హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు
ABN, Publish Date - Nov 27 , 2024 | 05:34 AM
‘‘కల్తీ మోమోస్ తిని మహిళ మృతి.. పలువురికి తీవ్ర అస్వస్థత’’.. ‘‘బిర్యానీలో సిగరెట్ పీక’’.. ‘‘ఇడ్లీ చట్నీలో బొద్దింక’’.. ‘‘హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. పలువురు విద్యార్థులకు అస్వస్థత’’.. ఇవీ నిత్యం పత్రికల్లో కనిపించే పతాక శీర్షికలు..! వీటికి తోడు.. శుచీశుభ్రత పాటించని హోటళ్లకు వెళ్లి.. అనారోగ్యాన్ని ‘కొని’తెచ్చుకోవడం సాధారణంగా చూస్తున్న విషయమే..! ఈ ప రిస్థితులపై సీరియ్‌సగా దృష్టి సారించిన
4,366 సంస్థల్లో తనిఖీలు.. 3 వేల నమూనాలకు పరీక్ష.. ఏడాదంతా విస్తృత దాడులు!
శుచి, శుభ్రత పాటించాల్సిందే
ఆహార నాణ్యతపై కఠినంగా వైద్యశాఖ
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘‘కల్తీ మోమోస్ తిని మహిళ మృతి.. పలువురికి తీవ్ర అస్వస్థత’’.. ‘‘బిర్యానీలో సిగరెట్ పీక’’.. ‘‘ఇడ్లీ చట్నీలో బొద్దింక’’.. ‘‘హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. పలువురు విద్యార్థులకు అస్వస్థత’’.. ఇవీ నిత్యం పత్రికల్లో కనిపించే పతాక శీర్షికలు..! వీటికి తోడు.. శుచీశుభ్రత పాటించని హోటళ్లకు వెళ్లి.. అనారోగ్యాన్ని ‘కొని’తెచ్చుకోవడం సాధారణంగా చూస్తున్న విషయమే..! ఈ ప రిస్థితులపై సీరియ్‌సగా దృష్టి సారించిన రాష్ట్రప్రభు త్వం.. ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి, హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, హాస్టళ్లు, ఆస్పత్రులు, కార్యాలయాల్లోని క్యాంటిన్లలో తనిఖీలు చేయిస్తోంది. ఇలా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 4,366 దాడులు నిర్వహించింది. నిబంధనలను పాటించని 556 సంస్థలపై కేసులు నమోదు చేసి, రూ.66లక్షలకు పైగా జరిమానాలను విధించింది. దాడుల్లో భాగంగా సేకరించిన 3,115నమూనాలను పరీక్షించగా.. వాటిల్లో 72 నమూనాల్లో హానికర పదార్థాలున్నట్లు తేల్చింది.
యాజమాన్యం అప్రమత్తం
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాల్లోని హోటళ్ల పరిస్థితి ‘‘పేరు గొప్పు.. ఊరు దిబ్బ’’ అన్న చందంగా ఉంది. ఏం తినాలన్నా.. కనీసం మంచినీళ్లు తాగాలన్నా భయమేసే పరిస్థితి కనిపిస్తోంది. ఏడాది కాలంగా జరుగుతున్న టాస్క్‌ఫోర్స్ దాడుల్లో వాటి బండారం బయటపడుతోంది. రాష్ట్ర ఫుడ్ సేప్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ భారత ఆహార పరిరక్షణ, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ముగ్గురు ఫుడ్‌సేప్టీ అధికారులు, మరికొందరు సభ్యులుంటారు. ఈ బృందం జీహెచ్‌ఎంసీ పరిధిలో దాడులు చేస్తుండగా.. జిల్లాల్లోనూ ఫుడ్‌సేప్టీ అధికారులు తనిఖీలను కొనసాగిస్తున్నారు. జిల్లాల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు స్థానిక వ్యాపారులతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారనే అనుమానాలు ఉన్నచోట.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలను రం గంలోకి దింపుతున్నారు. దీంతో.. హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు అప్రమత్తమవుతూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా తనిఖీలను విస్తృతం చేస్తూ.. ఆహారపదార్థాల నమూనాలను పరీక్షిస్తోంది. నమూనాల్లో తేడాలుంటే.. వెంట నే సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తోంది. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే.. హోటళ్లు, రెస్టారెంట్లను సీజ్ చేస్తోంది. ఆహార కల్తీపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. ఫిర్యాదుల కోసం 9100105795 నంబరును కేటాయించింది. ఎక్స్, ఇన్‌స్టా, ఈ-మెయి ల్ ద్వారా కూడా ఫిర్యాదులకు అవకాశం కల్పిస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పౌరుల కోసం 040- 21111 111 నంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది.
హానికరం.. నకిలీ.. నాసిరకం..!
ప్రమాణాలు లేని ఆహారాన్ని మూడు కేటగిరీలుగా విభజిస్తారు. అవి.. హానికరమైనవి, నకిలీవి, నాసిరకమైనవి. టాస్క్‌ఫోర్స్ తనిఖీల సమయంలో ఏ కేటగిరీ నిర్ధారణ అయినా.. కేసులు తప్పవని ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తోంది. వీటితోపాటు.. హోటళ్లు, రెస్టారెంట్ల లోపల, పరిసరాల్లో శుభ్రత, గడువు చెల్లిన ఆహార ఉత్పత్తుల వినియోగానికీ యాజమాన్యాలు మూల్యం చెల్లించక తప్పదని పేర్కొంటోంది.
ఆహార కల్తీతో తీవ్ర అనారోగ్యం
ప్రస్తుతం మన దేశంలో ఆహార కల్తీ, ఔషధ కల్తీ ఎక్కువగా జరుగుతోంది. తప్పనిసరైతే తప్ప.. వీలైనంత మేరకు బయట తిండిని తగ్గించాలి. ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యతనివ్వాలి. ముఖ్యంగా నెయ్యిలో కలిపే జంతు కొవ్వులతో రక్తహీనత ముప్పు ఉంది. ఈ కల్తీ వల్ల గుండె పరిమాణం పెరుగు తుంది. నూనెల కల్తీతో కంటి జబ్బులు, క్యాన్సర్, గుండెపోటు, కొలెస్ట్రాల్ సమస్య లు ఉత్పన్నమవుతాయి. కారంలో కలిపే ఇటుకపొడి, రంపపుపొట్టుతో పొట్ట సమస్యలు, క్యాన్సర్ ముప్పు ఉంటుంది. కల్తీ ఆహారం వల్ల కాలేయ సమస్యలు, శరీరంలో విషతుల్యత పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పాల అధిక దిగుబడికి గేదెలకు ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్ల వల్ల పిల్లల్లో అనేక సమస్యలు వస్తాయి. ఆడపిల్లలు త్వరగా రజస్వల అవుతారు. మగ పిల్లల్లో ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.
-డాక్టర్ ఎంవీ రావు, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, యశోద ఆస్పత్రి
Updated Date - Nov 27 , 2024 | 05:34 AM