ఎవరి బలమెంత?
ABN, Publish Date - Nov 27 , 2024 | 03:24 AM
గత రికార్డులను బద్దలు కొడుతూ రెండురోజుల పాటు సాగిన ఐపీఎల్ మెగా వేలం క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లు కళ్లు చెదిరే మొత్తాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటివరకు ఆడిన జట్లకు గుడ్‌బై చెబుతూ...
గత రికార్డులను బద్దలు కొడుతూ రెండురోజుల పాటు సాగిన ఐపీఎల్ మెగా వేలం క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లు కళ్లు చెదిరే మొత్తాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటివరకు ఆడిన జట్లకు గుడ్‌బై చెబుతూ ఈ ఇద్దరితో పాటు పలువురు స్టార్ క్రికెటర్లు కొత్త ఫ్రాంచైజీల తరఫున బరిలోకి దిగబోతున్నారు. ఇక 182 మంది ఆటగాళ్లతో మూడేళ్లపాటు ఒప్పందం కుదుర్చుకున్న ఈ పది జట్లు ఎలా తమ టైటిల్ వేటను సాగించనున్నాయో పరిశీలిద్దాం..
ఢిల్లీ
క్యాపిటల్స్
వేలానికి ముందే తమ కెప్టెన్ రిషభ్ పంత్‌ను వదిలేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఢిల్లీ జట్టు. నలుగురిని రిటైన్ చేసుకున్న ఈ జట్టు.. స్టార్ ఆటగాడు డుప్లెసీ సహా 19 మందిని వేలంలో తీసుకుంది. ఇక, ఫ్రేజర్ మెక్‌గుర్క్‌తో రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అయితే రాహుల్ స్ట్రయిక్ రేట్ స్థాయికి తగ్గట్టుగా లేదు. స్టార్క్, నటరాజన్‌తో పేస్ బౌలింగ్ పటిష్టంగానే ఉంది. అక్షర్, కుల్దీ్‌పల రూపంలో నాణ్యమైన స్పిన్నర్లూ ఉన్నారు. అయితే మిడిలార్డర్‌లో బ్యాకప్ బలహీనంగా ఉంది. గత సీజన్‌లో బెంగళూరు సారథిగా వ్యవహరించిన డుప్లెసీకి.. ఈసారి ఢిల్లీ పగ్గాలు అప్పగించే అవకాశముంది.
లఖ్‌నవూ
సూపర్ జెయింట్స్
రూ.27 కోట్ల రికార్డు ధరతో తీసుకున్న రిషభ్ పంత్ జట్టు కెప్టెన్ కావడం ఖాయమే. వేలంలో 19 మందిని తీసుకోగా.. మిచెల్ మార్ష్, మార్‌క్రమ్‌తో ఓపెనింగ్ చేయించే అవకాశం ఉంది. అయితే ఈ జోడీ పెద్దగా ఫామ్‌లో లేదు. దీంతో పంత్, పూరన్‌పైనే అధిక భారం పడుతుంది. పేసర్లు మయాంక్, మొహిసిన్‌ల ఫిట్‌నెస్ కీలకం కానుంది.
సన్‌రైజర్స్
హైదరాబాద్
గత సీజన్‌లో రికార్డు స్కోర్లతో ఆకట్టుకున్న సన్‌రైజర్స్ తమ ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. దీనికి తోడు ఇషాన్ కిషన్, షమి, హర్షల్ పటేల్, జంపా రావడంతో జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. అదనపు స్పిన్నర్‌గా రాహుల్ చాహర్ ఉన్నాడు.
గుజరాత్
టైటాన్స్
వేలంలో 20 మందిని తీసుకున్న టైటాన్స్‌కు బట్లర్, గిల్ రూపంలో స్టార్ ఓపెనర్లు ఉన్నారు. ఇక రబాడ, కొట్జీ, సిరాజ్, ఇషాంత్, ప్రసిద్ధ్‌లతో పేస్ బలగం బావుంది. చివర్లో రాహుల్ తెవాటియా, షారుక్‌లాంటి మెరుపు వీరులున్నా.. మిడిలార్డర్ మాత్రం బలహీనంగా కనిపిస్తోంది.
