ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఫాదరే.. గాడ్‌ఫాదర్‌ నాన్న .. గెలిపిస్తాడా?

ABN, Publish Date - Apr 19 , 2024 | 05:04 AM

రాజకీయాల్లో రాణించాలంటే.. ఓ గాడ్‌ ఫాదర్‌ ఉండాలంటారు. ఆ గాడ్‌ ఫాదర్‌.. సొంత తండ్రే అయితే? ఇక ఆ వారసులకు తిరుగుండదు. ఇందుకు గతంలో చాలా ఉదాహరణలున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల సమరంలో

పార్లమెంటు ఎన్నికల బరిలో

సీనియర్‌ రాజకీయ నేతల వారసులు

వరంగల్‌లో కడియం కావ్య

గెలుపుకోసం కడియం శ్రీహరి ఆరాటం

పెద్దపల్లిలో గడ్డం వంశీ ఎన్నికల

బాధ్యతల్లో.. ఎమ్మెల్యే వివేక్‌ బిజీబిజీ

నల్లగొండలో జానారెడ్డి బ్రాండ్‌తో

బరిలో కుందూరు రఘువీర్‌ రెడ్డి

నాగర్‌కర్నూల్‌లో పోతుగంటి

రాములు వారసుడిగా భరత్‌ ప్రసాద్‌

పార్లమెంటు ఎన్నికల బరిలో సీనియర్‌ రాజకీయ నేతల వారసులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో రాణించాలంటే.. ఓ గాడ్‌ ఫాదర్‌ ఉండాలంటారు. ఆ గాడ్‌ ఫాదర్‌.. సొంత తండ్రే అయితే? ఇక ఆ వారసులకు తిరుగుండదు. ఇందుకు గతంలో చాలా ఉదాహరణలున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల సమరంలో కొన్ని నియోజకవర్గాల్లో ఇదే సీన్‌ కనిపిస్తోంది. మూడు, నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తున్న సీనియర్‌ నేతలు కొందరు.. ఈ ఎన్నికల్లో తమ వారసులను బరిలో దింపారు. పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించి, మెప్పించి ఎంపీ టికెట్‌ ఇప్పించడంతో సరిపెట్టకుండా.. వారి ఎన్నికల ప్రచారం, గెలుపు బాధ్యతలను కూడా తండ్రులే తమ భుజాలపై వేసుకున్నారు. ఆ బాధ్యతలు మోస్తున్నవారిలో.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, గడ్డం వివేకానంద లాంటివారు ఉన్నారు. అంతేకాదు.. వారసులు పోటీచేస్తున్న ఎంపీ స్థానాల పరిధిలోనే వీరి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక.. కుందూరు జానారెడ్డి, పోతుగంటి రాములు తాము పోటీచేయకుండా వారసులకు టికెట్లు ఇప్పించుకున్నారు. ఇలా తండ్రుల పరపతితో బరిలోకి దిగిన వారసులను.. ‘నాన్న గెలిపిస్తాడా?’ అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.

కూతురి కోసం

వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గం(ఎస్సీ) నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా.. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్‌ కడియం కావ్య బరిలో దిగారు. వైద్యసేవలతోపాటు సామాజిక సేవలోనూ కొంతకాలంగా నిమగ్నమైన కావ్య.. ఇటీవలే రాజకీయ రంగప్రవేశం చేశారు. కొంతకాలంగా ఆమెను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించిన కడియం శ్రీహరి.. గత ఎన్నికల్లో వరంగల్‌ పార్లమెంటు, వర్దన్నపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే టికెట్ల కోసం కూడా ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్లో అవకాశాలు రాలేదు. ఈసారి వరంగల్‌ ఎంపీగా పోటీచేసే ఛాన్స్‌ తొలుత బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చింది. అయితే అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేస్తే... గెలుస్తామనే నమ్మకం లేకపోవడంతో కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపారు. కాంగ్రె్‌సలో చేరిన వెంటనే అదే వరంగల్‌ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీ టికెట్‌ సాధించారు. ప్రచారపర్వంలో నిమగ్నమయ్యారు. కడియం శ్రీహరికి పలు ఎన్నికల్లో పోటీచేసిన అపార అనుభవం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కూడా! ఆ నియోజకవర్గంతోపాటు పాలకుర్తి, పరకాల, వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, వర్దన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు వరంగల్‌ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. వీటన్నింటిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. కావ్యకు ఎన్నికల్లో పోటీచేసిన అనుభవం లేకపోవటంతో.. శ్రీహరి అంతా తానై ఎన్నికల ప్రచారాన్ని నడిపిస్తున్నారు.

