పెద్ద బాడిసె.. మూగబాయే!
ABN, Publish Date - Nov 30 , 2024 | 11:51 PM
వడ్రంగులు.. ఒకప్పుడు రైతులకు చేదోడువాదోడుగా ఉండే ఓ నేస్తం. తొలకరి ప్రారంభమైందంటే చాలు అన్నదాతలు కాడి, నాగలి, గుంటుక, దంతె లాంటి వ్యవసాయ పనిముట్లు తయారు చేయించుకునేందుకు వడ్రంగుల చుట్టూ తిరిగేవారు. ఒక్కోసారి రోజుల తరబడి వారిచ్చే పనిముట్ల కోసం వేచిచూసేవారు. నాడు అంత బిజీగా కులవృత్తిని నిర్వహించిన వడ్రంగులు.. యాంత్రీకరణ పుణ్యమా అని దుర్భర జీవితం గడుపుతున్నారు. ఉపాధి కోసం నేటి తరం వారిలో కొందరు పట్టణాలకు పయనమైతే.. ఇంకొందరు తమ వృత్తిపరమైన యాంత్రీకరణను అందిపుచ్చుకుంటున్నారు. మిగిలిన వారు అదే కులవృత్తిని కొనసాగిస్తూ గ్రామాల్లో గడుపుతున్నారు. అయితే పరిస్థితుల ప్రభావంపై తమపై తీవ్రంగా పడిందని.. ఎన్నో కుటుంబాలు సరైన ఉపాధికి నోచుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వాలు కుల వృత్తులకు చేయూతనందిస్తామని చెప్పి మొండి చేయి చూపాయని.. ప్రస్తుత ప్రభుత్వమైనా తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.
దయనీయ స్థితిలో వడ్రంగులు
యంత్రాల రాకతో బతుకులు తారు మారు
పనిలేక ఇతర రంగాల వైపు చూపు
ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
దేవరుప్పుల, నవంబరు 30 : ఒకప్పుడు వడ్రంగికి.. రైతులకు విడదీయలేని బంధం ఉండేది. పంటలు సాగు చేయాలంటే వడ్రంగులు చేసే వ్యవసాయ పనిముట్లు ఎంతో అవసరం. నాడు తొలకరి చినుకులు పడే వరకు వడ్రంగులు చాలా పనుల్లో నిమగ్నమై ఉండే వారు. తెల్లవారు జామునే బాడిసె, ఉలి, గూటం, సుత్తి, పిదసాని, రంపం తదితర పనిముట్లు చేతబట్టి కాడి, నాగలి, గుంటుక, దంతె లాంటి పనిముట్ల తయారు చేసేవారు. కానీ నేడు ఆ పరిస్థితులు మారిపోయాయి. దుక్కి దున్నే దగ్గర నుంచి పంట కోసే వరకు అన్ని యంత్రాలు రావడంతో వడ్రంగుల పరిస్థితి దయనీయంగా మారింది. పూర్వం గ్రామాల్లో వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. అంటే రైతన్నకు కావాల్సిన పనిముట్లు వడ్రంగులు తయారు చేసి ఇస్తే.. పంట చేతికొచ్చిన తర్వాత ఇంతా అని లెక్క చేసి అంత విలువ చేసే ధాన్యం వడ్రంగులకు ఇచ్చేవారు. ఆ ధాన్యంతో వడ్రంగులు సంవత్సరానికి సరిపడా తినడానికి ధాన్యం నిల్వ చేసుకుని.. మిగిలితే ఇతర అవసరాలకు విక్రయించుకునేవారు. ఇలా ఆ రోజుల్లో వడ్రంగుల జీవితాల్లో వెలుగులు ఉండేవి. కాలానుగుణంగా యాంత్రీకరణ కారణంగా వ్యవసాయంలో ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు రావడంతో వడ్రంగులకు వృత్తి పని లేకుండా పోయింది. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది.
జీవన శైలి తారుమారు
వడ్రంగుల జీవనశైలి తారుమారైంది. ఎంతో మంది ఇదే వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. అయితే పరిస్థితుల ప్రభావం కారణంగా పనులు తగ్గాయి. దీంతో కుల వృత్తిని నమ్ముకున్న వారికి భవిష్యత్తు లేదని ఇతర రంగాలవైపు దృష్టి పెడుతున్నారు. అంతే కాకుండా వడ్రంగులకు పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. పనులు చేస్తున్నప్పుడు దుమ్ము, పొట్టు వస్తుండంవల్ల దగ్గు, ఆయాసంతో పాటు కంటిచూపు మందగించడం, నడుము, వెన్నెముక, మోకాళ్లు, కీళ్ల నొప్పుల వంటి జబ్బులు వస్తున్నాయి. దీంతో పాటే పనులు చేస్తున్న సమయంలో చేతులు, కాళ్లకు గాయాలై అవిటివారిగా మారిన సందర్భాలున్నాయి.
