ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వెలోడ్రోమ్‌ వెలవెల

ABN, Publish Date - Nov 20 , 2024 | 02:46 AM

ఒకప్పుడు దక్షిణ భారతదేశానికే సైక్లింగ్‌ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లోని సైక్లింగ్‌ వెలోడ్రోమ్‌ ఇప్పుడు అధ్వాన్నంగా తయారైంది. జాతీయ క్రీడల కోసం రెండు దశాబ్దాల కిందట...

రెండు దశాబ్దాలుగా కనీస మరమ్మతులు లేవు

పాడైన వాటర్‌ పైప్‌లైన్‌, డ్రైనేజీ వ్యవస్థ

బహిరంగ ప్రాక్టీసుకు పలు అవాంతరాలు

బాలికలకు హాస్టల్‌ వసతి కరువు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఒకప్పుడు దక్షిణ భారతదేశానికే సైక్లింగ్‌ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లోని సైక్లింగ్‌ వెలోడ్రోమ్‌ ఇప్పుడు అధ్వాన్నంగా తయారైంది. జాతీయ క్రీడల కోసం రెండు దశాబ్దాల కిందట అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో అత్యాధునిక సదుపాయాలతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ వెలోడ్రోమ్‌ను నిర్మించారు. పదెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కాంక్రీట్‌ ట్రాక్‌ను తర్వాత వచ్చిన పాలకులు ఆధునీకరించకుండా వదిలేయడంతో కళావిహీనంగా మారింది. ఇరవై ఏళ్లుగా ఎలాంటి మరమ్మతులకు నోచుకోకపోగా కనీసం రంగులు కూడా వేయలేని దుస్థితి. ఇంతకుముందు దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఇండోనేసియా, శ్రీలంక, మాల్దీవుల నుంచి సైక్లిస్టులు వచ్చి ఇక్కడ సాధన చేసేవారు. గత పాలకుల నిర్లక్ష్యం, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్‌) అధికార యంత్రాంగం ఉదాసీన వైఖరితో సైక్లింగ్‌ వెలోడ్రోమ్‌ ప్రమాణాలు రానురానూ దిగజారి దీనస్థితికి చేరుకుంది.


బాలికలకు అకాడమీ ఏదీ ?

సైక్లింగ్‌ వెలోడ్రోమ్‌లో సైక్లింగ్‌, రెజ్లింగ్‌ అకాడమీలను ‘శాట్‌’ నిర్వహిస్తోంది. ఈ రెండు విభాగాల్లో కలిపి 50 మంది క్రీడాకారులకు ఉచిత శిక్షణ, భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీటితో పాటు యోగా, రోలర్‌ స్కేటింగ్‌, కరాటేలో మరో 150 క్రీడాకారులు ఇక్కడ రోజువారీ శిక్షణ తీసుకుంటున్నారు. వీరందరికీ కలిపి ఉన్నది ఐదుగురు కోచ్‌లే. అకాడమీ, హాస్టల్‌ వసతి బాలురకు మాత్రమే ఉండడంతో హైదరాబాదేతర ప్రాంతాలకు చెందిన బాలికలకు సైక్లింగ్‌లో శిక్షణ తీసుకునే అవకాశం లేకుండా పోయింది.


కనీస నిర్వహణ కరవు..

మరుగుదొడ్లు, వాటర్‌ పైప్‌లైన్‌, డ్రైనేజీ వ్యవస్థ ఇరవై ఏళ్ల నాటిది కావడంతో క్రీడాకారులు ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్న వర్షానికి కూడా భూగర్భ ప్రవేశ ద్వారం మార్గంలో నీళ్లు నిలిచిపోతుండడంతో మోటార్లతో వాటిని తోడాల్సిన దుస్థితి నెలకొంది. అవుట్‌డోర్‌ ట్రాక్‌ కావడంతో వర్షాకాలం వానల వల్ల, సాధారణ రోజుల్లో పావురాల వల్ల క్రీడాకారుల ప్రాక్టీసుకు అంతరాయం కలుగుతోంది. ప్రధానంగా గ్యాలరీలో పావురాల విసర్జకాలు, ఈకలతో ఇక్కడి కుర్చీలు మొత్తం పాడవుతున్నాయి. వీటితో పాటు పరిపాలక భవనం, హాస్టల్‌ గదుల కిటికీల అద్దాలు కూడా చాలా వరకు ధ్వంసమయ్యాయి. తద్వారా భద్రతాపరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


ఆధునీకరణ పనులు చేపట్టాలి..

ఒకప్పుడు సైక్లింగ్‌ వెలోడ్రోమ్‌లు పూర్తిగా అవుట్‌డోర్‌లోనే ఉండేవి. రెండు దశాబ్దాల్లో వచ్చిన మార్పులతో ఒలింపిక్స్‌, వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప పోటీలను ఇప్పుడు పూర్తిగా ఇండోర్‌లో ఎయిర్‌ కండీషన్‌ శీతల వాతావరణంలో చెక్క (ఉడెన్‌) ట్రాక్‌పై నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఇప్పుడున్న వెలోడ్రోమ్‌ల చుట్టుకొలత 250 మీటర్లు ఉంది. మన దేశంలో ఈ రకమైన ప్రమాణాలతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో మాత్రమే సైక్లింగ్‌ వెలోడ్రోమ్‌ ఉంది. హైదరాబాద్‌లోని ప్రస్తుతం సైక్లింగ్‌ వెలోడ్రోమ్‌ 333 మీటర్ల చుట్టు కొలత గల కాంక్రీట్‌ ట్రాక్‌. దీనిని అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు ఆధునీకరించినా లేదా అదే స్థానంలో కొత్త వెలోడ్రోమ్‌ నిర్మించినా రాష్ట్ర సైక్లిస్టులు ఒలింపిక్స్‌ పతకాల లక్ష్యంతో సాధన చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికైనా శాట్‌ అధికారులు వెలోడ్రోమ్‌ ఆధునీకరణపై దృష్టి పెట్టాలని సైక్లిస్టులు కోరుతున్నారు.

Updated Date - Nov 20 , 2024 | 02:46 AM