భూ యజమానితోపాటు కౌలురైతుకూ భరోసా
ABN, Publish Date - Apr 29 , 2024 | 05:41 AM
కౌలు రైతుతోపాటు ఆ భూమి యజమానికీ రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ఎవరికి ఇవ్వాల్సింది వారికి వేర్వేరుగా ఇస్తాం
గ్రామసభల ద్వారా కౌలురైతులను గుర్తిస్తాం
5 ఎకరాలకుపైగా భూమి 4లక్షల కుటుంబాలకే
92 శాతం మంది రైతులు 3 ఎకరాలలోపువారే
ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేసేవారిని
50 లక్షల మంది యువత చూసుకుంటారు
క్లీన్ ఇమేజ్ ఉన్నవారినే పార్టీలో చేర్చుకుంటున్నాం
రిజర్వేషన్లు ఎత్తివేయడమే బీజేపీ కోర్ అజెండా
ఎడ్యుకేషన్ పాలసీపై కమిషన్ వేస్తాం: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): కౌలు రైతుతోపాటు ఆ భూమి యజమానికీ రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎవరికి ఇవ్వాల్సింది వారికి వేర్వేరుగా ఇస్తామని చెప్పారు. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఎగ్గొట్టేది లేదని స్పష్టం చేశారు. గ్రామసభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తిస్తామని, ఆయా గ్రామాల్లో కౌలు రైతుల జాబితాలను పంచాయతీల్లో పెట్టి.. అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ ప్రక్రియనంతా పారదర్శకంగా చేస్తామని, ఇందుకు సంబంధించిన విధివిధానాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పెడతానని అన్నారు. ఆదివారం ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో 92 శాతం మంది రైతులు 3 ఎకరాల లోపు భూమి ఉన్నవారేనని సీఎం చెప్పారు. ఐదెకరాల పైబడి భూమి ఉన్నది 4 లక్షల కుటుంబాలకేనన్నారు. నాలుగేళ్లపాటు అందరూ కలిసి కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, కేసీఆర్ చేసిన కష్టానికి వంద తరాలకు సరిపోయేంత కూలి ఆయనకు గిట్టుబాటైందని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు జాతిపిత కేసీఆర్ కాదని, ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్‌ఎస్, బీజేపీ కుట్ర చేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది యువత వారి భ్రమలను తొలగింపజేస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు కూడా కాకముందే కూలగొడతామని బయలు దేరారని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ నుంచి కొందరు వచ్చి తమతో కలిసి నడుస్తామని చెప్పారని వెల్లడించారు. అయితే క్లీన్ ఇమేజ్ ఉన్నవారిని, పద్ధతి గలవారినే కాంగ్రె్‌సలోకి తీసుకుంటున్నామని చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలన్నదానిపై తనకు స్పష్టత ఉందన్నారు. రిజర్వేషన్లు ఎత్తివేయడమనేదే బీజేపీ కోర్ ఎజెండా అని రేవంత్ పునరుద్ఘాటించారు. తాము రాష్ట్ర ఆదాయాన్ని పెంచి.. ప్రజలకు పంచుతామని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తే ఆదాయం, ఉపాధి పెరుగుతాయన్నారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిషన్ వేస్తామని చెప్పారు. ఇక సచివాలయం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి దండ వేయకపోవడంపై సీఎం స్పందిస్తూ.. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఏది చేసినా సీఎస్, డీజీపీలే చేయాలని అన్నారు. సీఎస్ ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసినందున తాము అక్కడికి వెళ్లి దండ వేశామని తెలిపారు. శ్రీరామనవమి రోజు భద్రాచలంలో పట్టువస్త్రాలు కూడా సీఎస్సే సమర్పించారని గుర్తు చేశారు.
Updated Date - Apr 29 , 2024 | 05:41 AM