ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మానేరుపై మరో వంతెన..

ABN, Publish Date - Oct 21 , 2024 | 01:45 AM

మానేరుపై మరో వంతెన నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరనున్నది. ఓదెల మండలం రూప్‌నారాయణపేట వద్ద మానేరుపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం 80కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈనెల 18వ తేదీన జీవో ఆర్‌టీ నంబర్‌ 801 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.

రూప్‌నారాయణపేట వద్ద మానేరుపై వంతెన నిర్మించనున్న ప్రాంతం

- రూప్‌నారాయణపేట వద్ద చేపట్టనున్న నిర్మాణం

- రూ. 80 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

- తగ్గనున్న 15 కిలోమీటర్ల వరకు దూర భారం

- నెరవేరనున్న రెండు దశాబ్దాల నాటి కల

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మానేరుపై మరో వంతెన నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరనున్నది. ఓదెల మండలం రూప్‌నారాయణపేట వద్ద మానేరుపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం 80కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈనెల 18వ తేదీన జీవో ఆర్‌టీ నంబర్‌ 801 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 15 కిలోమీటర్ల దూర భారం తగ్గనున్నది. ఇప్పటి వరకు మానేరు నదిపై ఐదు వంతెనలు ఉండగా, ఈ వంతెన ఆరవది. జిల్లాలోని ఓదెల మండలంలో 22 గ్రామపంచాయతీలు ఉండగా, రూప్‌నారాయణ పేట వద్ద నిర్మించనున్న వంతెన 18 గ్రామాల ప్రజలకు ప్రయోజనకరంగా మారనున్నది. అలాగే పెద్దపల్లి నుంచి జమ్మికుంటకు వెళ్లేందుకు పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్‌ తదితర ప్రాంతాల ప్రజలకు దూర భారం తప్పనున్నది. ఓదెల మండల వాసులు ప్రస్తుతం జమ్మికుంటకు వెళ్లేందుకు పొత్కపల్లి, షానగొండ, ఇందుర్తి, బాయమ్మపల్లి, గుంపుల మీదుగా మానేరు వంతెన మీదుగా కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల, గండ్రపల్లి, నాగంపేట్‌ మీదుగా జమ్మికుంటకు వెళ్లాల్సి వస్తున్నది. ఇది ఓదెల నుంచి 25 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. రూప్‌నారాయణపేట వద్ద మానేరుపై వంతెన నిర్మిస్తే అవతలి ఒడ్డున కల్లుపల్లె, విలాసాగర్‌ మీదుగా నేరుగా జమ్మికుంటకు వెళ్లవచ్చు. దీంతో 15 కిలోమీటర్ల దూర భారం తగ్గడంతో పాటు సమయం, పెట్రోల్‌, డీజిల్‌ ఆదా కానున్నది. ఓదెల, జమ్మికుంట, హుజూరాబాద్‌, హన్మకొండ, వరంగల్‌కు మరింత కనెక్టివిటీ పెరగనున్నది. 1990కి పూర్వం ఓదెల నుంచి జమ్మికుంటకు వెళ్లాంటే కరీంనగర్‌ మీదుగా వెళ్లాల్సి వచ్చేది. లేదంటే రైలులో వెళుతుంటారు. గుంపుల వద్ద మానేరు వంతెన నిర్మాణం అయిన తర్వాత జమ్మికుంట, వరంగల్‌కు రాకపోకలు సులువుగా మారాయి. ఆ తదనంతరం 1999 నుంచి రూప్‌నారాయణపేట వద్ద మానేరుపై మరో వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజల నుంచి డిమాండ్‌ రాగా కార్యరూపం దాల్చలేదు.

ఫ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు..

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఉద్యమ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మానేరు నదిపై 3 కొత్త వంతెనల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్ల వద్ద ఒక వంతెన, ముత్తారం మండలం ఓడేడు వద్ద ఒక వంతెన, ఖమ్మంపల్లి వద్ద ఒక వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఇందులో నీరుకుళ్ల వంతెన నిర్మాణం పూర్తయినప్పటికీ, లారీలు,. బస్సులు, ఇతర పెద్ద వాహనాలు వెళ్లేందుకు ఇరువైపులా అప్రోచ్‌ రోడ్లు నిర్మించకపోవడంతో ఆ వంతెన పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఖమ్మంపల్లి వంతెన పూర్తికాగా, గత ఏడాది దానిని అధికారికంగా ఆరంభించారు. ఓడేడు వంతెనకు సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్‌ పిల్లర్లు నిర్మించి, కొన్నింటిపై గెడ్డర్లు వేసి వదిలిపెట్టారు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు గెడ్డర్లు కింద పడడం గమనార్హం. గత ఏడాది నవంబర్‌ నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూప్‌నారాయణపేట వద్ద మరో వంతెన నిర్మించాలని ప్రజల నుంచి డిమాండ్‌ వచ్చింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన చింతకుంట విజయరమణారావు తాను గెలిస్తే వంతెన నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆయన గెలుపొందడంతో పాటు పార్టీ అధికారంలోకి రావడంతో ఐదు మాసాల నుంచి వంతెన నిర్మాణానికి నిధుల మంజూరు కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి వినతిపత్రాలు అందజేసి, వారిపై ఒత్తిడి తీసుకు వచ్చారు. అది ఫలించి ఈనెల 18న వంతెన నిర్మాణానికి 80 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో ఓదెల మండల ప్రజలే గాకుండా పెద్దపల్లి, హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఫ రెండు దశాబ్దాల కల నెరవేరనున్నది..

- చింతకుంట విజయరమణారావు, పెద్దపల్లి ఎమ్మెల్యే

ఓదెల మండలం రూప్‌నారాయణపేట వద్ద మానేరుపై వంతెన నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల రెండు దశాబ్దాల కల నెరవేరనున్నది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మానేరుపై మరో వంతెన నిర్మాణం కోసం సీఎం, మంత్రిపై ఒత్తిడి తీసుకరావడం వల్ల రూ.80 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే వంతెన నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించనున్నారు. టెండర్లు పూర్తికాగానే పనులు ప్రారంభం కానున్నాయి. రెండేళ్లలో వంతెన అందుబాటులోకి రానున్నది.

Updated Date - Oct 21 , 2024 | 01:46 AM