుందర్ కివీస్ స్కోరును సమం చేయడంతో పాటు సోధి ఓవర్‌లో 4,6తో జట్టుకు ఆధిక్యాన్ని కూడా అందించాడు. అయితే 60వ ఓవర్‌లో ఆకాశ్‌దీప్ (0) రనౌట్ కావడంతో భారత్ 83 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లను కోల్పోయింది.
దెబ్బతీసిన స్పిన్ జోడీ: భారత స్పిన్నర్లు జడేజా, అశ్విన్ కలిసికట్టుగా కివీ్‌సను కట్టడి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన జడేజా కివీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ మెరవగా, అశ్విన్ ఈసారి మూడు వికెట్లతో ఖాతా తెరిచాడు. మొత్తంగా ఈ ఇద్దరూ కలిసి ఏడు వికెట్లు తీశారు. మరోవైపు తొలి ఓవర్‌లోనే పేసర్ ఆకాశ్ అద్భుత ఇన్‌స్వింగర్‌తో ఓపెనర్ లాథమ్ (1)ను బౌల్డ్ చేశాడు. కాన్వే (22) కుదురుకున్నట్టు కనిపించినా సుందర్ చేతికి చిక్కాడు. ఆ వెంటనే రచిన్ రవీంద్ర (4)ను అశ్విన్ అవుట్ చేసి ఈ టెస్టులో తొలి వికెట్ సాధించాడు. ఈ దశలో కివీ్‌సను యంగ్, మిచెల్ (21) కాసేపు ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించాక మిచెల్‌ను అవుట్ చేసిన జడేజా తిరిగి తన మ్యాజిక్‌ను ప్రదర్శించాడు. బ్లండెల్ (4), సోధి (8), హెన్రీ (10)లను అవుట్ చేసి కివీ్‌సను వణికించాడు. అటు కీలక ఇన్నింగ్స్ ఆడిన యంగ్ ఎనిమిదో వికెట్‌గా అశ్విన్ ఓవర్‌లో వెనుదిరిగాడు. ఉన్న కాసేపు ఫిలిప్స్ (14 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 26) వేగంగా ఆడాడు.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 235.
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఎజాజ్ 30; రోహిత్ (సి) లాథమ్ (బి) హెన్రీ 18; గిల్ (సి) మిచెల్ (బి) ఎజాజ్ 90; సిరాజ్ (ఎల్బీ) ఎజాజ్ 0; విరాట్ (రనౌట్) 4; పంత్ (ఎల్బీ) సోధీ 60; జడేజా (సి) మిచెల్ (బి) ఫిలిప్స్ 14; సర్ఫరాజ్ (సి) బ్లండెల్ (బి) ఎజాజ్ 0; సుందర్ (నాటౌట్) 38; అశ్విన్ (సి) మిచెల్ (బి) ఎజాజ్ 6; ఆకాశ్ దీప్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 59.4 ఓవర్లలో 263 ఆలౌట్; వికెట్ల పతనం: 1-25, 2-78, 3-78, 4-84, 5-180, 6-203, 7-204, 8-227, 9-247, 10-263. బౌలింగ్: హెన్రీ 8-1-26-1; ఓరోక్ 2-1-5-0; ఎజాజ్ 21.4-3-103-5; ఫిలిప్స్ 20-0-84-1; రచిన్ 1-0-8-0; సోధీ 7-0-36-1.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (బి) ఆకాశ్ 1; కాన్వే (సి) గిల్ (బి) సుందర్ 22; యంగ్ (సి అండ్ బి) అశ్విన్ 51; రచిన్ (స్టంప్) పంత్ (బి) అశ్విన్ 4; మిచెల్ (సి) అశ్విన్ (బి) జడేజా 21; బ్లండెల్ (బి) జడేజా 4; ఫిలిప్స్ (బి) అశ్విన్ 26; సోధి (సి) కోహ్లీ (బి) జడేజా 8; హెన్రీ (బి) జడేజా 10; ఎజాజ్ (బ్యాటింగ్) 7; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 43.3 ఓవర్లలో 171/9; వికెట్ల పతనం: 1-2, 2-39, 3-44, 4-94, 5-100, 6-131, 7-148, 8-150, 9-171; బౌలింగ్: ఆకాశ్ 5-0-10-1; సుందర్ 10-0-30-1; అశ్విన్ 16-0-63-3; జడేజా 12.3-2-52-4.
2
వాంఖడేలో ఎక్కువ వికెట్లు (19) తీసిన రెండో పర్యాటక జట్టు బౌలర్ ఎజాజ్ పటేల్. ఇయాన్ బోథమ్ (22) ముందున్నాడు.
3
తాజా డబ్ల్యూటీసీలో ఎక్కువ వికెట్లు (50) తీసిన మూడో బౌలర్‌గా జడేజా. ఓవరాల్‌గా అశ్విన్ (62), హాజెల్‌వుడ్ (51) టాప్-2లో ఉన్నారు.
Updated Date - Nov 03 , 2024 | 01:43 AM