వడ్రంగులు తయారు చేసేవి
వడ్రంగులు ముఖ్యంగా వ్యవసాయానికి అవసరమైన పనిముట్లన్నింటినీ తయారు చేస్తారు. నాగలి, గుంటుక, గొర్రు, దంతే, విత్తనపు బొట్టలు, కాడిమాను, ఎడ్లబండ్లు, చక్రాలు మడిగెం మొద్దు, గొడ్డలి కామ, పారకామ, డేకీస పారకామ, తదితర పనిముట్లను రైతులకు కావాల్సిన విధంగా వాటిని తయారు చేసి ఇస్తారు. దీంతో పాటు ఇంటి నిర్మాణం కోసం గడపలు, కిటికీలు, దర్వాజలు, తలుపులు, మంచం, బల్లె పీటలు, దేవుని మండపం తదితర ఫర్నీచర్లను తయారు చేస్తారు.
పట్టణాలకు పయనం
గ్రామాల్లో పనులు లేక వడ్రంగులు పట్టణాలకు పయనమవుతున్నారు. ఇప్పటికే పలువురు యువకులు పట్టణాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకొని తలుపులు, కిటికీలు, డైనింగ్ టేబుల్, బెడ్స్ లాంటివి తయారు చేస్తున్నారు. కొందరు ఫర్నిచర్ తయారు చేసే కంపెనీల్లో చిరు ఉద్యోగులుగా చేరుతున్నారు. మరికొందరు యంత్రాలను సమకూర్చుకుని వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇక పట్టణాలకు వెళ్లలేక ఊరినే నమ్ముకున్న వడ్రంగులు ఇళ్ల వద్దే చిన్నాచితక పనులు చేసుకుంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. గత ప్రభుత్వం కుల వృత్తులకు చేయూతనందిస్తాననీ మొండి చేయి చూపిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించి ఆదుకోవాలని వడ్రంగులు కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
మారోజు బ్రహ్మచారి, సీతారాంపురం
నేడు వ్యవసాయంలో యంత్రీకరణ కారణంగా మా కులవృత్తి కనుమరుగవుతోంది. చేతినిండా పని లేకుండా పోవటంతో పస్తులతో గడపాల్సి వస్తోంది. గతప్రభుత్వాలు అన్ని కుల వృత్తులవారిని ఆదుకుంటామని చెప్పి మొండి చేయి చూఆపయి. కాంగ్రెస్ ప్రభుత్వమైనా వడ్రంగులను ఆదుకొని మా జీవితాల్లో వెలుగు నింపాలి. ఇప్పటికే పనులు దొరకక ఈ తరం పిల్లలు పట్టణాలకు వలస వెళ్తున్నారు.
బీమా సౌకర్యం కల్పించాలి
మారోజు మురళి, సీతారాంపురం
ప్రభుత్వం వడ్రంగులకు బీమా సౌకర్యం కల్పించాలి. పనులు చేసే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలా చేతులు, కాళ్లు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారికి సహాయం చేయడంతో పాటు 50ఏళ్లు నిండిన ప్రతీ వడ్రంగికి పింఛను ఇవ్వాలి.
26వ ఏట చేతి వేళ్లు పోయాయి
మారేపల్లి సోమయ్య, కామారెడ్డిగూడెం
ఇప్పుడు నాకు 57ఏళ్లు. నా 26వ ఏట దూగోడ మిషన్‌లో పడి చేతి వేళ్లన్నీ పోయాయి. అయినప్పటికీ అధైర్య పడకుండా కుటుంబ పోషణకోసం కుల వృత్తిని నమ్ముకొని ఇంటి వద్ద వడ్రంగి పని చేస్తున్నా. అన్నీ యంత్రాలు రావటం వల్ల పనులు పూర్తిగా తగ్గిపోయాయి. కుటుంబ పోషణ భారమై దుర్భర జీవితం అనుభవిస్తున్నాం.
Updated Date - Nov 30 , 2024 | 11:52 PM