Kumaram Bheem Asifabad: పులి పంజా..
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:07 PM
కాగజ్‌నగర్/కాగజ్‌నగర్ టౌన్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెద్దపులుల దాడులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరుసగా పశువులు, మనుషుల ప్రాణాలు పోతున్నాయి.
- పులి దాడిలో మహిళ మృతి
- భయం గుప్పిట్లో గ్రామాలు
- పత్తి ఏరేందుకు జంకుతున్న కూలీలు
- వరుస దాడుల భీతిల్లుతున్న జనం
కాగజ్‌నగర్/కాగజ్‌నగర్ టౌన్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెద్దపులుల దాడులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరుసగా పశువులు, మనుషుల ప్రాణాలు పోతున్నాయి. జిల్లాలో నిన్నటివరకు వాంకిడిలో పులి కన్పించినట్టు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా కాగజ్‌నగర్ మండలంలోని నజ్రూల్‌నగర్‌లో శుక్రవారం ఉదయం చేనులో పత్తి ఏరుతున్న మోహర్లే లక్ష్మి(22)పై పులిదాడి చేసింది. గమనించిన తోటి కూలీలు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన మోహిర్లె లక్ష్మి ఎప్పటిలాగే తోటి మహిళలతో కలిసి పత్తి ఏరడానికి వెళ్లింది. మహిళలంతా సంబరంగా చేనులోకి దిగి పత్తి ఏరుతున్న కొద్దిసేటికే అప్పటికే మాటు వేసి ఉన్న పులి లక్ష్మిపై ఒక్కసారిగా దాడి చేసింది. గమనించిన తోటి కూలీలు కేకలు వేయటంతో పులి లక్ష్మిని వదిలేసి పొలాల్లోకి పారిపోయింది. ఈ విషయాన్ని గ్రామస్థులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం లక్షిని వెంటనే చికిత్స నిమిత్తం కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది.
మూడు రోజుల క్రితం పెంచికలపేటలో కనిపించిన పులి..
మూడు రోజుల క్రితం పెంచికల్‌పేట మండలం కొండపల్లి, జైహింద్‌పూర్ గ్రామాల్లో పులి కన్పించినట్టు డప్పు చాటింపు కూడా చేశారు. బెజ్జూరు, పెంచికల్‌పేట మండలాల్లో పులి సంచారం ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. కాగా, శుక్రవారం కాగజ్‌నగర్ మండలం నజ్రూల్‌నగర్ క్యాంపు 6, 11 మధ్యలో గల పత్తి పొలంలో పని చేస్తున్న లక్ష్మి(22) అనే మహిళపై దాడి చేసి చంపేసింది. 2020 సంవత్సరంలో దహెగాం చేపల వేటకు వెళ్లిన విగ్నేష్(23)ను దాడి చంపేసిన సంఘటన ఒక్కసారిగా సంచలనం రేకెత్తింది. ఈ సంఘటన మరువక ముందే మళ్లీ పది రోజుల్లోనే నవంబరు 29న పెంచికల్‌పేట కొండపల్లిలో పత్తి ఏరుతున్న పసుల నిర్మలపై దాడి చేసి చంపేసింది. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మళ్లీ పులిదాడి చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అటవీశాఖ అధికారుల తీరుపై మండిపాటు..
