I phones: ఐఫోన్..కేరాఫ్ ఇండియా
ABN, Publish Date - Apr 11 , 2024 | 09:29 AM
అగ్రరాజ్యం అమెరికాలో ఐఫోన్ కొన్నా.. దానిపై ఉండేది ‘మేడిన్ చైనా’..! ఇది ఒకప్పటి ముచ్చట..! ఇప్పుడు క్రమంగా ‘మేడిన్ ఇండియా’ ఐఫోన్లు పెరుగు తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ఐఫోన్లలో భారత్ వాటా 14%. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఇది రెట్టింపు.
అగ్రరాజ్యం అమెరికాలో ఐఫోన్ కొన్నా.. దానిపై ఉండేది ‘మేడిన్ చైనా’..! ఇది ఒకప్పటి ముచ్చట..! ఇప్పుడు క్రమంగా ‘మేడిన్ ఇండియా’ ఐఫోన్లు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ఐఫోన్లలో భారత్ వాటా 14%. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఇది రెట్టింపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) భారత్ వాటా 25 శాతాన్ని దాటనుందని అంచనా..! మూడు దిగ్గజ కంపెనీలు భారత్‌లో యాపిల్ ఐఫోన్ అసెంబ్లింగ్ చేస్తున్నాయి. వీటిల్లో ఫాక్సాన్ టెక్నాలజీ గ్రూప్ వాటా 67% కాగా.. పెగట్రాన్ కార్ప్ మరో 17% ఐఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. మిగతా వాటా టాటాగ్రూప్(గతంలో విస్ట్రాన్ కార్ప్)ది. క్రమంగా ఈ కంపెనీలు తమ ఉత్పాదకతను పెంచే దిశలో చర్యలు తీసుకుంటున్నాయి. 2017 నుంచే భారత్‌లో ఐఫోన్ల అసెంబ్లింగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఐఫోన్ అన్ని రకాల మోడల్స్ ‘మేడిన్ ఇండియా’ లేబుల్‌తో ఇక్కడే అసెంబ్లింగ్ అయ్యేవి. ప్రస్తుతం ప్రో, ప్రోమ్యాక్స్ మినహా.. ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 15 మోడళ్ల అసెంబ్లింగ్ జరుగుతోంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌గోయల్ గత ఏడాది భారత్‌లో యాపిల్ పెట్టుబడుల గురించి మాట్లాడుతూ.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఐఫోన్ అసెంబ్లింగ్‌లో భారత్ వాటా 25 శాతానికి చేరుకోనున్నట్లు అంచనా వేశారు.
విడి భాగాల ఉత్పత్తి ఎక్కడెక్కడ?
యాపిల్ తన ఐఫోన్‌కు కావాల్సిన విడిభాగాలను వేర్వేరు దేశాల్లోని సంస్థలతో ఉత్పత్తి చేయిస్తుంది. అయితే.. వాటి అసెంబ్లింగ్ మాత్రం ఒకప్పుడు చైనాకు మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు భారత్, వియత్నాం తదితర దేశాల్లో ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లు పుంజుకున్నాయి.
కాలిఫోర్నియాలోని క్యూపెర్టినోలో యాపిల్ హెడ్‌క్వార్టర్స్ ఉంది.
జపాన్, కొరియా, తైవాన్‌లలో ఐఫోన్ స్క్రీన్‌లు తయారవుతాయి. జపాన్‌లోని షార్ప్ కంపెనీ ఎల్‌సీడీ ప్యానెల్స్‌ను, టచ్‌స్క్రీన్/టచ్‌ప్యాడ్‌లను జపాన్‌తోపాటు.. కొరియన్ కంపెనీలు తయారు చేస్తున్నాయి.
దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ సంస్థ ఐఫోన్ కోసం ఇన్–సెల్ డిస్‌ప్లే టెక్నాలజీని అందజేస్తుంది. దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్ కంపెనీ ఐఫోన్‌కోసం మైక్రోచిప్స్‌ను, బ్యాటరీలను రూపొందిస్తోంది.
తైవాన్‌కు చెందిన టీఎస్‌ఎంసీ, ఎస్‌కే హైనిక్స్ సంస్థలు చిప్స్, డీ–ర్యామ్, ఫ్లాష్ మెమొరీని ఉత్పత్తి చేస్తాయి. జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న ఎస్‌టీమైక్రోఎలక్ట్రానిక్స్ సంస్థ ఐఫోన్లలో ట్రాకింగ్ వ్యవస్థకు అవసరమైన ‘గైరోస్కోప్’ను అందజేస్తోంది. మలేసియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్ దేశాల్లోనూ పలు విడిభాగాలు తయారవుతాయి.
చైనాకు క్రమంగా దూరం.. దూరం..!
కొవిడ్ విజృంభణకు ముందు వరకు ఐఫోన్‌ల అసెంబ్లింగ్ 100% చైనాలోనే జరిగేది. రోజుకు 5 లక్షల ఐఫోన్లు తయారయ్యేవి. సుదీర్ఘ లాక్‌డౌన్ల వల్ల ఐఫోన్ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. అప్పట్లోనే యాపిల్ క్రమంగా ఇతర దేశాల్లో అసెంబ్లింగ్‌కు ప్రయత్నాలు చేసింది. భారత్‌లో అసెంబ్లింగ్‌ను పెంచాలని నిర్ణయించింది. ఇందుకు భారత పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహకాలు కూడా దోహదపడ్డాయి. ప్రస్తుతం ఐఫోన్–15 ఉత్పత్తిలో చైనా వాటా కేవలం 7%. పొరుగుదేశాలతో డ్రాగన్ కవ్వింపు చర్యలు, అమెరికాతో కయ్యం కూడా చైనా నుంచి యాపిల్ బయటకు రావడానికి కారణంగా తెలుస్తోంది. కాగా, భారత్‌లో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు క్రమంగా పెరుగుతున్నట్లు ‘ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్’ వెల్లడించింది. భారత్ ఎగుమతుల్లో మొబైల్‌ఫోన్లు ఐదో స్థానానికి చేరుకున్నట్లు తెలిపింది. యాపిల్‌తోపాటు.. సామ్‌సంగ్ వంటి దిగ్గజ కంపెనీల ఉత్పత్తి భారత్‌లో జరగడమే ఇందుకు కారణమని పేర్కొంది.
మరిన్ని సైన్స్ & టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 11 , 2024 | 09:29 AM