Konda Surekha controversy: రంగంలోకి నటి హేమ.. మంత్రి కొండా సురేఖకు కౌంటర్
ABN, Publish Date - Oct 02 , 2024 | 07:14 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై రాజకీయ ఆరోపణలు గుప్పిస్తూ.. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై రాజకీయ ఆరోపణలు గుప్పిస్తూ.. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. మంత్రి వ్యాఖ్యలను ఇప్పటికే హీరో నాగార్జునతో పాటు ప్రకాశ్ రాజ్ ఖండించగా.. తాజా నటి హేమ కూడా స్పందించింది. మిగతా రంగాల్లో పనిచేసే ఆడవారికి ఎలా అయితే గౌరవం ఇస్తున్నారో.. సినిమా రంగంలో ఉన్న ఆడవారికి కూడా గౌరవం ఇవ్వాలని ఆమె అన్నారు. సినిమా రంగంలో ఉన్న ఆడవారికి కూడా ఆత్మగౌరవం ఉంటుందని వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమలోని మహిళలకు కూడా గౌరవం ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.
భగ్గుమన్న హీరో నాగార్జున
కాగా మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున అభ్యంతరం వ్యక్తం చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు. ‘‘ రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అని నాగార్జున అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
ఖండించిన ప్రకాశ్ రాజ్
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందించాడు. ‘ ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా?’’ అని పేర్కొన్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు.
Updated Date - Oct 02 , 2024 | 07:24 PM