రాయల్
చాలెంజర్స్ బెంగళూరు
బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టును బ్యాటింగ్ పవర్‌హౌ్‌సగా పిలుస్తారు. కానీ బౌలింగ్ అంతంతమాత్రమే. అందుకే వేలంలో హాజెల్‌వుడ్, భువనేశ్వర్‌లను అధిక ధరలకు తీసుకుంది. విరాట్ తిరిగి పగ్గాలు చేపట్టే అవకాశం లేకపోలేదు. లివింగ్‌స్టోన్, బెథెల్, సాల్ట్ రూపంలో ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్లున్నారు.
చెన్నై
సూపర్ కింగ్స్
సీఎ్‌సకే ఎప్పుడూ తాము వదిలేసిన ఆటగాళ్లనే వేలంలో తీసుకునేందుకు ఇష్టపడుతుంది. ఈసారి కూడా కాన్వే, రచిన్ రవీంద్ర జట్టులోకి వచ్చారు. అలాగే ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్, రాహుల్ త్రిపాఠి జట్టుకు ఉపయోగపడేవారే. చివర్లో ధోనీ మెరుపుబ్యాటింగ్‌తో ఆకట్టుకోగలడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ చాలాకాలం తర్వాత తిరిగి చెన్నైకి ఆడబోతున్నాడు.
పంజాబ్
కింగ్స్
కేవలం ఇద్దరు అన్‌క్యా్‌పడ్ ప్లేయర్లను రిటైన్ చేసుకున్న ఈ జట్టు రూ.26.75 కోట్లకు తీసుకున్న శ్రేయా్‌సను కెప్టెన్‌గా చేయవచ్చు. పేసర్లు అర్ష్‌దీప్, ఫెర్గూసన్, జాన్సెన్ ప్రధాన బలం. స్టొయినిస్, మ్యాక్స్‌వెల్ ఆల్‌రౌండర్లుగా ఉపయోగపడతారు. చాహల్, హర్‌ప్రీత్ జట్టు స్పిన్నర్లు.
రాజస్థాన్ రాయల్స్
రిటైన్ చేసుకున్న ఆరుగురిలో ఐదుగురు బ్యాటర్లే ఉండడంతో వేలంలో ఈ జట్టు ఎక్కువగా బౌలర్లపై దృష్టి సారించింది. అందుకే ఆర్చర్‌ను రూ.12.5 కోట్లకు తీసుకుంది. కానీ అతడిని తరచూ గాయాలు వెంటాడుతుంటాయి. స్పిన్నర్లు చాహల్, అశ్విన్‌ల స్థానాలను తీక్షణ, హసరంగ భర్తీ చేస్తారు. 13 ఏళ్ల వైభవ్ అరంగేట్రం కష్టమే.
కోల్‌కతా
నైట్‌రైడర్స్
15 మంది ఆటగాళ్లను తీసుకున్న ఈ జట్టు వెంకటేశ్ అయ్యర్‌పై భారీ మొత్తం వెచ్చించింది. జట్టు మూడో టైటిల్ అందుకునే క్రమంలో అయ్యర్ దూకుడైన బ్యాటింగ్ కీలక భూమిక పోషించనుంది. కెప్టెన్ కూడా అతనే అయ్యే అవకాశం ఉంది. రిటైన్ చేసుకున్న ఆరుగురు ఆటగాళ్లకు తోడు అయ్యర్ కూడా జత కలవడంతో దాదాపు పాత జట్టుతోనే ఆడబోతోంది.
ముంబై
ఇండియన్స్
రిటైన్ చేసుకున్న ఐదుగురు ఆటగాళ్లకే రూ.75 కోట్లు వెచ్చించిన ముంబై తొలి రోజు వేలంలో పెద్దగా సందడి చేయలేదు. చివరి రోజు మాత్రం పేసర్ బౌల్ట్‌పై రూ.12.5 కోట్లు, దీపక్ చాహర్‌పై రూ.9.25 కోట్లు వెచ్చించింది. హిట్టర్ టిమ్ డేవిడ్‌ను వదులుకోవడంతో విల్ జాక్స్‌ను తీసుకుంది. అయితే ఇషాన్ కిషన్ లేకపోవడంతో రోహిత్‌కు జతగా సరైన ఓపెనర్‌ను దించడం కష్టమే. రికెల్టన్‌ను పరిశీలించవచ్చు.
Updated Date - Nov 27 , 2024 | 03:24 AM