అటవీశాఖ అధికారులు ఆశించిన మేర గ్రామాల్లో అవగాహన కల్పించక పోవటం, ట్రాకర్స్ పక్కాగా సమాచారం చేయక పోవటం కారణాలతోనే ఈ దాడులు జరుగుతున్నాయని గ్రామస్థులు అటవీశాఖ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. సంతానోత్పతి కోసం మగ పులి ఆడపులి కోసం వస్తున్నట్టు, ఇలాంటి పరిస్థితుల్లో ఎదురువుతున్న వారిపై దాడి చేస్తోందని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. శుక్రవారం లక్ష్మిపై దాడి చేసిన తర్వాత ఏకంగా పక్కనే పక్కనే ఉన్న 9వ నెంబరు క్యాంపులో ఉన్న ఆవుపై దాడిచేసి చంపేసింది. ఒకేరోజు పులి విరుచుక పడటం ఇప్పుడు అందరిలోను భయాందోళన రేకిస్తోంది. పత్తి ఏరేందుకు తాము వెళ్లమని కూలీలు ఖారఖండిగా చెప్పుతున్నారు. కాగా అటవీశాఖ అధికారులు కూడా పులి దాడులు చేసినప్పుడే హడావుడి సృష్టించి ఆపై వదిలేస్తున్నారు. శుక్రవారం కాగజ్‌నగర్ మండలం నజ్రూల్‌నగర్‌కు పులి ఎక్కడి నుంచి వచ్చింది..? మహారాష్ట్ర నుంచి వస్తే ఈ ప్రాంతానికి వచ్చే సమయంలో పులి కదలికలపై ఎందుకు ట్రాక్ చేయలేకపోయారు...? పులిఉన్న ప్రాంతం వైపు కూలీలను పోనీయకుండా ఎందుకు తగిన చర్యలు చేపట్టలేదు..? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా చర్చకు తెరలేపుతున్నాయి.
మృతదేహంతో ధర్నా..
అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో నిండుప్రాణం పోయిందని గ్రామస్థులు, స్థానిక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు, జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పాల్వాయి సుధాకర్ రావు అటవీశాఖ కార్యాలయం ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. తమకు వెంటనే న్యాయం చేయాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా లక్ష్మి కుటుంబానికి రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదు ఎకరాల భూమి, ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పట్టుబట్టారు. ధర్నా విషయం తెలుసుకున్న పులుల సంరక్షణాధికారి శాంతారాం, జిల్లాఅటవీశాఖ అధి కారి నీరజ్‌కుమార్ టిబ్రేవాల్, ఎస్పీ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ టిబ్రేవాల్ లక్ష్మి కుటుంబసభ్యుల డిమాండ్లు నెరవేరుస్తామన్నారు. వారు కోరిన విధంగా రూ.20లక్షలు ఇస్తామని, ఇంటిలో ఒకరికి ఉద్యోగం. ఐదెకరాల భూమి ఇస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. లక్ష్మికి ఏడాదిన్నర క్రితమే కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన వాసుదేవ్‌తో వివాహం జరిగింది.
కళ్లముందే చంపేసింది..
-పోశక్క, గన్నారం
ఉదయం పూట పత్తి ఏరేందుకు నజ్రూల్‌నగర్‌కు వెళ్లాం. పత్తి దూర దూరంగా ఏరుతున్నాం. లక్ష్మి వంగి పత్తి ఏరుతుండగా వెనుకనుంచి ఒక్కసారి పులి పంజా వేసి మెడను పట్టుకుంది. అంతే అప్పటికే అంతా పులి పులి అంటూ గట్టిగా కేకలు వేశాం. మా కేకలు విని పులి పొలంలోకి పారి పోయింది. లక్ష్మిని ఎత్తుకొని వెంటనే కొద్దిదూరం తెచ్చాం. కొన ఊపిరితో ఉన్న లక్ష్మి కళ్లముందే చని పోయింది.
పది నిమిషాల్లోనే జరిగిపోయింది..
-రోజా, గన్నారం
పత్తి ఏరేందుకు ఉదయం పూటనే నజ్రూల్‌నగర్ క్యాంపునకు వచ్చాం. పొలంలో పత్తి ఏరుతుండగా పది నిమిషాల్లోనే పులి వెనుక నుంచి వచ్చి తమతో వచ్చిన లక్ష్మి మెడ పట్టింది. మేమంతా గట్టిగా కేకలు వేశాం. దీంతో పులి లక్ష్మిని వదిలి అడవిలోకి పోయింది. భయపడ్డాం. లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. అధిక రక్తస్రావం అయింది. వెంటనే తాము తెంపిన పత్తిని రక్తం కారకుండా పెట్టినప్పటికీ ప్రాణం దక్కలేదు. ఇప్పుడు పత్తి ఏరాలంటే భయం వేస్తోంది.
Updated Date - Nov 29 , 2024 | 11:07 PM