రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన బీఆర్‌ఎస్
ABN, Publish Date - Nov 03 , 2024 | 11:42 PM
ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వమని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
- రూ.50 లక్షలతో ఉమా మహేశ్వరాలయ అభివృద్ధి
- పర్యాటక హబ్‌గా నల్లమల
- ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
అచ్చంపేట, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వమని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆయన ఆదివారం నాగర్‌క్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని రంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధి లోని ఉమా మహేశ్వరాలయం దిగువన చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమల ప్రాంతాన్ని పర్యాటక రంగంలో దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. ఆలయ అభివృద్ధికోసం మంజూరైన రూ.50 లక్షలతో పాటు మరో రూ.70లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్నీ పాతరవేసి పది నెలల మా ప్రభుత్వంపై బురదజల్లడం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకు ప్రతీ నెల రూ. 6వేల కోట్లు అప్పుచేసి చెల్లించాల్సి వస్తోందని అన్నారు. అయినా మా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఉమామహేశ్వ రాలయ చైర్మన్ మాధవరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, మునిసిపల్ చైర్మన్ శ్రీనివాసు లు, పాలశీతలీకరణ చైర్మన్ నర్సయ్య యాదవ్, ఈవో శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
Updated Date - Nov 03 , 2024 | 11:42 PM