నకిలీ పత్రాలతో 23.78 కోట్ల జీఎస్టీ రిఫండ్!
ABN, Publish Date - May 04 , 2024 | 04:59 AM
వాణిజ్య పన్నుల విభాగంలో మరోసారి అక్రమాలు వెలుగు చూశాయి. నకిలీ పత్రాలు సృష్టించి పెద్దమొత్తంలో జీఎస్టీ రిఫండ్ పొందడంలో నిందితుడికి వాణిజ్య పన్నుల విభాగం అధికారులు
నాడు ఫిర్యాదు చేసిన అధికారే
నేడు నిందితుడిగా అరెస్ట్
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య పన్నుల విభాగంలో మరోసారి అక్రమాలు వెలుగు చూశాయి. నకిలీ పత్రాలు సృష్టించి పెద్దమొత్తంలో జీఎస్టీ రిఫండ్ పొందడంలో నిందితుడికి వాణిజ్య పన్నుల విభాగం అధికారులు సహకరించారు. ఈ వ్యవహారంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. తాను అధికారులకు లంచాలు ఇచ్చానని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిందితుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశాడు. విచారణలో ఇంటి దొంగల ప్రమేయం బయటపడింది. దీంతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శుక్రవారం నలుగురు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల్ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. వేమిరెడ్డి రాజారమేష్ రెడ్డి.. వివర్ధ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విద్యుత్ వాహనాల యూనిట్ ఏర్పాటు చేశాడు. ఆ సంస్థకు ఆయన మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి చెల్లించిన జీఎస్టీ రిఫండ్ కోసం నకిలీ పత్రాలు సృష్టించి ఏకంగా రూ.23.78 కోట్ల రిఫండ్ పొందాడు. ఈ రిఫండ్‌లో మోసం జరిగినట్లు గుర్తించిన అధికారులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు గత మార్చిలో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు రాజారమేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వాణిజ్య పన్నుల విభాగం అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రాజారమేష్ జీఎస్టీ రీఫండ్‌కు పత్రాల్లో పేర్కొన్న కొన్ని యూనిట్లు అసలు అక్కడ లేనట్లు గుర్తించారు. కాగా సీసీఎస్ పోలీసులు తనను అరెస్ట్ చేయడంతో రాజారమేష్ రెడ్డి జీఎస్టీ రిఫండ్ కోసం తాను అధికారులకు లంచాలు ఇచ్చానని, ఎవరెవరికెంత ఇచ్చిందీ వివరిస్తూ సీఎస్, వాణిజ్య పన్నుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ జరిపిన పోలీసులు రాజారమేష్ జీఎస్టీ రిఫండ్‌కు సహకరించిన పి.స్వర్ణ కుమార్, డిప్యూటీ కమిషనర్ జీఎస్టీ (నల్లగొండ డివిజన్); పొదిల విశ్వ కిరణ్, అసిస్టెంట్ కమిషనర్ (స్టేట్ ట్యాక్సెస్) మాదాపూర్-1 సర్కిల్; కె. వేణుగోపాల్, అసిస్టెంట్ కమిషనర్(స్టేట్ ట్యాక్సెస్) నాంపల్లి-1 సర్కిల్; వి.వెంకట రమణ, డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ జీఎస్టీలను శుక్రవారం అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో గత మార్చిలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విశ్వ కిరణ్‌నూ అరెస్ట్ చేయడం గమనార్హం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈ కేసులో అతని ప్రమేయం ఉన్నట్లు తేలడంతో అరెస్ట్ చేశారు.
Updated Date - May 04 , 2024 | 08:48 AM