బ్రాండ్‌ జానారెడ్డి..

నల్లగొండ నుంచి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా.. సీనియర్‌ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని జానారెడ్డి.. చిన్న కుమారుడు జయవీర్‌రెడ్డిని నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయించి గెలిపించుకున్నారు. ఇప్పుడు పెద్దకుమారుణ్ని ఎంపీగా గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. ఎన్టీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన జానారెడ్డి.. 1983, 1985, 1989, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. ఇలా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి.. ఉమ్మడి ఏపీలో దీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయనకు మంచి పట్టుంది. నల్లగొండ పార్లమెంటు పరిధిలోని దేవరకొండ, నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క సూర్యాపేట మినహా మిగతా ఆరు చోట్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఉత్తమ్‌ సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, హుజూర్‌నగర్‌, కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు... జానా మరో కుమారుడు జయవీర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సాగర్‌ సెగ్మెంట్లు కూడా నల్లగొండ పార్లమెంటు పరిధిలోనే ఉండటం గమనార్హం. దీంతో వారందరినీ సమన్వయం చేసుకుంటూ రఘువీర్‌ విజయం కోసం జానారెడ్డి కృషిచేస్తున్నారు.

తన స్థానాన్ని కుమారుడికి ఇప్పించి మరీ..

నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్‌ ప్రసాద్‌ బరిలో దిగారు. మాజీ ఎంపీ, మాజీ మంత్రి పోతుగంటి రాములు తనయుడైన భరత్‌... వృత్తిరీత్యా న్యాయవాది. గత ప్రాదేశిక ఎన్నికల్లో కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యునిగా పోటీచేసి గెలుపొందారు. నాగర్‌ కర్నూల్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న రాములు ఇటీవలే బీఆర్‌ఎ్‌సకు గుడ్‌బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాను ఎన్నికల్లో పోటీచేయకుండా... తనయుడు భరత్‌కు బీజేపీ నుంచి ఎంపీ టికెట్‌ ఇప్పించుకున్నారు. రాములుకు పాలమూరు జిల్లా రాజకీయాల్లో మంచి గుర్తింపు ఉంది. 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. 1994, 1999, 2009 ఎన్నికల్లో అచ్చంపేట నుంచి టీడీపీ తరఫున పోటీచేసి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత బీఆర్‌ఎ్‌సలో చేరి 2019 ఎంపీగా గెలుపొందారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారాన్ని కోల్పోవటంతో బీజేపీలో చేరి... తనయుడు భరత్‌ను తన సిట్టింగ్‌ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దింపారు. కాగా నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో... ఐదు చోట్ల కాంగ్రెస్‌, రెండు చోట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన పరపతితో పాటు, మోదీ బ్రాండ్‌ ఫార్ములా కూడా కలిసొస్తుందనే ఆలోచనతో రాములు బీజేపీ నుంచి కుమారుడికి టికెట్‌ ఇప్పించి ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

నాన్న, పెదనాన్న తోడుగా..

పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి కాకా (గడ్డం వెంకటస్వామి) మనవడు వంశీ ఎన్నికల బరిలో దిగారు. కాకా వారసులుగా గడ్డం వినోద్‌, వివేక్‌ రాజకీయాల్లో రాణిస్తుండగా.. మూడోతరం రాజకీయ వారసుడిగా వివేక్‌ తనయుడు వంశీ క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించారు. కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌, బీజేపీలకు వలసపోయి, తిరిగి సొంతగూటికి (కాంగ్రెస్‌) చేరిన వివేక్‌.. గత ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంటు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన సోదరుడు, వంశీకి పెద్దనాన్న అయిన గడ్డం వినోద్‌.. బెల్లంపల్లి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ రెండు సీట్లూ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోనే ఉండటం గమనార్హం. మిగతా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ (పెద్దపల్లి, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, మంథని) కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైపెచ్చు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కాకా కుటుంబానికి మంచి పట్టు ఉంది. గడ్డం వెంకటస్వామి 4 సార్లు పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో వివేక్‌ కూడా పెద్దపల్లి ఎంపీగా గెలుపొందారు. వినోద్‌ 2004లో చెన్నూరు, 2023లో బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలోనే తన తనయుడు గడ్డం వంశీకి ఎంపీ టికెట్‌ ఇప్పించుకున్న వివేక్‌.. ఇప్పుడు ప్రచార బాధ్యతలను కూడా తానే నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 05:04 AM

Advertising
Advertising