Whatsapp: ఒక్క నెలలోనే 71 లక్షల వాట్సాప్ ఖాతాలు తొలగింపు..అలా చేస్తే మీ అకౌంట్ కూడా!
ABN, Publish Date - Jan 02 , 2024 | 03:54 PM
వాట్సాప్(whatsapp) భారతదేశంలో ఒక్క నెలలోనే ఏకంగా 71 లక్షల ఖాతాలను నిషేధించింది. అంతేకాదు అందుకు గల కారణాలను కూడా తెలిపింది. దీంతోపాటు వాట్సాప్ ఖాతాను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్(whatsapp) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో నవంబర్ నెలలోనే ఏకంగా 71 లక్షలకు పైగా WhatsApp ఖాతాలను తొలగించింది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ఇండియా మంత్లీ రిపోర్ట్‌లో ఈ విషయాన్ని తెలిపింది. జనవరి 1, 2024న ప్రచురించిన నివేదికలో నవంబర్ 1 నుంచి 30 వరకు మొత్తం 71,96,000 ఖాతాలు నిషేధించబడినట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌లో వినియోగదారుల నుంచి వచ్చిన ఆన్‌లైన్ స్కామ్స్, ఫేక్ వార్తల ప్రచారం, అశ్లీల సమాచారం వంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఆయా ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. అంతేకాదు వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌ను దుర్వినియోగం చేస్తున్న పలువురి ఖాతాలను కూడా తొలిగించినట్లు(ban) స్పష్టం చేసింది.
అయితే WhatsAppలో ప్రస్తుతం భారతీయ వినియోగదారులు +91 ఫోన్ నంబర్ ద్వారా గుర్తించబడతారు. ఈ క్రమంలో డిసెంబర్ 2023లోనే వాట్సాప్‌కు 8841 ఫిర్యాదులు అందగా, వాటిలో 6 ఫిర్యాదులపై కంపెనీ చర్యలు తీసుకుంది. ఇది కాకుండా, గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ (GAC) నుంచి కూడా 8 నివేదికలు అందాయని ప్రకటించింది. GAC భారత ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడింది. ఇది వివిధ సామాజిక మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో భారతీయ పౌరులు చేసిన ఫిర్యాదులను పరిష్కరిస్తుంది.
WhatsApp దాని ప్లాట్‌ఫారమ్‌లో దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి కొత్త భద్రతా సాధనాల వంటి అనేక చర్యలను తీసుకుంటుంది. ఇది WhatsAppలో మూడు వేర్వేరు స్థాయిలలో గుర్తించబడుతుంది. ఒక వినియోగదారు ఖాతాను నివేదించినట్లయితే విశ్లేషకుల బృందం దానిని పరిశోధిస్తుంది. ఆ తర్వాత ఆయా ఖాతాపై శాశ్వత నిషేధం వంటి బలమైన చర్య అవసరమా కాదా అని నిర్ణయం తీసుకుంటుంది. ఈ క్రమంలో గోప్యత, వినియోగదారు భద్రత వంటి అంశాలను ప్రాతిపదికన తీసుకుని వాట్సాప్ గత కొన్ని నెలలుగా భద్రతా ఫీచర్లను నిరంతరంగా రూపొందిస్తోంది.
Updated Date - Jan 02 , 2024 | 03:55 PM