40 మంది మహిళలకు లైంగిక వేధింపులు
ABN, Publish Date - Apr 08 , 2024 | 04:29 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను వె్‌స్ట్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వెంటనే వారిని హైదరాబాద్ తరలించారు. వీరిలో ఒకరు రౌడీ
ట్యాపింగ్‌లో ఘరానా కానిస్టేబుల్ నిర్వాకం
కొందరి డేటా సేకరించి వ్యక్తిగత అంశాల్లోకి చొరబాటు.. నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులో వార్ రూం
మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వాహకుల నుంచి భారీ వసూళ్లు.. రౌడీ షీటర్లతో చేతులు కలిపి సెటిల్‌మెంట్లు
ఓ పోలీస్ అధికారి 9 ఎకరాల విక్రయంలో సాయం.. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ప్రమేయం
రూ.కోట్లలో అక్రమార్జన.. విచారణలో బయటకు?.. టాస్క్‌లు, ఆపరేషన్ల గుట్టువిప్పుతున్న రాధాకిషన్‌రావు
ఉన్నతాధికారి చెప్పినట్లే చేశానని విచారణలో వెల్లడి!.. కస్టడీ మరో 3 రోజులు.. నాయకుల చుట్టూ ఉచ్చు
కానిస్టేబుల్.. పోలీస్ శాఖలో కిందిస్థాయి ఉద్యోగి. కానీ, ఇతడు మాత్రం ఘరానా కానిస్టేబుల్..! బెదిరింపులు.. వసూళ్లు.. సెటిల్‌మెంట్లు.. దందాలు.. అన్నింట్లోనూ పాత్ర..! ఓ దశలో జిల్లా ఎస్పీకి అతడు ఎంత చెబితే అంత! ఆడిందే ఆట పాడిందే పాటగా పెత్తనం సాగిస్తూ డీఎస్పీలు, సీఐలకే హడల్ పుట్టించాడు. ఇదే క్రమంలో ‘ఫోన్ ట్యాపింగ్’ టీంలోకీ అతడిని తీసుకున్నారు. దీని మాటున చెలరేగిపోయాడు. కొంతమంది మహిళల వ్యక్తిగత విషయాలు సేకరించి వారి జీవితాలతో ఆడుకున్నాడు. 40 మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
నల్లగొండ, హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను వె్‌స్ట్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వెంటనే వారిని హైదరాబాద్ తరలించారు. వీరిలో ఒకరు రౌడీ షీటర్లతో కలిసి సెటిల్‌మెంట్లు, గంజాయి కేసు నిందితులు, పేకాట నిర్వాహకులు, ఇతర నేరస్థులను టార్గెట్ చేసి రూ.కోట్లలో వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఏడాదిన్నర కిందట ప్రతిష్ఠాత్మకంగా జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగానూ గుర్తించారు. ఇంకా అనేక ఆరోపణలున్న నేపథ్యంలో అవి నిజమని తేలితే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నల్లగొండ కేంద్రంగా సాగిన ఈ తంతుపై వెలుగులోకి వస్తున్న సమాచారం పోలీసు శాఖ, రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ట్యాపింగ్ కేసులో నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న ఒక సీఐని విచారించడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. ట్యాపింగ్ కోసం నల్లగొండలోని హైదరాబాద్ రోడ్‌లోవార్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ భవనంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. వార్‌రూమ్‌లో పనిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని కూడా గుర్తించారు. వారినుంచి వివరాలు సేకరించే ప్రక్రియ సాగుతోంది. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలను యూనిట్‌గా ఏర్పాటు చేసుకుని నల్లగొండలోనే ట్యాపింగ్ సెంటర్ నిర్వహించారని, రెండు జిల్లాల ప్రతిపక్ష నాయకులు, వారి సన్నిహితుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ట్యాపింగ్‌లో కీలక నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు నల్లగొండ ఎస్పీగా పనిచేశారు. అప్పుడు ఏఎస్పీగా ఉన్న అధికారి తర్వాత ఎస్పీ అయ్యారు. ఆ పరిచయాలతో వివాదాస్పద కానిస్టేబుల్‌ను ట్యాపింగ్ టీమ్‌లో చేర్చుకున్నట్లు సమాచారం. టాస్క్‌ఫోర్స్, సీసీఎ్‌సలలో పనిచేసిన ఇతడికి ట్యాపింగ్‌లో కీలక బాధ్యతలివ్వడంతో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడ్డాడని చర్చ సాగుతోంది.
