ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కేడీని దించేశాం.. ఇక మోదీనే!’

ABN, Publish Date - Apr 21 , 2024 | 04:27 AM

రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఢిల్లీ మోదీ, గజ్వేల్‌ కేడీలు కుట్రలు పన్నుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వారిద్దరూ చీకట్లో మాట్లాడుకుంటున్నారన్నారు. మోదీ వచ్చినా, ఆయన తాత దిగి వచ్చినా తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని

ఢిల్లీ మోదీ.. గజ్వేల్‌ కేడీల కుట్రలు.. ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్నేం చేయలేరు

కేసీఆర్‌.. నువ్వు ఖాళీ చేయడానికిది ఫుల్‌బాటిల్‌ కాదు

కాంగ్రెస్‌ సర్కారు జోలికొస్తే బట్టలూడదీసి కొట్టిస్తా

ఉచిత విద్యుత్తు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నరు

కేసీఆర్‌ కారు పనైపోయింది.. ఫాంహౌస్‌ చుట్టూ

పాత సామాన్ల వాళ్లు తిరుగుతున్నారు

మెదక్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డి దుర్మార్గుడు

దుబ్బాకలో రఘునందన్‌ను గెలిపిస్తే ఏం చేశాడు?

మెదక్‌ రోడ్‌షోలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

సిద్దిపేట, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఢిల్లీ మోదీ, గజ్వేల్‌ కేడీలు కుట్రలు పన్నుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వారిద్దరూ చీకట్లో మాట్లాడుకుంటున్నారన్నారు. మోదీ వచ్చినా, ఆయన తాత దిగి వచ్చినా తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని చెప్పారు. వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. శనివారం మెదక్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి.. మెదక్‌లో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్‌ పార్టీని ఖాళీ చేస్తానని, 20 మంది టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నడు.. నువ్వు ఖాళీ చేయడానికి అదేమైన రెండు లీటర్ల ఫుల్‌బాటిల్‌ అనుకుంటున్నవ.. 20 పెగ్గులేస్తే ఖాళీ అవడానికి అది ఫుల్‌బాటిల్‌ కాదు. ఇక్కడ కాపలా ఉన్నదెవడు? బిడ్డా.. టచ్‌చేసి చూడు. మాడి మసైపోతావు. మర్యాదగా ఉండడానికి నేనేమైనా జైపాల్‌రెడ్డి, జానారెడ్డి అనుకున్నవా? మా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో బట్టలూడదీసి రోడ్లమీద ఉరికిచ్చి కొట్టిస్తా. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతావా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబరులో కేడీని గద్దె దించామని ఇప్పుడు మోదీని బొందపెడతామని చెప్పారు.

పేదలు, మహిళలు ఆనందంగా ఉండొద్దా..

125 రోజుల్లో 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారని, తమ అమ్మగారింటికి, అత్తగారింటికి, జాతర్లకు తృప్తిగా పోయివస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. మహిళల ఆనందాన్ని చూడలేక వాళ్ల కళ్లల్లో జీడి పోసుకుంటున్నారని మండిపడ్డారు. పేదలకు వైద్యం అందించకుండా అడ్డుపడటానికి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ను మోదీ, కేసీఆర్‌లు రూ.1200 చేశారని చెప్పారు. తాము ఆడబిడ్డలను ఆదుకునేందుకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నామన్నారు. పేదవాళ్లకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు ఇవ్వడాన్ని కూడా ఓర్చుకుంటలేరని.. మోదీ, కేసీఆర్‌ కడుపులు మండుతున్నాయని దుయ్యబట్టారు. గతంలో వైఎస్‌ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను డబ్బా ఇళ్లని విమర్శించిన కేసీఆర్‌ అనే దద్దమ్మ, సన్నాసి మెదక్‌ జిల్లాలో ఎన్ని ఇళ్లు ఇచ్చాడో చెప్పాలని ప్రశ్నించారు. కమీషన్లు ఇచ్చిన వాళ్లకే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ద్వారా రూ.22,500 కోట్లతో 4 లక్షల ఇళ్లను అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

మెదక్‌ చర్చి, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా..

