WPL Winner RCB : ఆర్సీబీదే అందలం
ABN, Publish Date - Mar 18 , 2024 | 04:44 AM
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో నయా చాంపియన్. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. దీంతో డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా టైటిల్ కల నెరవేరని ఈ ఫ్రాంచైజీకి
బెంగళూరుకు తొలి టైటిల్
ఫైనల్లో ఢిల్లీపై విజయం
మహిళల ప్రీమియర్ లీగ్
ఈ సాలా కప్ నమ్దే.. అంటూ ఐపీఎల్ ఆరంభం నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ట్రోఫీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎలాగైతేనేం.. ఇన్నాళ్లకు వారి కల తమ మహిళల జట్టుతో నెరవేరింది. ఫైనల్ ఒత్తిడిని తట్టుకుంటూ స్పిన్నర్లు శ్రేయాంక, మోలినెక్స్, ఆశా ఢిల్లీ బ్యాటర్లను కూల్చేయగా.. స్వల్ప ఛేదనలో ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ మరోసారి ఆపద్బాంధవ పాత్ర పోషించిన వేళ.. ఆర్సీబీ ఖాతాలో డబ్ల్యూపీఎల్ టైటిల్ చేరింది.
ప్రైజ్‌మనీ
ఆర్సీబీకి రూ. 6 కోట్లు
ఢిల్లీకి రూ. 3 కోట్లు
ఆరెంజ్ క్యాప్ (అత్యధిక రన్స్)
ఎలిస్ పెర్రీ (347)
పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు)
శ్రేయాంక పాటిల్ (13)
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో నయా చాంపియన్. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. దీంతో డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా టైటిల్ కల నెరవేరని ఈ ఫ్రాంచైజీకి మంధాన సేన ఆ కొరతను తీర్చింది. స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్ (4/12), మోలినెక్స్ (3/20), ఆశా శోభన (2/14) కలిసి ఢిల్లీ 9 వికెట్లు తీయడం విశేషం. కాగా, ఢిల్లీ వరుసగా రెండోసారీ రన్నరప్‌కే పరిమిత వడం గమనార్హం. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. షఫాలీ (44), లానింగ్ (23) మినహా అంతా విఫలమ య్యారు. ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఛేదనలో ఆర్సీబీ 19.3 ఓవర్లలో 2 వికెట్లకు 115 రన్స్ చేసి నెగ్గింది. ఎలిస్ పెర్రీ (35 నాటౌట్), సోఫీ డివైన్ (32), కెప్టెన్ మంధాన (31) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా మోలినెక్స్ నిలిచింది.'
ఆఖరి ఓవర్‌లో ముగించారు: ఛేదించాల్సింది స్వల్ప లక్ష్యమే అయినా ఆర్సీబీ పోరు ఆఖరి ఓవర్ వరకు సాగింది. దీనికి ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగే కారణం. అయితే పెర్రీ ఒత్తిడిని అధిగమిస్తూ జట్టును విజయతీరాలకు చేర్చింది. ఓపెనర్లు మంధాన, డివైన్‌లకు ఆరంభంలో పరుగులు సాధించడమే కష్టంగా మారింది. వికెట్ పడకూడదనే కారణంతో డిఫెన్సివ్ ఆటతీరును కనబర్చడంతో పవర్‌ప్లేలో జట్టు 25 పరుగులే చేసింది. అయితే ఏడో ఓవర్‌లో డివైన్ 4,4,6,4 బాదడంతో 18 రన్స్ వచ్చాయి. కాసేపటికే డివైన్‌ను శిఖా అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే మంధాన 15వ ఓవర్ వరకు క్రీజులో ఉన్నా మెరుపులు కనిపించలేదు. చివరకు గెలిపించే బాధ్యతను పెర్రీ తీసుకోగా, ఆమెకు మరో ఎండ్‌లో రిచా ఘోష్ (17 నాటౌట్) సహకరించింది. అయితే బంతికో పరుగు చొప్పున లక్ష్యం ఉండడంతో ఇరు జట్ల శిబిరాల్లో ఒత్తిడి నెలకొంది. 18, 19వ ఓవర్లలో పెర్రీ ఒక్కో ఫోర్ సాధించడంతో సమీకరణం చివరి ఓవర్‌లో ఐదు పరుగులకు మారింది. ఇందులో తొలి రెండు బంతులకు రెండు పరుగులు రాగా.. మూడో బంతిని రిచా ఫోర్‌గా మలచడంతో ఆర్సీబీ సంబరాలు ఆకాశాన్నంటాయి.