9 సిమ్‌లు.. బయటకు రానున్న బాధితులు
వివాదాస్పద కానిస్టేబుల్ మొత్తం తొమ్మిది సిమ్‌కార్డులను వినియోగించినట్లు సమాచారం. ఓవైపు రాజకీయ నేతలకు అవసరమైన ఫోన్లతో పాటు, మరోవైపు సొంత వ్యవహారాలకు కూడా ట్యాపింగ్‌ను అడ్డుపెట్టుకున్నట్లు తెలుస్తోంది. మహిళల ఫోన్లను ట్యాప్ చేసి వ్యక్తిగత సంభాషణలు విని లోబర్చుకునేవాడని సమాచారం. తాను కన్నేసిన మహిళలు, ఉద్యోగినులను వేధించాడని చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలోని ఓ ఛోటా నాయకుడు అక్రమ వ్యవహారంలో పట్టుబడితే, దానిని అడ్డుపెట్టుకుని ఆయన భార్యను సైతం బ్లాక్‌మెయిల్ చేశాడు. కాగా, ఇతడి బాధితుల్లో కొందరు త్వరలో బయటకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. రియల్ వ్యాపారులను టార్గెట్ చేసి భారీగా వసూళ్లకు దిగడంలో వివాదాస్పద కానిస్టేబుల్‌ది కీలక పాత్రగా చెబుతున్నారు. అక్రమ దందాలు చేసే రైస్ మిల్లర్ల నుంచి నెలవారీ మామూళ్లు, పేకాట శిబిరాల నిర్వాహకుల నుంచి వసూళ్లు చేసేవాడనే ఆరోపణలున్నాయి. అన్నీతానై వ్యవహరిస్తూ నల్లగొండ జిల్లాలోని వాణిజ్య కేంద్రమైన పట్టణానికి చెందిన రౌడీషీటర్ ద్వారా ల్యాండ్ సెటిల్‌మెంట్‌కూ పాల్పడ్డాడు. కొంతమంది అధికారులను సైతం భయపెట్టినట్లు తెలి సింది. గుర్రంపోడ్ వద్ద మాజీ పోలీస్ బాస్ బినామీలకు దాదాపు తొమ్మిది ఎకరాల తోటను ఇప్పించడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
నాయకుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
ట్యాపింగ్ కేసులో అరెస్టయి కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ (ఓఎ్‌సడీ) రాధాకిషన్‌రావు వెస్ట్ జోన్ పోలీసులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ పెద్దల గుట్టును విప్పుతున్నట్లు సమాచారం. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు, ఇతర ఉన్నతాధికారులు చెప్పినట్లే చేశామని ఆయన ఒప్పుకోవడంతో కేసులో విస్తుపోయే అంశాలు బయటకొస్తున్నాయి. రాధాకిషన్‌రావు పోలీస్ కస్టడీ మరో 3 రోజులు మిగిలి ఉంది. ఆ తర్వాత కేసుతో ప్రమేయం ఉన్న పలువురు రాజకీయ నాయకుల చుట్టూ ఉచ్చు బిగుసుకోనున్నట్లు తెలిసింది. కాగా, ఎవరెవరు ఎలాంటి పనులు చేయించారు..? దానివల్ల ఎవరు లబ్ధి పొందారు..? తమ టీమ్‌కు ఇచ్చిన టాస్క్‌లు ఏంటి? సేకరించిన డేటాతో చేయించిన ఆపరేషన్స్ ఏమిటి? అందుకోసం ఎలాంటి కసరత్తు చేశారు..? ఇలా అనేక అంశాలపై పూర్తి సమాచారాన్ని రాధాకిషన్‌రావు వెల్లడిస్తున్నట్లు చెబుతున్నారు. వీటిని రికార్డు చేస్తున్న విచారణాధికారులు ఆయన చెప్పిన అధికారులు, నాయకుల పేర్లను లిస్టవుట్ చేస్తున్నట్లు సమాచారం. వారికి నోటీసులిచ్చి విడతల వారీగా విచారించనున్నారు. రాధాకిషన్‌రావు కూలకషంగా వెల్లడించిన వివరాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లతో పాటు నల్లగొండ జిల్లాకు ఒకొక్కరు నాయకత్వం వహించి పని పూర్తి చేశారని తెలిపారు. మరోవైపు ట్యాపింగ్ ఇటీవల చేసింది కాదని, కొంతకాలంగా ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్‌లో కొందరు అధికారులు పథకం ప్రకారం ఈ కుట్ర పన్నారని ఇప్పటికే అరెస్టయిన అఽధికారులు విచారణలో చెప్పారు. ఇందులోభాగంగానే గత ప్రభుత్వ పెద్దలు ఒకే సామాజికవర్గానికి చెందిన ప్రభాకర్‌రావు, వేణుగోపాల్‌రావు, భుజంగరావు, ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావుతో పాటు.. తిరుపతన్న, ఇంకొందరు ఇన్‌స్పెక్టర్లను ఇంటెలిజెన్స్, ఎస్‌ఐబీలోకి తెచ్చినట్లు తేలింది.
Updated Date - Apr 08 , 2024 | 04:30 AM