మరో మూడు రోజులే!
ABN, Publish Date - Jun 30 , 2024 | 11:34 PM
జిల్లా, మండల పరిషత్ పాలకవర్గాల గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. మండల, జిల్లాపరిషత్ ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పనులకు 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముగియనున్న జడ్పీ, మండల పాలకవర్గాల గడువు
15వ ఆర్ధిక సంఘం నిధుల కోసం ఎదురుచూపులు
మేడ్చల్ జూన్ 30(ఆంధ్రజ్యోతి): జిల్లా, మండల పరిషత్ పాలకవర్గాల గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. మండల, జిల్లాపరిషత్ ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పనులకు 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదవీకాలం ముగిసేలోగా నిధులు వస్తే పనులు చేపట్టాలని ప్రజాప్రతినిధులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జూలై 4, 5 తేదీలలో మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు ముగియనుంది. 2023-24 సంవత్సరానికి పంపించిన పనుల ప్రతిపాదనలకు సంబంధించి పూర్తి స్థాయి నిధులు రాలేదు. కేంద్ర ప్రభుత ్వం 2011 జనాభా ప్రాతిపదికన ఏటా రెండు విడుతలుగా నిధులు విడుదల చేస్తోంది. రూ.5 లక్షలోపే పనులు ప్రతిపాదించి అంచనాలు రూపొందిస్తున్నారు. 2023-24కు సంబంధించి మొదటి విడత నిధులు విడుదలయ్యాయి. రెండో విడతవి రాకపోవ డంతో తమ పదవీకాలం ముగిశాక నిధులు వస్తే ఎలా? అని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2024-25 ఆర్థ్ధిక సంవత్సరానికి సంబంధించి జిల్లా, మండల పరిషత్‌లు పనులు ప్రతిపాదనలు తయారు చేసి పాలకవర్గాల ఆమోదంతో నిధుల విడుదల కోసం పంపించారు. విడుదల చేస్తే కొత్త పనులు ప్రారంభించవచ ్చనే ఆశతో ఉన్నారు. జిల్లా, మండల పరిషత్‌లకు నిధుల కేటాయింపు అంతంతమాత్రమే. కేంద్రం మాత్రం 15వ ఆర్ధికసంఘం నిధులు ఏటా కేటాయిస్తోంది. ఆ నిధులతోనే గ్రామాలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు మౌలిక సదుపాయాల కోసం పనులు చేపడుతున్నారు. మురుగుకాల్వలు, మరుగుదొడ్ల నిర్మాణం, అదనపు పాఠశాల గదులు, సైన్స్‌పరికరాల కొనుగోలు, ఆరోగ్య కేంద్రాలలో సౌకర్యాలు, అసంపూర్తి పనులు పూర్తి చేయడం వంటి వాటికి రెండు విభాగాల ద్వారా ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి కేటాయించిన పనులు గ్రామాల్లో కొనసాగుతున్నాయి.
విడుదలైన నిధుల వరకే పనులు: దిలీప్, జడ్పీ సీఈవో
2023-24కు సంబంధించి పనులు జరుగుతున్నాయి. 15వ ఆర్ధిక సంఘానికి సంబంధించి మొదటి విడత నిధులు విడుదలయ్యాయి. ఆ నిధుల వరకు మాత్రమే పనులు జరుగుతున్నాయి. మిగిలినవి కూడా వస్తాయని సమాచారముంది. 2024-25 నిధులు జూలై నెలాఖరుకు వచ్చే అవకాశముంది.
Updated Date - Jun 30 , 2024 | 11:34 PM