Kumaram Bheem Asifabad: గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం
ABN, Publish Date - Nov 01 , 2024 | 11:16 PM
కాగజ్‌నగర్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది..? ఎంతమంది ఈ దందాకు పాల్పడుతున్నారనే కోణంలో జిల్లా పోలీసులు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి కేసులు నమోదు చేస్తున్నారు.
-మహారాష్ట్ర కేంద్రంగా సరఫరా
-రంగంలోకి దిగిన పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు
-మాహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలపై నిఘా
-ఎవరినీ ఊపేక్షించం: రామానుజం, డీఎస్పీ, కాగజ్‌నగర్
కాగజ్‌నగర్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది..? ఎంతమంది ఈ దందాకు పాల్పడుతున్నారనే కోణంలో జిల్లా పోలీసులు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో కూడా జిల్లాలో గంజాయి సాగు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతున్నారు. గురువారం వాంకిడి చెక్‌పోస్టు సమీపంలో సినిమా తరహాలో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇందులో 290కేజీలు పట్టుబడగా, వీటి విలువ రూ.72.80లక్షల ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో పట్టుకోవటం జిల్లాలో ఇదే మొదటిసారి కావటం వివేశం. ఈ సంఘటన ఒక్కసారిగా సంచలనం రేపింది. నెలరోజులుగా వీరిపై దృష్టిసారించి జిల్లా పోలీసు యంత్రాంగం ఈ కేసును ఛేదించి సఫలీకృతులయ్యారు.
మహారాష్ట్ర కేంద్రంగా దందా..
జిల్లాను ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని పలుజిల్లాల నుంచి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ నియోజకవర్గాల్లో తరలించి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. గంజాయి మత్తుకు యువత బానిస అవుతుండటంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి గంజాయి ఆనవాళ్లు లేకుండా కఠినచర్యలు తీసుకుంటోంది. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. పక్కాగా సమాచారం తీసుకొని టాస్క్‌ఫోర్సు అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. కాగజ్‌నగర్ పట్టణ, మండల ప్రాంతాల్లో గంజాయిని హుక్కాలో వినియోగిస్తున్నట్టు సమాచారం రావటంతో పోలీసులు మూడునెలల క్రితం దాడులు చేసి పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికీ సర్‌సిల్క్ ఏరియా, కోసిని, ఎరోడ్రం ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ప్రాంతంలో గంజాయి తాగుతున్నట్టు సమాచారం వస్తుండటంతో పోలీసులు పక్కా స్కెచ్ వేసి పట్టేస్తున్నారు.
గంజాయితో అనర్థమే..
గంజాయి తీసుకోవటంతో స్కిజోఫ్రేనియా వంటి తీవ్రతమైన మానసిక రుగ్మతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. గంజాయి తీసుకునే యువకుల మెదడు అభివృద్ధి పరంగా పాడవటం, జ్ఙాపకశక్తి, ఇతర సామార్థ్యాలు పూర్తిగా దెబ్బతింటాయని వైద్యులు సూచిస్తున్నారు. వీటితో పాటు ప్రధానంగా గంజాయి పొగ పీల్చటం వల్ల శోధం, దగ్గు, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నవుతున్నట్టు వివరిస్తున్నారు.
ఎవరినీ ఊపేక్షించేది లేదు..
-రామానుజం, డీఎస్పీ, కాగజ్‌నగర్
గంజాయి విషయంలో ఎవరినీ ఊపేక్షించేది లేదు. ఇప్పటికే గంజాయి సరఫరా అయ్యే కేంద్రాలపై గట్టి నిఘా పెట్టాం. తప్పకుండా కేసులు నమోదు చేస్తాం. ఎవరూ గంజాయి జోలికి పోరాదు. ఈ దందాను ఎవరూ చేయరాదు. ఎలాంటి సమాచారం ఉన్న పోలీసుల దృష్టికి తీసుకరావాలి. తప్పకుండా కేసులు నమోదు చేస్తాం.
290కిలోల గంజాయి పట్టివేత
వాంకిడి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): వాంకిడి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద గురువారం సాయంత్రం భారీగా గంజాయి పట్టుకున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. వాంకిడి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెళ్లడించారు. రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న ఎంపీ06 హెచ్‌సీ 1339 నంబరు గల కంటైనర్ లారీలో 290కిలోల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా వాంకిడి అంతరాష్ట్ర చెక్ పోస్టువద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్నసమయంలో పట్టుకున్నామన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ బల్వీర్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మహారాష్ట్రకు చెందిన అరబింద్ అనేవ్యక్తి తనను గంజాయి సరఫరా కోసం రాజమండ్రికి పంపించాడన్నారు. అక్కడినుంచి గంజాయిని లోడ్‌చేసుకుని వస్తున్నానన్నాడు. కంటైనర్ లారీ నుంచి 2కేజీలు బరువుగల 145గంజాయి ప్యాకెట్లు మొత్తం 290కిలోలు, కంటైనర్ లారీ, ఒకసెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.72,50,000వేలు ఉంటుందన్నారు. గంజాయి సరఫరాలో ముఖ్యనిందితుడైన అరబింద్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డిఎస్పీ కరుణాకర్, వాంకిడి సీఐ సత్యనారాయణ, స్పెషల్‌బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాణాప్రతాప్, ఆసిఫాబాద్ సీఐ రవీందర్, వాంకిడి ఎస్సై ప్రశాంత్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Nov 01 , 2024 | 11:16 PM