భూసేకరణపై రగులుతోన్న రగడ
ABN, Publish Date - Oct 24 , 2024 | 12:53 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారత మాల పరియోజన పథకం కింద నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) సర్కారు మరింత ముందడుగు వేసింది.
ఓ వైపు విచారణ...మరోవైపు ఆందోళనలు
ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ విచారణ సమావేశాలు బహిష్కరణ
అలైనమెంట్‌లో మార్పు ఉండదని స్పష్టం
ఇప్పటికే 3(జీ) నోటిఫికేషన జారీచేసిన సర్కార్
పరిహారం చెల్లించేందుకు సిద్ధం
యాదాద్రి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారత మాల పరియోజన పథకం కింద నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) సర్కారు మరింత ముందడుగు వేసింది. భూసేకరణ చేపట్టేందుకు ఇప్పటికే 3(జీ) నోటిఫికేషన జారీ చేసి గ్రామాల వారీగా భూములు కోల్పోతోన్న రైతులు, ప్లాట్ల యజమానులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఓ వైపు జిల్లా యంత్రాంగం గ్రామాల వారీగా భూసేకరణపై డాక్యుమెంట్ల విచారణ చేపడుతుండగా, మరోవైపు రైతులు, ఇతరులు ఆర్‌ఆర్‌ఆర్‌కు భూమిలిచ్చే ప్రసక్తే లేదని ఆందోళనకు దిగుతున్నారు. వలిగొండ మండలం పొద్దుటూరు, రెడ్లపాక, పహిల్వానపురం, గోకారం, వర్కుట్‌పల్లి, చౌటుప్పల్, తాళ్లసింగారం, చిన్నకొండూరు గ్రామాల్లో నిర్వహించిన సమావేశాలను బాధితులు బహిష్కరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ అలైనమెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం విచారణలో పాల్గొనని రైతులకు రికార్డుల పరంగా నష్టపరిహారం లెక్కించేందుకు చర్యలు తీసుకుంటుంది. 3(జీ) నోటిఫికేషన జారీ చేయడంతో ఆస్తులు కోల్పోతున్న బాధితులు ఆందోళనబాట పట్టారు. గురువారం చౌటుప్పల్ మండలంలోని తంగడ్‌పల్లి, నేలపట్ల, 25న చౌటుప్పల్, లింగోజిగూడ, భువనగిరి మండలంలోని గౌస్‌నగర్, కేసారం, 26న యెర్రంబెల్లి, 28న తుక్కాపూర్, 29న పెంచికల్‌పహడ్, 30న రాయిగిరిలో విచారణ చేపట్టనున్నారు. ఈ సమావేశాల్లోనూ బాధితులు నిరసనలు వ్యక్తం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం భూములు కోల్పోతున్న రైతులు, ఇతర వ్యక్తులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సంబంధిత రికార్డులతో పాటు ఆ భూములు కోల్పోతోన్న వారికి నష్టపరిహారాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
1927 ఎకరాల భూమి సేకరణ
ఆర్‌ఆర్‌ఆర్ అలైనమెంట్‌ను మార్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో జిల్లా యంత్రాంగం భూసేకరణ వేగవంతం చేసింది. ఉత్తరభాగం నిర్మాణంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 1927 ఎకరాల మేర భూసేకరణ చేపట్టనుంది. మరో 188 ఎకరాలు చౌటుప్పల్ వద్ద జంక్షన కోసం భూసేకరణకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు రైతుల పొలాల్లో సర్వే నిర్వహించారు. ఈ మేరకు హద్దురాళ్లను ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి అలైన్‌మెంట్ ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం మొత్తం సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 19 మండలాలకు చెందిన 113 గ్రామాల మీదుగా వెళ్తుంది. యాదాద్రిభువనగిరి జిల్లాలో 34 గ్రామాల మీదుగా ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించనున్నారు. చౌటుప్పల్ వద్ద జంక్షన్ ఏర్పాటుపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పరిశీలిస్తున్నారు. భారతమాల పరియోజన పథకం కింద నిర్మిస్తున్న ఈ రోడ్డు మొత్తం జిల్లాలో 59.33 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందుకోసం తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లో 1927 ఎకరాల భూమిని సేకరించనున్నారు. దక్షిణ భాగానికి రింగ్ రోడ్డును కలిపేందుకు చౌటుప్పల్‌లో 258 ఎకరాలు సేకరించేందుకు సర్వే పనులు పూర్తయ్యాయి. చౌటుప్పల్‌లో జంక్షనకు వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. సర్వే పనులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఆర్‌ఆర్‌ఆర్‌పై వేగంగా ముందుకు సాగుతుంది. మరోవైపు కేంద్రప్రభుత్వం 3జీ నోటిఫికేషనజారీ చేసిన నేపథ్యంలో విచారణ పూర్తికాగానే భూములను కోల్పోతున్న బాధితులకు పరిహారం ఇవ్వనున్నారు. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో భూములు, ఓపెన ప్లాట్లు కోల్పోతున్న వారికి దాదాపుగా రూ.200 కోట్లు, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లోని రైతులు, ఇతర ఆస్తులకు పరిహారం రూ.187 కోట్లుగా నిర్ణయించి, ఎనహెచఏఐ అధికారులకు నివేదిక పంపించారు. పరిహారం నిర్ణయం తుది దశకు చేరుకోవడంతో ఇక భూసేకరణ వేగవంతం కానుంది.
ఆర్‌ఆర్‌ఆర్ అలైనమెంట్‌ను మార్చాలి
చౌటుప్పల్ టౌన : రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) అలైనమెంట్‌ను మార్చాలని లేదా మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆర్‌ఆర్‌ఆర్ త్రీజీ నోటిఫికేషన భూనిర్వాసితుల సమావేశాన్ని బాధితులు బహిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు జాతీయరహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా భూనిర్వాసితులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌ఆర్‌ఆర్ అలైనమెంటును ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన చింతల దామోధర్‌రెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, పెద్దిటి బుచ్చిరెడ్డి, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Oct 24 , 2024 | 12:53 AM