CM Revanth Reddy : బై బై మోదీ!
ABN, Publish Date - May 07 , 2024 | 06:05 AM
‘బీజేపోళ్లు మోదీ గ్యారంటీ అని అంటున్నారు కానీ, మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. మోదీ ఇంటికిపోతున్నాడు. బై బై మోదీ’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య భారత్‌లో ఉందని, 125
బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆయన్ను గద్దె దించనున్నారు
ఆయన పదేళ్ల పాలనలో పాకిస్థాన్,
బంగ్లాదేశ్ కన్నా భారత్ అధ్వానం
బీఆర్‌ఎస్ సచ్చినపాము..
దాని గురించి మాట్లాడుడే దండగ
ఈటల, కేసీఆర్ బొమ్మా బొరుసులు
పంపకాల్లో తేడాలొచ్చి విడిపోయారు
హైదరాబాద్‌లో రోడ్‌షోల్లో రేవంత్
రైతుభరోసా డబ్బులొచ్చాయ్!
రైతుల ఖాతాల్లో రూ.2,423 కోట్లు
హైదరాబాద్ సిటీ, మే 6 (ఆంధ్రజ్యోతి): ‘బీజేపోళ్లు మోదీ గ్యారంటీ అని అంటున్నారు కానీ, మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. మోదీ ఇంటికిపోతున్నాడు. బై బై మోదీ’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య భారత్‌లో ఉందని, 125 దేశాల్లో ఆకలి కేకల లెక్కలు తీస్తే భారత్ 111వ స్థానంలో నిలిచి చెడ్డ పేరు తెచ్చుకుందని, పక్కనే ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే మన దేశంలోనే ఆకలి ఎక్కువ ఉందని సీఎం తెలిపారు. ఇదంతా పదేళ్ల మోదీ హయాంలో జరిగిందని, ఆయన పాలనలో ఉద్యోగాలు రాలేదని, రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని విమర్శించారు. అందుకే ఈసారి మోదీ ఓటమి ఖాయమన్నారు. సోమవారం గ్రేటర్ హైదరాబాద్‌లోని అంబర్‌పేట, ఉప్పల్, కంటోన్మెంట్, పికెట్ చౌరస్తాలలో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్‌షోలలో సీఎం ప్రసంగించారు. మోదీ పదేళ్లుగా ప్రధానిగా ఉన్నా కూడా అంబర్‌పేట బ్రిడ్జిని కిషన్‌రెడ్డి ఎందుకు పూర్తి చేయించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని, అంబర్‌పేటలోని బతుకమ్మకుంటను కబ్జాదారులు అక్రమించి అమ్ముకుంటుంటే కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు అడ్డుకున్నారని గుర్తు చేశారు. అంబర్‌పేట నియోజకవర్గంలో బతుకమ్మ పండుగ వేడుకలను బతుకమ్మ కుంటలోనే ఏర్పాటు చేసే బాధ్యత తనదని హామీనిచ్చారు. బీజేపోళ్లు మెడ మీద వేలాడే కత్తిలాంటోళ్లని, బీజేపీకి పడే ప్రతీ ఓటు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దుకు పోటుగా తయారవుతాయని హెచ్చరించారు. రిజర్వేషన్లు పెంచి పేదలను డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా చేయాలని తాము చూస్తున్నామని, వాటిని దొంగ దెబ్బతీయాలని మోదీ కుట్ర పన్నుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందుకనే ఈ ఎన్నికల్లో 400 సీట్లు కావాలని పిలుపునిస్తున్నారని, ఇది గుర్తించిన బీసీ, ఎస్సీ, ఎస్టీలు మోదీని గద్దె దించటానికి సిద్ధమయ్యారన్నారు.
