Kumaram Bheem Asifabad: సర్‌సిల్క్ భూముల్లో కబ్జా దందా
ABN, Publish Date - Nov 17 , 2024 | 10:30 PM
కాగజ్‌నగర్ టౌన్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణంలోని సర్‌సిల్క్ మిల్లు భూముల్లో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి.
-పట్టించుకోని అధికారులు
-టెండరు పొందిన భూములనూ వదలని కబ్జాదారులు
కాగజ్‌నగర్ టౌన్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణంలోని సర్‌సిల్క్ మిల్లు భూముల్లో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో రాత్రికి రాత్రే కబ్జాలు చేస్తున్నారు. అనంతరం చిన్నపాటి రేకులు వేసి స్థలానికి ఇంటి నెంబరు, కరెంటు మీటరు తీసుకొచ్చి పక్కాగా నిర్మిస్తున్నారు. సర్‌సిల్క్ స్థలాల్లో భవంతులు వెలుస్తున్నా కూడా అధికారులు ఏ ఒక్కరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవంటే పరిస్థితి ఎలా ఉండో ఇట్టే ఊహించుకోవచ్చు. సర్‌సిల్క్ మిల్లు మూతబడిన తర్వాత కార్మికులకు రావాల్సిన బకాయిల విషయంలో హైకోర్టులో 2008లో కేసు వేయటంతో 2009లో లిక్విడేటర్‌ను నియమించింది. ఈ భూములను అమ్మి కార్మికులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇందులో రెండు బిట్లుగా విభజించి వేలం నిర్వహించగా మొత్తం 11మంది బిడ్డర్లు పాల్గొన్నారు. ఇందులో ఇద్దరికి మాత్రమే భూముల కొనుగోలుకు సంబంధించి సక్సెషన్ ఇవ్వగా హన్మకొండకు చెందిన బత్తిని వెంకట నారాయణ, కాగజ్‌నగర్‌కు చెందిన ఆనంద్ మోడి అనే ఇద్దరికి ఒక పార్టులో భూములను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అయితే భూముల కొనుగోలు జరిగి రిజిస్ట్రేషన్ అయినా ఇప్పటి వరకు ఆ భూములను స్వాధీనం చేసి ఇవ్వకపోవటంతో చాలాచోట్ల అక్రమణలు జరిగాయి. మరికొన్ని చోట్ల అంతకుముందే శాశ్వత నిర్మాణాలు వెలిశాయి. వాటిని తొలగించి తమకు భూములను స్వాధీనం చేయాలంటూ కొనుగోలుదారుడు అధికార యంత్రాంగాన్ని ఎన్నిసార్లు ఆశ్రయించినప్పటికీ కూడా ఫలితం లేని పరిస్థితి నెలకొంది. డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన భూముల్లో కూడా యథేచ్ఛగా అక్రమ కట్టాడాలు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో మరికొంత భూమి అణ్యాక్రాంతం అయిపోవటంతో కొనుగోలు దారుడు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఇదీలా ఉంటే ఇదే ఫ్యాక్టరీలో కొనుగోలు చేసిన మరోబిడ్డర్ ఆనంద్ మోడికి మాత్రం 14ఎకరాల స్థలాన్ని మ్యూటేషన్ చేసి పట్టాలు జారీచేశారు. దీన్ని ప్రశ్నిస్తూ మొదటి కొనుగోలుదారుడు లీగల్‌గా తన హక్కులను హరించేలా వ్యవహరిస్తుండటంతో విసిగి వేసారి తాజాగా కోర్టును ఆశ్రయించటంతో కోర్టు జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీవో, తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి, ఎంపీఈవో, గ్రామకార్యదర్శి, మున్సిపల్ కమిషనర్‌తోపాటు రూరల్ పోలీసులకు కలుపుకొని మొత్తం 16మందికి నోటీసులను పంపించారు. లిక్విడేటర్ భూమిని విక్రయించిన తర్వాత కొనుగోలుదారు హక్కులను విస్మరిస్తూ స్థానిక మున్సిపల్ యంత్రాంగం రిజిస్టర్డ్ స్థలంలో మిషన్‌భగీరథ రిజర్వాయర్ నిర్మించటం కూడా వివాదస్పదమైంది. దీనిపై అప్పట్లోనే బాధితుడు మున్సిపాల్టీపై కోర్టు కేసు వేయగా అది కొనసాగుతోంది. ఈ వివాదం ఉండగానే మున్సిపాల్టీ పరిధిలోకి వచ్చే ఖాళీ స్థలాలను ఆక్రమించి ఇండ్లు నిర్మించుకుంటున్నారు.
టెండరు భూములకే దిక్కు లేని పరిస్థితి..
సర్‌సిల్క్ మిల్లు మూతబడిన తర్వాత కార్మికులకు బకాయిలు చెల్లించటం కోసం భూములను విక్రయించాలని నిర్ణయించిన దరిమిలా ఈ మిల్లు పరిధిలోని మొత్తం 455ఎకరాల స్థలాన్ని విక్రయించేందుకు 2009లో లిక్విడేటర్‌ను నియమించారు. అప్పట్లో ఈవేలం పాటల్లో మొత్తం 11మంది పాల్గొనగా, ఇద్దరు కొనుగోలు చేశారు. ఇందులో వెంకటనారాయణ అనే బిడ్డర్ ఒక్కరే 186ఎకరాల భూమిని రూ.3కోట్లతో వేలంపాడి దక్కించుకున్నారు. అప్పట్లో భూమి ధరకు ఎకరాకు మూల విలువగా రూ.50వేలుగా నిర్ణయించగా, మూడురేట్లు వేలం పాటగా ఖరారు చేశారు. ఇందులో అత్యధికంగా రూ.1.55లక్షల చొప్పున చెల్లించిన వెంకటనారాయణకు 186ఎకరాలు హైకోర్టు సమక్షంలోనే సెటిల్‌మెంటు చేశారు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా 2017లో పూర్తి అయింది. అయితే ఈ స్థలాన్ని మ్యూటేషన్ చేయించుకునేందుకు కొనుగోలుదారుడు ప్రయత్నాలు ప్రారంభించగా అసలు కథ ఇక్కడే మొదలుఅయింది. ప్రస్తుతం భూముల ధర భారీగా పెరగటంతో రాజకీయ నేతల కన్ను దీనిపై పడిందన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంతమందిని ప్రేరేపించి ఆక్రమణలు చేయించా రన్నది కొనుగోలుదారుడి వాదన. వాటిని ఖాళీచేయించి తనభూమిని మ్యూటేషన్ చేసి స్వాధీనం చేయాలని కొనుగోలుదారుడు అటు పోలీసులను, ఇటు అధికారులను పలుమార్లు వేడుకున్నా స్పందన కరువైంది. దాంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా కొనుగోలుదారుడికి అనుకూలంగా ఆదేశాలు జారీచేసింది. అయితే కోర్టు ఉత్తర్వులను ఇప్పటివరకు అమలు చేయకపోవటంతో బాధితుడు మరోసారి కోర్టును ఆశ్రయించాడు.
Updated Date - Nov 17 , 2024 | 10:30 PM