సిమెంటు మంట!
ABN, Publish Date - Apr 04 , 2024 | 05:49 AM
సిమెంటు మరింత భారం కానుంది. ధరల పెంపునకు సిమెంటు కంపెనీలు సిద్ధమయ్యాయి. గురువారం నుంచి 50 కిలోల బస్తా ధర రూ.40-50 వరకు పెరగవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో
రూ.40-50 పెరిగే చాన్స్.. నేటి నుంచే అమలుకు కంపెనీల నిర్ణయం?
ఎన్నికల కోడ్, ఎండాకాలంతో మందగించిన నిర్మాణరంగం
ధరల పెంపుతో సిమెంటు అమ్మకాలు తగ్గుతాయని డీలర్ల ఆందోళన
హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): సిమెంటు మరింత భారం కానుంది. ధరల పెంపునకు సిమెంటు కంపెనీలు సిద్ధమయ్యాయి. గురువారం నుంచి 50 కిలోల బస్తా ధర రూ.40-50 వరకు పెరగవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్తా సిమెంటు ధర కంపెనీని బట్టి రూ.260 నుంచి రూ.330 వరకు ఉంటోంది. ఈ ధరలను రూ.300 నుంచి రూ.370 వరకు పెంచాలని కంపెనీలు నిర్ణయించినట్టు సమాచారం. సిమెంటు ఉత్పత్తి వ్యయం పెరిగిపోయినందున ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుత ధర సిమెంటు కంపెనీలకు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని ఓ స్థానిక కంపెనీ ఉన్నతాధికారి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీల్లో నెలకు సగటున 26 లక్షల టన్నుల నుంచి 27 లక్షల టన్నుల సిమెంటువినియోగమవుతోంది. గత నెలలో 27 లక్షల టన్నులను మించింది. దీంతో ధరలు పెంచి కొంతైనా రాబట్టుకునేందుకు ఇదే సరైన సమయమని కంపెనీలు భావిస్తున్నాయి. డీలర్లు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్, వేసవి ఎండలతో నిర్మాణ రంగం మందగించి సిమెంట్ అమ్మకాలు తగ్గాయని, ఈ సమయంలో ధరలు పెంచితే అమ్మకాలు మరింత పడిపోయే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.
Updated Date - Apr 04 , 2024 | 05:49 AM