బీఆర్‌ఎస్ గురించి మాట్లాడటం దండగ
‘బీఆర్‌ఎసోళ్ల గురించి మనం మాట్లాడుకునుడే దండుగ. అది సచ్చినపాము. ఇంకా ఎన్ని రోజులు తండ్రీకొడుకులు అబద్ధాలు చెబుతారు? మీ మోసాలకు కాలం చెల్లింది. మిమ్మల్ని నమ్మేవారు లేరు. బీఆర్‌ఎ్‌సకు గతమే ఉన్నది కానీ భవిష్యత్తు లేదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పదేళ్లు ప్రజలను ముంచి, రాష్ట్రాన్ని కొల్లగొట్టి లక్ష కోట్లు దోచుకున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చి వంద రోజులు కాలేదు, అప్పుడే దిగిపో అంటున్నారని, అయ్యపేరు, తాతపేరు చెప్పి కుర్చీలో కూసోలే బిడ్డా.. కొట్లాడుకుంటూ నీలాంటోళ్లను తొక్కుకుంటూ వచ్చిన.. నువ్వో.. నీ అయ్యనో దిగమంటే దిగనీకి ఇక్కడ ఎవ్వరూ లేరు అల్లటప్పాగా అంటూ దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం ఏమీ చేయలేదని అంటున్న కేటీఆర్.. చీర కట్టుకొని బస్సు ఎక్కాలని టికెట్‌కు పైసలు అడిగితే పథకాలు అమలు కానట్టేనని పునరుద్ఘాటించారు.
రాజేందర్, కేసీఆర్ బొమ్మా బొరుసు
మల్కాజిగిరి స్థానాన్ని బీజేపీకి బీఆర్‌ఎస్ పార్టీ తాకట్టు పెట్టిందని, బంగ్లా ముందు దిష్టిబొమ్మలా బీఆర్‌ఎస్ అభ్యర్థిని పెట్టుకున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 2001 నుంచి 2021 వరకు 20 ఏళ్లు కేసీఆర్‌తో ఒకటే కంచంలో తిని తెలంగాణను విధ్వంసం చేయలేదా? కేసీఆర్ మందేసినప్పుడల్లా కాపలా కూసుని సొల్లుమాటలు చెప్పలేదా? అని పేర్కొన్నారు. రెండేళ్ల కింద పంపకాల్లో తేడా వచ్చి విడిపోయారని, బీసీల కోసమో, ముదిరాజులను బీసీ-ఏలోకి మార్చాలనో, ఎస్సీ వర్గీకరణ కోసమో కాదని చెప్పారు. హుజురాబాద్‌లో ఓడిపోయి ఉప్పల్‌లో తేలి మల్కాజిగిరి సొంతం అంటున్న ఈటెల రాజేందర్‌కు.. ఏవిధంగా మల్కాజిగిరి సొంతమని ప్రశ్నించారు. బీజేపీలోకి పోయి రెండేళ్లవుతున్నా మోదీ, నితిన్ గడ్కరీని ప్లైఓవర్ పనుల గురించి అడిగినవా అని నిలదీశారు. ఈటల రాజేందర్, కేసీఆర్ వేర్వేరు కాదని, ఒకే నాణేనికి బొమ్మ బొరుసు వంటివారన్నారు. తెలంగాణకు పదేళ్లలో వందేళ్లకు సరిపడా విధ్వంసం చేశారని విమర్శించారు. కేసీఆర్ కాళేశ్వరంలో దోచుకుంటే ఈటల ఆర్థికమంత్రిగా సంతకాలు పెట్టి వేల కోట్ల బిల్లులిచ్చిండన్నారు. కరోనా సమయంలో పేదలకు వైద్యం కోసం కార్పొరేట్ కంపెనీలు వందల కోట్లు ఇస్తే వాటిని సంతో్‌షరావు దిగమింగినప్పుడు, వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా రాజేందర్ సంతకాలు చేసిండని దుయ్యబట్టారు. ‘కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల దోపిడీకి పాల్పడుతుంటే ఆ దొంగలకు సద్దులు మోసింది అప్పుడే మరిచిపోయావా? ధరణి ముసుగులో ఔటర్ చుట్టురా వేలాది ఎకరాలను భూములను దొరలను అక్రమించుకుంటుంటే ఆ గడీల దగ్గర కాపలా కాసింది నువ్వు కాదా? గద్దరన్నను ఎర్రటి ఎండలో ప్రగతి భవన్ బయట నాలుగు గంటలు కూర్చోబెట్టి కేసీఆర్ అవమానించినప్పుడు నువ్వు అడిగావా?’ అని విమర్శించారు. వందలాది ఎకరాలతో కూడిన కేటీఆర్ జన్వాడ ఫాంహౌస్ గురించి, గజ్వేల్‌లో కేసీఆర్ ఫాంహౌస్ గురించి ఈటల రాజేందర్.. మోదీకి, అమిత్‌షాకు ఎన్నడైనా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. అలాగే, ఈటలపై కేటీఆర్ కూడా ఏనాడూ విమర్శలు చేయలేదన్నారు. వారి మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు.
Updated Date - May 07 , 2024 | 06:05 AM