ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలు
ABN, Publish Date - Nov 19 , 2024 | 12:31 AM
జిల్లాలో గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం రెండోరోజు నిర్వహించిన పరీక్షకు 26,415 మంది హాజరుకావలసి ఉండగా 13,902 మంది మాత్రమే పరీక్షలు రాశారు.
కరీంనగర్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం రెండోరోజు నిర్వహించిన పరీక్షకు 26,415 మంది హాజరుకావలసి ఉండగా 13,902 మంది మాత్రమే పరీక్షలు రాశారు. 12,513 మంది గైర్హాజరు కావడంతో 52.63 హాజరుశాతం నమోదైంది. ఆది, సోమవారం రెండురోజులుగా నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను, ఇతర సామగ్రిని బందోబస్తు మధ్య జడ్పీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఉదయం 8.30 గంటల వరకే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 9.30 తర్వాత వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయడంతోపాటు సమీపంలోని జిరాక్సు కేంద్రాలను పరీక్ష సమయం ముగిసే వరకు మూసి వేయించారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేసి హాల్ టికెట్లను పరిశీలించిన తర్వాతనే కేంద్రాలోకి అనుమతించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాల్లోని అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, పట్టిష్టమైన ఏర్పాట్లతో ఎక్కడ ఏ చిన్న పొరపాటు కూడా జరుగలేదని ఆయన తెలిపారు. పరీక్షలను ట్రైనీ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఆర్డీవో మహేశ్వర్, ఏసీపీ విజయ్‌కుమార్, గ్రూప్-3 పరీక్ష కో ఆర్డినేటర్లు వరలక్ష్మి, సతీష్‌కుమార్, సీఐలు కోటేశ్వర్, విజయ్‌కుమార్, జాన్‌రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కాళీచరణ్ పర్యవేక్షించారు.
------------------
Updated Date - Nov 19 , 2024 | 12:31 AM