వినేశ్ వండర్
ABN, Publish Date - Aug 07 , 2024 | 04:07 AM
ఏం గెలుస్తుందిలే.. అని తేలిగ్గా తీసుకొన్న రెజ్లర్ వినేశ్ ఫొగట్ పెను సంచలనం సృష్టించింది. ఓటమి ఎరుగని డిఫెండింగ్ చాంప్ యుయి సుసాకికి ఓటమి రుచిచూపింది. క్వార్టర్స్‌లో ఓక్సానా లివాచ్ (ఉక్రెయిన్)పై నెగ్గిన ఫొగట్.. సెమీస్‌లో యుస్నేలిస్ గుజ్‌మన్‌ను ఓడించింది.
పసిడి పోరుకు ఫొగట్
ఆనందం వెల్లివిరిసింది.. ఉడుంపట్టు పట్టిన రెజ్లర్ వినేశ్ ఫొగట్.. అంచనాలను తారుమారు చేస్తూ ఏకంగా స్వర్ణ పోరుకు దూసుకెళ్లింది. ఏడాదికిపైగా వివాదాలు.. విమర్శలు.. అనుమానాలు.. అవమానాలకు ఎదురు నిలిచిన వినేశ్.. పోటీల ఆరంభంలోనే అద్భుతం చేసింది. తొలి రౌండ్‌లోనే నమ్మశక్యం కాని రీతితో.. ప్రపంచ మేటి రెజ్లర్ సుసాకికి తొలి ఓటమి రుచి చూపించిన ఫొగట్.. ఒక్కసారిగా ఫేవరెట్‌గా మారిపోయింది. అలవోకగా సెమీస్ చేరి.. స్వర్ణ చరిత్రకు అడుగు దూరంలో నిలిచింది. నైరాశ్యం ఆవహించిన భారత అభిమానుల్లో.. జోష్ నింపింది.
ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర
నేడే ఫైనల్ (రాత్రి11.20)
ఓటమి ఎరుగని సుసాకికి షాక్
రజతం ఖాయం
పారిస్: ఏం గెలుస్తుందిలే.. అని తేలిగ్గా తీసుకొన్న రెజ్లర్ వినేశ్ ఫొగట్ (Vinesh Phogat) పెను సంచలనం సృష్టించింది. ఓటమి ఎరుగని డిఫెండింగ్ చాంప్ యుయి సుసాకికి ఓటమి రుచిచూపింది. క్వార్టర్స్‌లో ఓక్సానా లివాచ్ (ఉక్రెయిన్)పై నెగ్గిన ఫొగట్.. సెమీస్‌లో యుస్నేలిస్ గుజ్‌మన్ (క్యూబా)ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో దేశానికి రజత పతకాన్ని ఖాయం చేసిన వినేశ్.. పసిడి పోరుకు చేరుకొన్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. బుధవారం రాత్రి జరిగే ఫైనల్లో అమెరికా రెజ్లర్ సారా హిల్డ్‌బ్రాంట్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సాధారణంగా తాను తలపడే 53 కిలోల విభాగంలో మరొకరికి బెర్త్ ఖరారు కావడంతో.. తక్కువ వెయిట్ కేటగిరీలో బరిలోకి దిగడానికి తన బరువు తగ్గించుకొంది. ట్రయల్స్‌లో ఎలాగోలా అవకాశం దక్కించుకొన్న ఫొగట్.. ఒక్క ఉడుంపట్టుతో యావత్ దేశం దృష్టినీ తనవైపు నకు తిప్పుకొంది.
ఆడలేదు.. వేటాడింది..