స్పిన్ ధాటికి విలవిల: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభానికి ముగింపునకు సంబంధమే లేకుండా సాగింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు షఫాలీ, లానింగ్ 64 రన్స్ సమకూరిస్తే.. బెంగళూరు స్పిన్నర్ల ప్రతాపానికి మిగతా 49 పరుగుల్లోనే జట్టు మొత్తం కుప్పకూలింది. కానీ మొదట్లో షఫాలీ ఎదురుదాడికి ఓవర్‌కు పది పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళ్లిన ఢిల్లీ పవర్‌ప్లేలోనే 61 రన్స్ సాధించింది. మూడో ఓవర్‌లో షఫాలీ సిక్సర్, లానింగ్ 2 ఫోర్లతో 19 రన్స్ సమకూరాయి. తర్వాత పెర్రీ ఓవర్‌లోనూ షఫాలీ 6,4తో ఆకట్టుకుంది. అయితే ఎనిమిదో ఓవర్‌లో మోలినెక్స్ 3 వికెట్లతో ఢిల్లీని చావుదెబ్బ తీసింది. తొలి బంతికే షఫాలీ, మూడు, నాలుగు బంతులకు జెమీమా (0), క్యాప్సీ (0) వెనుదిరిగారు. కుదురుకున్న లానింగ్‌ను శ్రేయాంక ఎల్బీ చేయడంతో భారీస్కోరుపై ఢిల్లీ ఆశలు వదులుకుంది. అటు టెయిలెండర్లను శ్రేయాంక చకచకా పెవిలియన్‌కు చేర్చడంతో తొమ్మిది బంతులుండగానే ఢిల్లీ ఆట ముగిసింది.
స్కోరుబోర్డు
ఢిల్లీ: లానింగ్ (ఎల్బీ) శ్రేయాంక 23, షఫాలీ (సి) వేర్హమ్ (బి) మోలినెక్స్ 44, జెమీమా (బి) మోలినెక్స్ 0, క్యాప్సీ (బి) మోలినెక్స్ 0, కాప్ (సి) డివైన్ (బి) శోభన 8, జొనాసెన్ (సి) మంధాన (బి) శోభన 3, రాధ (రనౌట్) 12, మిన్నూ మణి (ఎల్బీ) శ్రేయాంక 5, అరుంధతి (బి) శ్రేయాంక 10, శిఖా పాండే (నాటౌట్) 5, తానియా (సి) రిచా (బి) శ్రేయాంక 0, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 18.3 ఓవర్లలో 113 ఆలౌట్; వికెట్ల పతనం: 1-64, 2-64, 3-64, 4-74, 5-80, 6-81, 7-87, 8-101, 9-113, 10-113; బౌలింగ్: రేణుక 2-0-28-0, మోలినెక్స్ 4-0-20-3, పెర్రీ 2-0-14-0, డివైన్ 1-0-9-0, వేర్హమ్ 3-0-16-0, శ్రేయాంక 3.3-0-12-4, శోభన 3-0-14-2.
బెంగళూరు: స్మృతి మంధాన (సి) అరుంధతి (బి) మిన్ను 31, సోఫీ డివైన్ (ఎల్బీ) శిఖా పాండే 32, ఎలిస్ పెర్రీ (నాటౌట్) 35, రిచా ఘోష్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: 19.3 ఓవర్లలో 115/2; వికెట్ల పతనం: 1-49, 2-82; బౌలింగ్: కాప్ 4-0-20-0, క్యాప్సీ 3-0-13-0, శిఖా పాండే 4-0-11-1, రాధా యాదవ్ 1-0-18-0, అరుంధతి 3.3-0-26-0, జొనాసెన్ 2-0-15-0, మిన్నూ మణి 2-0-12-1.
Updated Date - Mar 18 , 2024 | 04:44 AM