యాదగిరికొండపై భక్తుల రద్దీ
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:38 AM
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో యాదగిరికొండ ఆదివారం రద్దీగా మారింది.
భువనగిరి అర్బన్, సెప్టెంబరు 15: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో యాదగిరికొండ ఆదివారం రద్దీగా మారింది. వారాంతపు సెలవు రోజు కావడంతో ఇష్టదైవాలను దర్శించుకు నేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 20వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి వచ్చారు. ప్రత్యేక, ధర్మదర్శన క్యూలైన్లు భక్తులతో రద్దీ నెలకొంది. ప్రధానాలయం, కల్యాణోత్సవం, వ్రత మండపాలు, ఆలయ తిరువీధులు, ప్రసాద విక్రయశాలల్లో వద్ద కూడా రద్దీ నెలకొంది. ఆలయ ఉత్తర దిశలో భక్తులు ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. భక్తులను కొండపైకి తరలించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.40,05,735ల ఆదాయం సమకూ రినట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు. సుప్రభాత సేవతో స్వామి అమ్మవారిని మేల్కొపిన అర్చకస్వాములు స్వయంభువులకు నిత్యపూజలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండపంలో హోమం, నిత్య కల్యాణోత్సవ పర్వాలు వైభవంగా చేపట్టారు. అదేవిధంగా పాతగుట్ట స్వామి అమ్మవారికి నిత్య పూజలు ఘనంగా చేపట్టారు. శివాలయంలో పర్వతవర్థిని సమేత రామలింగేశ్వర స్వామివారికి నిత్య పూజలు, రుద్రహవన పూజలు, శైవాగమరీతిలో జరిపారు. రాత్రి మహానివేదన, శయనోత్సవాలతో ఆలయ ద్వారబంధనం చేశారు. కాగా, ఎమ్మెల్సీ సీహెచ్ నవీన్‌కుమార్(తీన్మార్ మల్లన్న) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామిఅమ్మవారలకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో లడ్డు ప్రసాదం అందజేశారు. అదేవిధంగా ఈ నెల 18న వ్రత మండపంలో హుండీ కానుకల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు.
Updated Date - Sep 16 , 2024 | 12:38 AM