జేఎన్‌టీయూ కాలేజీ సెమిస్టర్ ఫలితాల్లో గందరగోళం
ABN, Publish Date - Mar 19 , 2024 | 03:59 AM
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ కాలేజీ గత శనివారం విడుదల చేసిన థర్డ్‌ఇయర్ మొదటి సెమిస్టర్ ఫలితాలు కొందరు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జాతీయ విద్యా విధానం ప్రకారం బీటెక్‌లో మేజర్ డిగ్రీతోపాటు ఒక మైనర్ డిగ్రీని విద్యార్థులు అభ్యసించేందుకు జేఎన్‌టీయూ అవకాశం
తప్పులతడకగా థర్డ్ ఇయర్ మొదటి సెమిస్టర్ మార్కుల మెమోలు
హైదరాబాద్ సిటీ, మార్చి 18 (ఆంఽధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ కాలేజీ గత శనివారం విడుదల చేసిన థర్డ్‌ఇయర్ మొదటి సెమిస్టర్ ఫలితాలు కొందరు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జాతీయ విద్యా విధానం ప్రకారం బీటెక్‌లో మేజర్ డిగ్రీతోపాటు ఒక మైనర్ డిగ్రీని విద్యార్థులు అభ్యసించేందుకు జేఎన్‌టీయూ అవకాశం కల్పించింది. గతేడాది నుంచి ఈ విధానం అమల్లో ఉంది. ప్రస్తుతం థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తమ మేజర్ డిగ్రీ సబ్జెక్టులతో మైనర్ డిగ్రీ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు రాయగా.. ఆయా సబ్జెక్టులకు వచ్చిన మార్కులు/గ్రేడ్‌లు సక్రమంగానే వచ్చినప్పటికీ వాటి మొత్తం కలిపితే వచ్చే ఎస్‌జీపీఏలో తప్పులు దొర్లాయి. కొందరికి తక్కువగా గ్రేడ్ పాయింట్లు రాగా, మరికొందరికి సున్నా మార్కులు వచ్చినట్లు తెలిసింది. ఫలితాల ప్రాసెసింగ్ వ్యవస్థలో లోపాల కారణంగా మార్కుల మెమోల్లో తప్పిదాలు జరిగినట్లు ప్రొఫెసర్లు చెబుతున్నారు. ఇంకోవైపు విద్యార్థుల ఆన్సర్‌షీట్లను ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేసిన ప్రొఫెసర్లు వారికి కొన్ని సబ్జెక్టుల్లో సున్నా మార్కులు కూడా వేసినట్లు తెలిసింది. ప్రశ్నపత్రంలోని మొదటి ప్రశ్నకు కేటాయించిన ఖాళీలో వేరొక ప్రశ్నకు రాయాల్సిన జవాబును రాయడం, జవాబు పత్రాలను యథాతథంగా స్కాన్‌చేసి ఆన్‌లైన్ ఎవాల్యుయేషన్ కోసం అప్‌లోడ్ చేయడం వంటి పొరపాట్లు జరిగాయి. ఆయా సబ్జెక్టుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన ప్రొఫెసర్లు సదరు విద్యార్థులకు సున్నా మార్కులు వేశారు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో టెక్నికల్ సిబ్బంది కొరత, కాలేజీ పరీక్షల విభాగాన్ని పర్యవేక్షించే అధికారులకు ఫలితాల ప్రాసెసింగ్‌పై అవగాహన లేకపోవడంతో సకాలంలో ఫలితాలు రావడంలేదని తెలుస్తోంది. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా..కాలేజీలో టెక్నికల్ సిబ్బంది కొరతపై యూనివర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. యూనివర్సిటీ పరీక్షల విభాగం నుంచి కొందరు సిబ్బందిని సర్దుబాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ వీసీ, రిజిస్ట్రార్ స్థాయి ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో.. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియడంలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Mar 19 , 2024 | 09:02 AM