మెదక్‌ చర్చి, ఏడుపాయల వనదుర్గమ్మ సాక్షిగా వచ్చే పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తానే తీసుకుంటానని రైతులకు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే వానాకాలంలో పండించే వడ్లకు రూ.500 బోనస్‌ ఇచ్చి, కొనుగోలు చేస్తామని చెప్పారు. మామ, అల్లుళ్లు కలిసి మెదక్‌లో ఏం చేశారని ప్రశ్నించారు. అయ్య పేరు, మామ పేరు చెప్పి అధికారంలోకి రాలేదని, నీలాంటి వాళ్లను తొక్కుకుంటూ వచ్చామని రేవంత్‌ అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని బండ కేసి కొట్టాలని, రైతులను చంపిన బీజేపీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ మెదక్‌ ప్రాంతానికి చేసిందేమీ లేదని రేవంత్‌ అన్నారు. ఆయన పనైపోయిందని, లేవలేకుంటా పడ్డారని దుయ్యబట్టారు. కారేమో కార్ఖానాకు పోయిందని, తుక్కు కింద తూకం పెట్టి అమ్మాల్సిందేనని ఎద్దేవా చేశారు.

వాళ్లిద్దరికీ ఒటేస్తే మురిగిపోయినట్లే..

మెదక్‌ లోకసభ స్థానం నుంచి ముదిరాజ్‌ బిడ్డ నీలం మధుకు టికెట్‌ ఇచ్చామని, గెలిపించాలని రేవంత్‌ కోరారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డి ఒక ఖాసీం రజ్వీ అని, మల్లన్నసాగర్‌లో 14 గ్రామాలను ముంచిన దుర్మార్గుడని ఆరోపించారు. కలెక్టర్‌గా ఉండి 50 వేల ఎకరాలు గుంజుకొని వందలాది మంది రైతుల కుటుంబాల మీద కేసులు పెట్టించాడన్నారు. నిజాం రాజుకు ఖాసీం రజ్వీ ఎలాగో.. కేసీఆర్‌కు వెంకట్రామారెడ్డి అలాగే గులాంగిరి చేసి ప్రజలను ఇబ్బంది పెట్టాడని గుర్తుచేశారు. కేసీఆర్‌కు బువ్వ లేనప్పుడు బుక్కెడు బువ్వ పెట్టిన మదన్‌రెడ్డిని కాదని కోట్లు కొల్లగొట్టిన వ్యక్తికి టికెట్‌ ఇచ్చారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు దుబ్బాక ఉప ఎన్నికలో ఎన్నో హామీలు ఇచ్చి ఎగ్గొట్టినందుకు ఓడగొట్టారని వివరించారు. తనను గెలిపిస్తే కేంద్రం నుంచి వేల కోట్లు తెస్తానని చెప్పిన రఘునందన్‌ ఎన్ని వేల కోట్లు తెచ్చాడో చెప్పాలని సవాల్‌ విసిరారు. వీరిద్దరికీ ఓట్లేస్తే మురిగిపోయినట్లేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరారు. 1980లో మెదక్‌ ఎంపీగా గెలిచిన ఇందిరాగాంధీ.. ప్రధానమంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇక్కడ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి, లక్షలాది మందికి ఉపాధి కల్పించారని తెలిపారు. ఆమె మెదక్‌ ఎంపీగా ఉన్నప్పుడే తుదిశ్వాస విడిచారని విచారం వ్యక్తం చేశారు. మెదక్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన ఇందిరమ్మ రుణం తీర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. గత 25 ఏళ్లుగా బీజేపీ, బీఆర్‌ఎ్‌సలను ఇక్కడ గెలిపిస్తే ఒక్క పరిశ్రమను కూడా తేలేదని ఆరోపించారు.

కాగా, ప్రచారంలో భాగంగా భువనగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పర్యటించనున్నారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రఛారం నిర్వహించనున్నారు.

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి

నామినేషన్‌ దాఖలు చేయని నీలం మధు

మెదక్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు శనివారం తన నామినేషన్‌ సమర్పించడానికి అట్టహాసంగా ఏర్పాట్లు చేసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు సైతం హాజరయ్యారు. అయితే ప్రణాళికాలోపం కారణంగా మధు నామినేషన్‌ దాఖలు చేయలేకపోయారు. ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్‌ పత్రాలను స్వీకరిస్తారు. సీఎం రోడ్‌ షో తర్వాత నామినేషన్‌ దాఖలు చేయాలని భావించారు. కానీ, ఆయన ఆలస్యంగా రావడంతో రోడ్‌షో పూర్తయ్యేసరికి సమయం మించిపోయింది. ఇప్పటికే ఈ నెల 18న నీలం మధు తరఫున మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

Updated Date - Apr 21 , 2024 | 04:27 AM

Advertising
Advertising