Kumaram Bheem Asifabad: అందని పూర్తి పంట నష్టపరిహారం
ABN, Publish Date - Nov 21 , 2024 | 10:25 PM
చింతలమానేపల్లి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): గడిచిన మూడేళ్లుగా జిల్లా రైతులను వరదలు వెంటాడుతున్నాయి. నది పరివాహక ప్రాంతాల్లోని పంటలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లుతోంది.
- ఇప్పటికే పలు మండలాల్లో రైతుల ఆందోళన
- జిల్లాలో సుమారు మూడువేల ఎకరాల్లో పైగా నష్టం
- పూర్తి నష్టపరిహారం ఇవ్వాలని రైతుల వేడుకోలు
చింతలమానేపల్లి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): గడిచిన మూడేళ్లుగా జిల్లా రైతులను వరదలు వెంటాడుతున్నాయి. నది పరివాహక ప్రాంతాల్లోని పంటలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో ఆగస్టు, సెప్టెంబరులో భారీవర్షాలతో పెద్దవాగు, ప్రాణహిత, పెన్‌గంగా, వార్దా నదులు ఉప్పొంగి పంటలు నీటమునిగాయి. అయిదురోజుల పాటు పంటలు వరదనీటిలోనే ఉండడంతో తీవ్రనష్టం వాటిల్లింది. వరదలతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం మంజూరు చేసింది. దీనికి 33శాతానికి పైగా దెబ్బతిన్న పంటలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ఫలితంగా చాలామంది రైతులకు పరిహారం అందలేదు. నెలరోజులుగా వివిధ మండలాల్లోని బాధిత రైతులు ఆందోళనలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నారు.
రూ.2.69కోట్లు విడుదల..
జిల్లా వ్యాప్తంగా 4.23లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది, మిరప తదితర పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా పత్తి 3.29లక్షల ఎకరాలు ఉండగా, వరి సుమారు 55వేల ఎకరాల్లో ఉంది. ఆగస్టు చివరివారం, సెప్టెంబరు మొదటివారంలో కురిసిన భారీవర్షాలకు నదిపరివాహక ప్రాంతాలతో పాటు చెరువులు, వాగుల సమీపంలోని పంటలు బ్యాక్‌వాటర్‌తో రోజుల తరబడి నీటిలో మునిగి పోయాయి. జిల్లాలో సుమారు మూడువేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధి కారులు అంచనా వేశారు. ప్రభుత్వం 2,692.11ఎకరాలకు 1374మంది రైతులకు మాత్రమే రూ.22,69,22,750 పరిహారం మంజూరు చేసింది. పంటలు నష్టపోయిన వారి వివరాలను వ్యవసాయ శాఖ సర్వేచేసి పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ప్రభుత్వం గత నెలలో నిధులు విడుదల చేయగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. అయితే క్షేత్రస్థాయిలో నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు.
అన్నదాతల ఆందోళనలు..
ప్రాణహిత, పెద్దవాగు ఉప్పొంగడంతో సిర్పూర్ నియోజకవర్గంలో సిర్పూర్(టి), కౌటాల, చింతలమా నేపల్లి, దహెగాం, పెంచికలపేట, బెజ్జూరు మండలాల్లో అత్యధింగా పంటలు దెబ్బతిన్నాయి. ప్రాణహిత వరద తగ్గకపోవడంతో అయిదు రోజులపాటు పంటలు నీటమునిగి ఉన్నాయి. పత్తినీట మునగగా మరోసారి ప్రత్యామ్నాయ పంటలు సాగుచేశారు. చేలలో నిలువచేసిన ఎరువుల బస్తాలు సైతం వరదకు కొట్టుకు పోయాయి. బెజ్జూరు మండలంలో చాలామందికి పరిహారం రాలేదని గతనెలలో రైతులు మండలకేంద్రంలో ఆందోళన చేపట్టారు. దహెగాం మండలం మొట్లగూడ, రావులపల్లి, రాంపూర్ గ్రామాల్లో ప్రాణహితనది వరదలో నష్టపోయిన రైతులు కూడా కాగజ్‌నగర్ ఏడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రైతులు ఆందోళనలు చేసిన సమయంలో ప్రభుత్వానికి నివేదికలు పంపించామని చెబుతూ వ్యవసాయాధికారులు చేతులు దులుపుకొన్నారు. సర్వేను పకడ్బందీగా చేపట్టకపోవడంతో పూర్తిస్థాయిలో పరిహారం మంజూరుకాలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించాలని వేడుకుంటున్నారు.
అయిదు ఎకరాల్లో పంట నష్టం జరిగింది..
- మారేష్, రైతు, కేతిని
వర్షాకాలంలో కురిసిన వర్షాలకు అయిదు ఎకరాల్లో సాగుచేసిన పంట పూర్తిగా మునిగిపోయింది. దీంతో తీవ్రంగా నష్టపోయాను. ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారం నాకు అందలేదు. అధికారులు స్పందించి నష్టపోయిన నాకు పరిహారం అందించాలి. నష్టపోయిన మిగితా రైతాంగాన్ని కూడా ఆదుకోవాలి.
Updated Date - Nov 21 , 2024 | 10:25 PM