50 కిలోల విభాగంలో తొలి రౌండ్‌లో ఫొగట్ ప్రత్యర్థి జపాన్ టాప్ రెజ్లర్ సుసాకి అని డ్రా ఖరారు కావడంతో అందరూ ఆశలు వదిలేసుకొన్నారు. ఎందుకంటే అంతర్జాతీయ కెరీర్‌లో ఆడిన 82 మ్యాచ్‌లో సుసాకి ఒక్క బౌట్ కూడా ఓడలేదు. పైగా టోక్యోలో గోల్డ్‌తోపాటు నాలుగుసార్లు వరల్డ్ చాంపియన్ కావడంతో ఫొగట్ పని ఇక అంతే అని పెదవి విరిచారు. బలమైన ప్రత్యర్థిని వ్యూహాత్మకంగా ఎలా దెబ్బకొట్టాలో ముందుగానే సిద్ధమైన వినేశ్.. మ్యాట్‌పై దాన్ని ఆచరణలో పెట్టి అద్భు తం చేసింది. మంగళవారం జరిగిన రౌండ్- 16లో ఫొగట్ 3-2 సుసాకిపై చిరస్మరణీయ విజయంతో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. బౌట్‌లో 90 సెకన్లు ఇద్దరు రెజ్లర్లు ఒకరిని ఒకరు అంచనా వేసుకోవడానికే కేటాయించారు. వినేష్ రక్షణాత్మకంగా వ్యహరించడంతో తొలి పాయింట్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా ఫొగట్, సుసాకి అదను కోసం వేచి చూసే ధోరణినే అవలంబించారు. ఈక్రమంలో మరో పాయింట్ కోల్పోయిన ఫొగట్ 0-2తో వెనుకబడింది. కానీ, పటిష్టమైన డిఫెన్స్‌తో సుసాకి పాయింట్లు ఇవ్వకుండా ఎంతో చతురతతో వ్యవహరించింది. ఈ క్రమంలో పోటీ ముగియడానికి మరో 15 సెకన్ల సమయం ఉందనగా.. అప్పటి వరకు దూరదూరంగా ఉంటూ ప్రత్యర్థిని మభ్యపెట్టిన వినేశ్.. ఒక్కసారిగా సుసాకిపై ఎదురుదాడి చేసింది. పట్టుకోల్పోయిన జపాన్ రెజ్లర్‌ను మ్యాట్‌పై పడేసి రెండు పాయింట్లు స్కోరు చేసింది. హఠాత్ పరిణామంతో సుసాకి నివ్వెరపోయి చూస్తుండగా.. ఫొగట్ సంబరాల్లో మునిగింది. జపాన్ రెజ్లర్ చాలెంజ్ చేసినా.. ఆమెకు నిరాశే ఎదురైంది. ఇక, క్వార్టర్స్‌లో ఓక్సానాపై వినేశ్ 7-5తో గెలిచింది. తొలుత ఫొగట్ 4-0తో ఆధిక్యం సాధించింది. కానీ, పోరాడిన ఓక్సానా.. వినేశ్‌ను తన పట్టులో బిగిస్తూ 4 పాయింట్లు స్కోరు చేసింది. చివరి 48 సెకన్లలో ఓక్సానాను టేక్‌డౌన్ చేసిన ఫొగట్ బౌట్‌ను ముగించింది.
అంతా ఏకపక్షంగా..
వరుసగా రెండు బౌట్‌లు నెగ్గి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఫొగట్.. సెమీస్‌లోనూ అదే జోరు చూపింది. ఏకపక్షంగా సాగిన పోరులో వినేష్ 5-0తో యుస్నేలిస్ గుజ్‌మన్ లోపెజ్ (క్యూబా)ను చిత్తు చేసింది. ఇద్దరు ఆరంభంలో ఆచితూచి ఆడారు. లోపెజ్ రక్షణాత్మకంగా వ్యవహరించడంతో.. ఫొగట్‌కు తొలి టెక్నికల్ పాయింట్ లభించింది. తర్వాత మరింత దూకుడుగా వ్యవహరించిన వినేష్ 4 పాయింట్లతో బౌట్‌ను సొంతం చేసుకొంది. రియో, టోక్యో క్రీడల్లో క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన ఫొగట్ ఈసారి ఏకంగా ఫైనల్‌కు చేరుకోవడం విశేషం
Updated Date - Aug 07 , 2024 | 08:03 AM