భరోసా ఏదీ?
ABN, Publish Date - Nov 11 , 2024 | 01:06 AM
సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినా కార్మికుల్లో భరోసా నింపలేకపోతోంది. ప్రభుత్వ ఆర్డర్లు లేక ఉపాధి కరువై అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఆందోళనకు గురవు తున్నారు.
- చితుకుతున్న మరమగ్గాల నేతన్న బతుకులు
- ధీమా ఇవ్వని హామీలు
- జిల్లాలో 8 నెలల్లో 11 మంది కార్మికుల బలవన్మరణం
- స్వశక్తి చీరల ఆర్డర్లకు ఎదురు చూపులు
- సిరిసిల్లలో తిరగబడిన నేత బతుకు చిత్రం
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినా కార్మికుల్లో భరోసా నింపలేకపోతోంది. ప్రభుత్వ ఆర్డర్లు లేక ఉపాధి కరువై అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఆందోళనకు గురవు తున్నారు. అప్పులు తీర్చలేక కొంతమంది నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంటి పెద్ద బలవ న్మరణం చెందితే చిన్నపిల్లలతో కాలం వెల్లదీస్తున్న మహిళల పరిస్థితి దయనీయం. దంపతులు ఆత్మహత్య చేసుకొని పిల్లలను అనాఽథలుగా వదిలేస్తున్న సంఘ టనలు కలిచివేస్తున్నాయి. జిల్లాలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం హామీలకే పరిమితమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను నమ్ముకొని షోలాపూర్ నుంచి వచ్చిన బైరి అమర్, వసంత దంపతులు వస్త్ర పరిశ్రమలో ఉపాధిని వెతుక్కునే ప్రయత్నం చేశారు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులతో మరమగ్గాలను ఏర్పాటు చేసుకొని బెడ్ షీట్లు, న్యాప్‌కిన్స్ తయారు చేయడంతోపాటు మరికొంత మంది వద్ద మరమగ్గాలపై బెడ్‌షీట్లు తయారు చేయించారు. కానీ వస్త్రపరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లడంతో అప్పులు పెరిగిపోయి దంపతులు ఇద్దరు శనివారం రాత్రి బలవన్మరణం పొందారు. వారి ముగ్గురు పిల్లలు లహారి, శ్రీవల్లి, దీక్షిత్ తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు. నేతన్నల ఆత్మహత్యలు ఎనిమిది నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో స్వశక్తి మహిళలకు చీరలు అందించే దిశగా చర్యలు చేపట్టినా ఇప్పటి వరకు ఆర్డర్లు రాలేదు. మరమగ్గాలు పూర్తి స్థాయిలో నడవని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లోనే ఉపాధిని కోల్పోయిన కార్మికులు తడుక శ్రీనివాస్, సిరిపురం లక్ష్మీనారాయణ, అంకారపు మల్లేశం, అడిచెర్ల సాయి, ఆడెపు సంపత్, ఇలా వరుసగా 11 మందికిపైగా కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్డర్ల ప్రక్రియలో జరుగుతున్న జాప్యం, కదలని మరమగ్గం ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటుదోననే ఆందోళన కార్మిక కుటుంబాలను వెంటాడుతోంది.
నేతన్నలకు మంచి రోజులు వచ్చేనా?
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30 వేల 352 మరమగ్గాలపై నిరంతరం వస్త్ర ఉత్పత్తులు జరిగేవి. గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్, పర్వదినాల సందర్భంగా అందించే దుస్తులతోపాటు ప్రభుత్వ సంస్థలకు అవసరమయ్యే బ్టట ఉత్పత్తుల ఆర్డర్లు వచ్చేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత బతుకమ్మ చీరలను నాణ్యత లేదనే కారణంగా వాటి ఆర్డర్లను నిలిపివేసింది. ఈ పరిస్థితుల్లో మరమగ్గాలు మూతపడ్డాయి. సంక్షోభాన్ని తట్టుకోలేక కొందరు మరమగ్గాలను అమ్ముకున్నారు. పవర్‌లూం ఆసాములు సంక్షోభంలో కూరుకుపోయారు. ఉపాధి కోసం కార్మికులు రోడ్డునెక్కి ఆందోళనలు చేపట్టారు. ఫలితంగా ప్రభుత్వం ఆలోచనలో పడింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రావాల్సిన బకాయిల్లో దాదాపు రూ.200 కోట్ల వరకు విడుదల చేశారు. విద్యార్థులకు యూనిఫాంకు సంబంధించిన బట్ట ఉత్పత్తుల ఆర్డర్లను ఇచ్చారు. కొద్ది రోజులే ఉపాధి లభిచింది. చేతినిండా పనికోసం బతుకమ్మ చీరల తరహాలోనే నాణ్యమైన చీరలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇందులో మార్పులు చేస్తూ స్వశక్తి మహిళలకు సంవత్సరానికి రెండు చీరల చొప్పున 1.30 కోట్ల చీరలు అందించడానికి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన డిజైన్లు, ఖరారు కావడంలో జాప్యం, ఆర్డర్లు ఇవ్వకపోవడంతో సిరిసిల్ల నేత కార్మికులకు పూర్తి స్థాయిలో పనులు దొరకని పరిస్థితి ఏర్పడింది. వస్త్ర పరిశ్రమను ఆదుకునే దిశగా విద్యుత్ సమస్యను కూడా పరిష్కరించారు. పది హెచ్‌పీల వరకు ఉన్న విద్యుత్ రాయితీని 25 హెచ్‌పీల వరకు పెంచారు. దీంతో పరిశ్రమకు 50 శాతం రాయితీ లభించడం కొంత ఊరటను ఇచ్చింది. కానీ పనులు లేక కార్మిక కుటుంబాలు మాత్రం పస్తులతో గడిపే పరిస్థితులు ఉన్నాయి. గతంలో సంక్షోభం సమయంలో నేత కార్మికులు వందల సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటనలు ఉన్నాయి. వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సంక్షోభం నేపథ్యంలో కార్మిక సంఘాలు వస్త్ర పారిశ్రామికులు చేస్తున్న ఆందోళన ఫలితంగా ప్రభుత్వం కంటితుడుపు హామీలతోనే కాలం వెల్లదీస్తోందనే విమర్శలు ఉన్నాయి. సంక్షోభం నివారణ చర్యలు మొదలై మరణ మృదంగం ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని ఆందోళనలో నేత కుటుంబాలు కాలం వెల్లదీస్తున్నాయి.
Updated Date - Nov 11 , 2024 | 01:06 AM