Musi River: మూసీ పునరుజ్జీవానికి థేమ్స్ ప్లాన్.. లండన్ టూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు
ABN, Publish Date - Jan 19 , 2024 | 09:59 PM
ఒకప్పుడు హైదరాబాద్‌లోని మూసీ నది నిండుకుండలా పారేది. కానీ.. ఇప్పుడది చెత్తదిబ్బలా మారింది. అటువైపు నుంచి వెళ్తే.. ఒకటే కంపు వాసన వస్తుంటుంది. దీని పునరుజ్జీవానికి గత ప్రభుత్వం ప్రయత్నాలైతే చేసింది కానీ, అవి ఫలప్రదం కాలేదు. అయితే.. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దీని పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం కంకణం కట్టుకున్నారు.
ఒకప్పుడు హైదరాబాద్‌లోని మూసీ నది నిండుకుండలా పారేది. కానీ.. ఇప్పుడది చెత్తదిబ్బలా మారింది. అటువైపు నుంచి వెళ్తే.. ఒకటే కంపు వాసన వస్తుంటుంది. దీని పునరుజ్జీవానికి గత ప్రభుత్వం ప్రయత్నాలైతే చేసింది కానీ, అవి ఫలప్రదం కాలేదు. అయితే.. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దీని పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా.. ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తెలుసుకునేందుకు లండన్‌లో పర్యటించారు.
లండన్‌లో ఉన్న థేమ్స్ నదిని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ నదిని నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. గురువారం నాడు అక్కడి థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా.. దశాబ్దాలుగా వివిధ దశల్లో చేపట్టిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను వాళ్లు సీఎంకు వివరించారు. తమకు ఎదురైన సవాళ్ల దగ్గర నుంచి ఖర్చైన నిధులు, భాగస్వామ్యమైన సంస్థలు, అందంగా తీర్చిదిద్దేందుకు అనుసరించిన అత్యుత్తమ విధానాల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందాయన్నారు. హైదరాబాద్ నగరానికి కూడా అలాంటి ప్రత్యేకత ఉందని, మూసీ నది వెంబడి హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ లాంటి నదీ వ్యవస్థ కేంద్రంగా భాగ్యనగరం అభివృద్ధి చెందిందని అన్నారు. పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా మూసీకి పునర్వైభవం తీసుకొచ్చే.. నదులు, సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా మారుతుందన్నారు. అటు.. మూసీ నదిని పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చింది.
తన విజన్ 2050కు అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి లండన్ అధికారులతో జరిపిన చర్చల్లో భాగంగా.. నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం, ఎంచుకున్న ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనం ఉండే రెవిన్యూ మోడల్‌ను ఎంచుకోవాలని అధికారులు సీఎంకి వివరించారు. ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే కొత్త విధానాలు ఎప్పటికప్పుడు గమనించటంతో పాటు, ప్రాజెక్టు నిర్వహణపై నిరంతరం దృష్టి పెట్టాలని సూచించారు. ఇదే సమయంలో.. ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్ లైన్, వివిధ సంస్థల భాగస్వామ్యంపైన కూడా చర్చించినట్టు తెలిసింది.
Updated Date - Jan 19 , 2024 | 09:59 PM